Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు తర్వాతే మోడీనే మొనగాడంట

By:  Tupaki Desk   |   6 Oct 2015 3:41 AM GMT
ఆ ముగ్గురు తర్వాతే మోడీనే మొనగాడంట
X
దేశీయంగా ప్రధాని మోడీ పాలనా తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. అంతర్జాతీయంగా మాత్రం ఆయన దూసుకెళుతున్నారు. ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకి మోత అన్న చందంగా.. మోడీ పాలనపై దేశీయంగా పెదవి విరుపులు కనిపిస్తుంటే.. అంతర్జాతీయ వేదికల మీద మాత్రం.. గత ప్రధానుల కంటే చాలా చురుకుగా వ్యవహరిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్న ఆయన.. ఇప్పటికే తన మార్క్ ను అంతర్జాతీయంగా ప్రదర్శించగలిగారు. తాజాగా అమెరికా పర్యటన సూపర్ సక్సెస్ అయి.. మాంచి ఊపు మీదున్న ఆయనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చే అంశం ఒకటి చోటు చేసుకుంది.

ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ఆర్థికవేత్తలు.. రాజకీయ వేత్తలు.. వెంచర్ కేపిటలిస్ట్ లు.. బ్యాంకర్లు.. కార్పొరేట్ దిగ్గజాలు లాంటి వారిని ఎంచి ఒక జాబితగా తయారు చేసి.. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులుగా బ్లూమ్ బర్గ్ ఒక జాబితాను రూపొందిస్తుంది. తాజాగా ఇందులోప్రధాని మోడీకి స్థానం దక్కింది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న తొలి భారత ప్రధాని మోడీనే కావటం గమనార్హం.

బ్లూమ్ బర్గ్ జాబితాలో 13వ స్థానంలో మోడీ నిలిచారు. మోడీ కంటే ముందున్న రాజకీయ నేతలు చూస్తే.. అమెరికా అధ్యక్షులు ఒబామా.. జర్మనీ ఛాన్సెలర్ ఎంజెలా మోర్కెల్.. చైనా ప్రధాని జిన్ పింగ్ లు మాత్రమే ఉండటం గమనార్హం. ఈ జాబితాలో తొలి స్థానాన్ని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జానెట్ ఎలెన్ అగ్రస్థానంలో నిలిచారు.

మోడీ గురించి కీర్తించిన బ్లూమ్ బర్గ్.. 30 ఏళ్ల తర్వాత మోడీ నేతృత్వంలో భారత్ లో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇక.. గత ఏడాది ఇదే జాబితాలో స్థానం సంపాదించుకున్న ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్.. ఎస్ బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్యలిద్దరి పేర్లు ఈసారి జాబితాలో చోటు చేసుకోలేదు. మొత్తానికి మోడీ.. తన సత్తాను అంతర్జాతీయ సమాజం మీద బాగానే ప్రదర్శిస్తున్నారని చెప్పక తప్పదు.