Begin typing your search above and press return to search.

ఎన్నికల ప్రచారంలో మోదీని వాడేస్తున్న విదేశీ నేతలు

By:  Tupaki Desk   |   17 Sep 2019 11:21 AM GMT
ఎన్నికల ప్రచారంలో మోదీని వాడేస్తున్న విదేశీ నేతలు
X
ప్రధాని నరేంద్ర మోదీ ఇండియాలో బీజేపీకి సూపర్ స్టార్ క్యాంపెయినర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. 2014 - 19 ఎన్నికల్లో అది రుజువైంది. ఇప్పుడు ఇతర దేశాల నేతలు కూడా కొందరు మోదీ పాపులారిటీని తమ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ నేత బెంజిమన్ నెతన్యాహు తమ దేశ ఎన్నికల్లో మోదీని వాడుకున్నారు. నెతన్యాహు తన ప్రచారంలో మోదీతో తాను ఉన్న ఫొటోలను విస్తృతంగా వాడారు. నెతన్యాహు పార్టీ కార్యాలయం బయట కూడా మోదీ పోస్టర్లు భారీగా ఏర్పాటు చేశారు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సాధించిన మోదీ తనకు సన్నిహితుడన్న సందేశాన్ని ఇజ్రాయెల్ ప్రజల్లోకి పంపి లాభపడేందుకు నెతన్యాహు అలా చేశారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా రానున్న అధ్యక్ష ఎన్నికల్లో తన తరఫున మోదీని ప్రచారంలో వినియోగించుకునే పనిలో పడ్డారు.

నరేంద్ర మోదీ ఈ నెల 22న టెక్సాస్‌ లోని హూస్టన్‌ లో జరగనున్న భారతీయ-అమెరికన్ల సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరవుతుండడం అందులో భాగమే. ‘హౌడీ మోదీ-షేర్డ్ డ్రీమ్స్ - బ్రైట్ ఫ్యూచర్’ పేరుతో టెక్సాస్ ఇండియా ఫోరం ఏర్పాటు చేసిన సమావేశానికి డొనాల్డ్ ట్రంప్ హాజరవుతారని అమెరికా అధ్యక్ష కార్యాలయం సోమవారం ప్రకటించింది. నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్న ఈ సమావేశానికి దాదాపు యాభై వేల మంది భారతీయ-అమెరికన్లు హాజరవుతున్నారు. డొనాల్ట్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న నేపథ్యంలో టెక్సాస్‌ లోని హూస్టన్‌ లో జరుగుతున్న భారతీయ-అమెరికన్ల సమావేశానికి ఆయన వెళ్తున్నట్లు తెలుస్తోంది.

భారత-అమెరికా దేశాల మధ్య నెలకొన్న సంబంధాల ప్రాధాన్యతను వివరించేందుకు హూస్టన్ సమావేశం ఒక ప్రత్యేక వేదిక - ప్రత్యేక అవకాశం అవుతుందని అమెరికా అధ్యక్ష కార్యాలయం పేర్కొన్నది. ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్యం (అమెరికా) - విశాల ప్రజాస్వామ్యం ( భారతదేశం) మధ్య నెలకొన్న కీలక భాగస్వామ్యాన్ని మరోసారి పునరుద్ఘాటించేందుకు హూస్టన్ సమావేశం దోహదపడుతుంది. రెండు దేశాల మధ్య ఇంధన - వాణిజ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు వీలు కల్పిస్తుందని పేర్కొనటం గమనార్హం. ఇదిలాఉంటే హూస్టన్ సమావేశానికి డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా హాజరుకావటం అమెరికా సమాజానికి - ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి భారతీయులు చేస్తున్న కృషికి అద్దం పడుతోందని నరేంద్ర మోదీ చెప్పారు.

అయితే, అమెరికాలోని భారతీయులతో పాటు ఆసియా దేశాల ప్రజల్లోనూ మోదీకి మంచి ఇమేజ్ ఉండడంతో ఇలా మోదీతో కలిసి సదస్సులో పాల్గొనడం వల్ల వచ్చే ఎన్నికల్లో ఆయావర్గాల నుంచి తనపట్ల సానుకూలత వస్తుందన్నది ట్రంప్ ఎత్తుగడగా తెలుస్తోంది.