Begin typing your search above and press return to search.

ఇందిరాలాగే మోడీకి ఎదురుదెబ్బ ఖాయ‌మా?

By:  Tupaki Desk   |   30 Nov 2016 5:02 AM GMT
ఇందిరాలాగే మోడీకి ఎదురుదెబ్బ ఖాయ‌మా?
X
స‌డ‌ల‌ని సంక‌ల్పానికి మారుపేరుగా నిలిచిన కాంగ్రెస్ నాయ‌కురాలు - మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి - ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీకి ఒకే రీతి ఫ‌లితం ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. తెగువ‌తో కూడిన నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో పెట్టింది పేర‌యిన ఈ ఇద్ద‌రు నేత‌ల్లోని మ‌రికొన్ని సారూప్యతలు కనిపిస్తున్నాయని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఒకవైపు జాతీయవాదాన్ని రెచ్చగొట్టి.. మరోవైపు పేదలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం ఆ రెండు అంశాల‌ని చెప్తున్నారు. అయితే ఇందిరాకు తదుప‌రి ద‌శ‌లో ఎదురైన‌టువంటి ఇక్క‌ట్ల‌నే ప్ర‌ధాని మోడీ సైతం ఎదుర్కుంటార‌ని విశ్లేషిస్తున్నారు.

1967 లోక్‌ సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రెండేళ్ల‌కు ఇందిరాగాంధీ తీసుకున్న చర్యలు.. 2014లో అధికారం చేపట్టిన తర్వాత రెండున్నరేళ్ల‌ తర్వాత మోడీ తీసుకుంటున్న చర్యలు స్థూలంగా ఒకేలా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజభరణాల రద్దు - బ్యాంకుల జాతీయకరణ.. అనే రెండు కీలక చర్యలను ఇందిరాగాంధీ తీసుకున్నారు. ఈ రెండు నిర్ణయాలు ఆమెను పేదలకు ప్రీతిపాత్రురాలిని చేశాయి. ఆ ఊపులో 1971 ఎన్నికల్లో గరీబీ హఠావో అనే నినాదంతో ఇందిర పోటీచేసి.. అద్భుత విజయం సాధించారు. ఆ ఏడాది డిసెంబర్‌ లో బంగ్లాదేశ్ యుద్ధంలో ఘన విజయం సాధించి పెట్టారని ప్రతిపక్ష పార్టీలు సైతం ఆమెను దుర్గాదేవిగా అభివర్ణించడం మొదలు పెట్టాయి. కానీ.. అప్పటికే ఆమెను ముప్పు తెలియకుండా చుట్టుముట్టింది. ఇందిర ప్రభుత్వం తట్టెడు వాగ్దాలు ఇచ్చింది. అయితే.. అమలు చేసింది శూన్యం. 1973 నాటికి ద్రవ్యోల్బణం పెరిగిపోయి.. నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. విద్యార్థి ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే 1974లో పోఖ్రాన్‌ లో అణుపాటవ పరీక్షను భారత్ నిర్వహించింది. కానీ దిగ‌రుతున్న ఇందిర ప్రతిష్ఠను ఆ పరీక్ష నిలువరించలేక పోయిం ది. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిర.. 1977 మార్చిలో ఎన్నికలకు వెళ్లారు. ఒక్కతాటిపైకి వచ్చిన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కు దారుణ పరాజయాన్ని మిగిల్చింది.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఇప్పుడు చేస్తున్న క్రమం కూడా దాదాపు ఇదే పద్ధతుల్లో ఉన్నట్టు కనిపిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. జాతీయవాదాన్ని-ధనిక వ్యతిరేకతను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడాన్ని ఈ విధంగా విశ్లేషిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి పేదల సంక్షేమ ప్రచారాన్ని మోడీ అందుకున్నారు. ఇటీవల సెప్టెంబర్ 29న పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లో లక్షితదాడులు జరిపించారు. నాటినుంచి సరిహద్దులు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలతో మారుమోగిపోతున్నది. ఆ తర్వాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ నిర్ణయం ప్రకటించారు. తన చర్యను వ్యతిరేకించేవారంతా నల్లధనానికి మద్దతు పలికేవారేనని, ధనికులు ఇన్నాళ్లూ పేదలను దోచుకుంటున్నారని మోడీ పదేపదే చెప్తూ వస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రెయన్ మాటల్లో ప్రధాని తనకు తాను పేదల పాలిట దేవుడిగా ప్రకటించుకున్నారు. ఆయనను వ్యతిరేకించేవారంతా దెయ్యాలు అన్నట్టు పరిస్థితి తయారైంది. అయితే మోడీ నిర్ణ‌యానికి రోడ్లమీద ఉన్న జనం మద్దతు ప్రకటిస్తున్నారని మహారాష్ట్ర, గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు సహా తన సంప్రదాయ మద్దతుదారుల నుంచి మోడీ వ్యతిరేకత ఎదుర్కొంటుండటం గమనార్హం. సంస్కరణలు తెస్తానని, ఉపాధి కల్పిస్తానని ఎన్నికల్లో మోడీ ఇచ్చిన హామీలకు మెచ్చి ఆయనను మధ్యతరగతి ప్రజలు గెలిపించారు. వీధుల్లో ఉండే ప్రజల ఆకాంక్షలను ఆయన విపరీతంగా పెంచేశారు. కలల్లో ఓలలాడిస్తున్నారు. మరి ఆ పెంచిన ఆకాంక్షలను, కలలను మోడీ నెరవేరుస్తారా? లేక ఏదో మాయ పన్నాగంతో గట్టెక్కుతారా? లేక ఇందిరాగాంధీలా ఎదురుదెబ్బ తింటారా? రానున్న కొద్ది నెలల్లోనే మోడీ భవితవ్యం తేలిపోతుందని విశ్లేషకులు చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/