Begin typing your search above and press return to search.

బిజేపి ఎన్నికల తాయిలాలు షురూ....!

By:  Tupaki Desk   |   22 July 2018 11:59 AM GMT
బిజేపి ఎన్నికల తాయిలాలు షురూ....!
X
కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ లోక్‌ సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత కేంద్రలో కదలిక వచ్చింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమకు మేలు జరగదని - ఓటమి ఖాయమని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాకూడదని నిర్ణయించుకున్నారు. ఎన్నికలలోపు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే జిఎస్టీ మండలి సమావేశాన్ని అదరా బదరాగా నిర్వహించారు. శనివారం జరిగిన ఈ సమావేశంలో దాదాపు 88 వస్తువులపై - సేవలపై జిఎస్టీని 10 శాతం తగ్గించారు. చిన్న వర్తకులకు - సామాన్య - మధ్య తరగతి ప్రజలకు మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు.

మహిళ ఓటర్లను లక్ష్యంగా చేసుకున్న భారతీయ జనతా పార్టీ వాళ్లని ఆకట్టుకునేందుకు ప్రారంభించింది. ఇందుకోసం నిల్వచేసిన పాలు - పాలరాతి దేవుడి విగ్రహాలు - విస్తరాకులు చింతపండు పొడి - రాఖీలు వంటి వాటిపై జిఎస్టీ పన్నును గణనీయంగా తగ్గించారు. ఇక మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకుందుకు ఫ్రిజ్‌ లు - టీవీలు - వాషింగ్ మేషీన్లు - మిక్సీలు వంటి వాటిపై జిఎస్టీలో పన్నును తగ్గించారు. ఇలా సమాజంలో రెండు వర్గాలకు అనుకూలించే నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో అత్యధిక శాతం ఓటర్లు ఉన్న వ్యవసాయ రంగంపై కూడా కనికరం చూపించారు. దేశంలో దిగుమతి అయ్యే యూరియా - విద్యుత్ కనేక్షన్ల మౌలిక సదుపాయాలు వంటి వాటిపై జిఎస్టీ తగ్గించారు. వీటి ద్వారా రైతుల ఓట్లను కొల్లగొట్టాలన్నది బిజేపి వ్యూహం. అవిశ్వాస తీర్మానం వీగిపోయిన మరుసటి రోజే ఇంతటి కీలక నిర్ణయాలను తీసుకోవడం భారతీయ జనతా పార్టీ ఓటమి భయాన్ని తేటతేల్లం చేసింది. ఇది ముందు ముందు కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం ముందు ముందు తీసుకునే నిర్ణయాలకు నాందీ వాచకం.