Begin typing your search above and press return to search.

మోడీ దూకుడు త‌గ్గిందా?

By:  Tupaki Desk   |   29 Aug 2015 6:10 AM GMT
మోడీ దూకుడు త‌గ్గిందా?
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి అత్యంత ప్రీతిపాత్ర‌మైన అంశం భూ సేక‌ర‌ణ‌. భూ సేక‌ర‌ణ‌లో కొత్త అంశాలు జొప్పిస్తూ మోడీ తీసుకున్న నిర్ణ‌యాలను ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్రంగా వ్య‌తిరేకించాయి. దీంతో మోడీ ఆర్డినెన్స్‌ లు తీసుకువ‌చ్చారు. అనంత‌రం బిల్లు ఆమోదం పొందేందుకు ప్ర‌య‌త్నం చేసిన ఇప్ప‌టికీ మూడు ద‌ఫాలుగా చుక్కెదురు అయింది. అయితే మోడీ తాజాగా వెన‌క్కుత‌గ్గారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

ఆగస్టు 30వ తేదీతో భూసేకరణ ఆర్డినెన్స్ గ‌డువు ముగిసిపోతుంది. ఈ లోగానే ఈ ఆర్డినెన్స్ కొనసాగేలా నాలుగోసారి ఆర్డినెన్స్ గడువు పొడిగిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర పడాలి. అయితే నాలుగోసారి ఆర్డినెన్స్ కు రాష్ట్రపతికి సిఫార్సు చేయరాదని కేబినెట్ భావిస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ ఆర్డినెన్స్ కు కాలదోషం పడితే.. 2013 భూ సేకరణ చట్టం కింద రైతులకు ప్రయోజనాలు పొందేందుకు వీలు కల్పిస్తూ త్వరలో ప్రభుత్వం జీవో జారీ చేసే అవకాశం ఉంది.

బీహార్ ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద భూసేకరణ ఆర్డినెన్స్ కాలదోషం పట్టినా...చూస్తూ ఊరుకునేందుకే కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్లు కన్పిస్తోంది. అక్టోబర్ నెలలో బీహార్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలలోగా మళ్లీ భూ సేకరణ ఆర్డినెన్స్ ను జారీ చేయ‌కూడదని సర్కార్ కోరుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల‌న్ని రాజ్యసభలో సమైక్యంగా బిల్లును అడ్డుకోవడంతో ఆర్ఢినెన్స్ స్థానే వచ్చిన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందలేదు.

ప్రధాని నరేంద్రమోడీ కొత్త బిల్లు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నా.. ప్రతిపక్షాల వాదనకే రైతులలోనూ మద్దతు లభించినట్లు కన్పిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ముందు స‌మ‌యంలో ఎందుకు లేని తంటాలు తెచ్చుకోవ‌డం అని మోడీ వెన‌క్కుత‌గ్గిన‌ట్లు స‌మాచారం.