Begin typing your search above and press return to search.

త‌లాక్‌ పై మోదీ మాట ఇదే!

By:  Tupaki Desk   |   22 Aug 2017 11:15 AM GMT
త‌లాక్‌ పై మోదీ మాట ఇదే!
X
ముస్లిం వ‌ర్గాలు స‌హా కేంద్ర ప్ర‌భుత్వం - ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు.. ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూసిన త‌లాక్‌ పై తీర్పు రానే వ‌చ్చేసింది. ఇది ముస్లిం మ‌హిళ‌ల స్వేచ్ఛ‌ను హ‌రించే ఉదంతంగా దేశ అత్యున్న‌త ధ‌ర్మాస‌నం సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. త‌లాక్ సంస్కృతి మ‌హిళ‌ల స్తితిగ‌తుల‌పై దాఖ‌లైన పిటిష‌న్‌ ను సుదీర్ఘంగా విచారించిన సుప్రీం కోర్టు అటు ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు స‌హా కేంద్రం నుంచి కూడా అన్ని అభిప్రాయాల‌నూ సేక‌రించింది. ష‌రియా చ‌ట్టంలోని అంశాల‌నూ ప‌రిశీలించింది ఎట్ట‌కేల‌కు తుది తీర్పుగా దీనిని రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని స్ప‌ష్టంచేసింది.

ఇక‌, ద‌శాబ్దాలుగా ముస్లిం మ‌హిళ‌ల‌కు ప్రాణ సంక‌టంగా ప‌రిణ‌మించిన త‌లాక్ సంస్కృతిపై సుప్రీం తీర్పు నెగిటివ్‌ గా రావ‌డంతో దేశంలోని ముస్లిం మ‌హిళ‌లను స‌మ‌ర్ధించే ప్ర‌తి ఒక్క‌రూ సంబ‌రాల్లో మునిగిపోయారు. సుప్రీం తీర్పుపై పలు వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ అయితే, ఏకంగా దీనినొక చారిత్రాత్మకమైన తీర్పని - మహిళా సాధికారతకు కొలమానమని కొనియాడారు. ‘‘ట్రిపుల్‌ తలాక్‌ అంశంపై ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. ముస్లిం సమాజంలో మహిళలు కూడా పురుషులతో సమానమనే భావనను ఈ తీర్పు ఎలుగెత్తి చాటింది. ఇది మహిళా సాధికారతకు ఒక శక్తివంతమైన కొలమానం కూడా’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

ఇక‌, ఇదే అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మీడియాతో మాట్లాడుతూ.. ట్రిపుల్‌ తలాక్‌ పై సుప్రీం తీర్పును బీజేపీ స్వాగతిస్తున్నదని, దీనిని ఒక వర్గం ఓటమిగానో, ఇంకొకవర్గం గెలుపుగానో చూడవద్దని కోరారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రులు - న్యాయవాది కపిల్‌ సిబాల్‌.. సుప్రీం తీర్పు.. మహిళల‌ వ్యక్తిగత హక్కులను పరిరక్షిస్తుందని అన్నారు. మరో మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ మాట్లాడుతూ ‘మేం ఊహించిన - కోరుకున్న తీర్పే వచ్చింది’ అని అన్నారు. సో.. ఇలా సుప్రీం తీర్పుపై దేశం మొత్తం విప‌క్షం - అధికార ప‌క్షం అనే తేడా లేకుండా హ్యాపీ హ్యాపీగా ఫీల‌వ‌డం విశేషం!!