Begin typing your search above and press return to search.

తిరుమలలో చంద్రబాబుపై మోదీ సెటైర్లు

By:  Tupaki Desk   |   10 Jun 2019 4:10 AM GMT
తిరుమలలో చంద్రబాబుపై మోదీ సెటైర్లు
X
తిరుమల వెంకటేశుని దర్శనానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం ప్రజా ధన్యవాద సభలో మాట్లాడుతూ ఏపీకి అన్ని విధాలా ఆర్థిక సహకారం అందిస్తామని ప్రకటించారు. అయితే.. ఈ సహకారం ఎలా ఉంటుందని ఆయన స్పష్టంగా చెప్పనప్పటికీ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని మాత్రం స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆయన ఏపీ మాజీ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబుపై పరోక్షంగా కామెంట్లు చేశారు. కొందరు నేతలు ఓటమి పాలైతే జనం వైపు చూడనే చూడరని.. జనంలోకి రారని.. కానీ, తామలా కాదని... తమకు ఓటేసినా వేయకపోయినా ప్రజల్లోనే ఉంటామని - ప్రజాసేవలోనే ఉంటామని అన్నారు.

తిరుపతిలో బీజేపీ నిర్వహించిన ప్రజాధన్యవాద సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రెండోసారి ప్రధాని అయ్యాక తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ‘మా వరకు ఎన్నికల అధ్యాయం ముగిసిపోయింది. 130 కోట్ల మందికి సేవ చేసే అధ్యాయం ప్రారంభమైంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్ రెడ్డికి శుభాకాంక్షలు. జగన్ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నా. ఏపీ అభివృద్ధికి - ప్రజలకు పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇస్తున్నా.’ అని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నో అంశాల్లో ముందుంటుందని ప్రధాని మోదీ చెప్పారు. వ్యవసాయం నుంచి విజ్ఞానం వరకు, ఇన్నొవేషన్ నుంచి స్టార్టప్స్ వరకు ఏపీ.. కొత్త మార్గంలో పయనిస్తుందని మోదీ అన్నారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితేనే నవభారతం నిర్మాణం అవుతుందని ప్రధాని మోదీ అన్నారు.

కాగా తిరుపతి సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘మళ్లీ నాకు అధికారం ఇచ్చిన భారతదేశ ప్రజలకు బాలాజీ పాదపద్మాల సాక్షిగా కృతజ్ఞతలు. స్వామికి ప్రణామాలు.’ అని తెలుగులో ప్రసంగం చేశారు. అలాగే, నమో వెంకటేశం నమామి అంటూ పద్యం చదివారు. ‘‘భాజపా కార్యకర్తలు కర్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. మున్సిపల్‌ వార్డు గెలవలేని రోజుల్లోనూ భారత్‌ మాతాకీ జై అన్నారు. భాజపా కార్యకర్తలు ఎన్నికలప్పుడే ప్రజలకు కనిపించేవాళ్లు కాదు. ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై పనిచేస్తారు. అధికారంలోకి రావడమే కాదు.. ప్రజాసేవకు అంకితమవ్వాలి. జనంలో.. జనంతో ఉంటేనే ప్రజా హృదయాలు గెలుస్తాం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కనబరిచిన ఏపీ - తమిళనాడు ప్రజలకు అభినందనలు. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా’’ అన్నారు. శ్రీలంక నుంచి రావడం ఆలస్యమైనందుకు తనను క్షమించాలని కార్యకర్తలను మోదీ కోరారు.