Begin typing your search above and press return to search.

మోడీ వల అక్కడేశారు.. ఇక వారు విలవిలే!

By:  Tupaki Desk   |   22 Feb 2018 4:24 AM GMT
మోడీ వల అక్కడేశారు.. ఇక వారు విలవిలే!
X
నాలుగేళ్ల వెనక్కి వెళితే.. మోడీ మన రాష్ట్రానికి వచ్చాడు. తన మాటల గారడీతో ఇక్కడ వల వేశాడు. మీరాష్ట్రాన్ని స్వర్గధామగా మార్చేస్తానని అన్నాడు. అద్భుతాలు సృష్టించేస్తా అన్నాడు. ఢిల్లీకి మించిన రాజధాని మీది అన్నాడు. ప్రత్యేకహోదా పదేళ్లూ ఇచ్చేస్తాం అన్నాడు. ప్రతి ఊరు పేరూ చెప్పి.. అభివృద్ధి అంటే ఏమిటో చూపించేస్తా అన్నాడు. ఇదిగో ఇప్పటిదాకా మనం ఎదురుచూస్తూనే ఉన్నాం. ఢిల్లీని తలదన్నే రాజధాని ఇస్తానన్నాడు కదాని.. చాలా గ్రాండ్ స్కేల్ లో అమరావతి రాజధానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. కానీ ఏమైంది? ఆయన వచ్చి చెంబుడు మట్టి, నీళ్లు మన మొహాన కొట్టిపోయారు. .. ఇంతా జరిగి మరో రెండేళ్లు అవుతున్న ప్రస్తుత సమయానికి గానీ.. మనం ఇన్నాళ్లూ మోడీ మాటల మాయల వలలో చిక్కుకుపోయి కొట్టుమిట్టాడుతున్నాం అనే సంగతిని ప్రజలు కూడా తెలుసుకోలేకపోయారంటే అతిశయోక్తి కాదు.

ఇప్పుడు అదే మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న ప్రదేశం బుందేల్ ఖండ్ మీద ఇదేమాదిరి దుర్మార్గపు రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. అక్కడి ప్రజల మీద తన మాటల వల విసురుతున్నారు. అసలు చేస్తారో లేదో తెలియని మాయా హామీలతో ఆయన అక్కడి ప్రజలను సమ్మోహనుల్ని చేసేస్తున్నారు. కేవలం అతి చిన్నదైన బుందేల్ ఖండ్ ప్రాంతానికి అభివృద్ధి నిమిత్తం 20 వేల కోట్ల రూపాయలత ప్యాకేజీతో పాటు, రక్షణ పారిశ్రామిక రంగ కారిడార్ ను కూడా ప్రధాని ప్రకటించడం విశేషం. ఆయన ప్యాకేజీ కాకుండా, రక్షణ పారిశ్రామిక కారిడార్ వలన మరో 20 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, రెండున్నరలక్షల ఉద్యోగాలు వస్తాయని మోడీ చెప్పడం విశేషం.

ఇవాళ మోడీ మాటలను విన్న బుందేల్ ఖండ్ పులకించి పోయి ఉంటుందనడంలో సందేహం లేదు. సాధారణంగా వెనుకబాటు తనానికి నిదర్శనంగా నిలిచే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల గురించి ఈ రేంజిలో ప్రధాని అంతటి వాడు హమీలు ఇవ్వడం అంటే.. వారు తట్టుకోలేక తలకిందులైపోయి ఉంటారు.

కానీ మరికొన్నిరోజులు గడిస్తే.. వారిలో మొగ్గ తొడుగుతున్న ఆశలు వికసించి.. పువ్వులుగా మారి.. నిరీక్షించి ఎండి రాలిపోయిన తర్వాత వారికి వాస్తవాలు బోధపడుతాయని, అవికాయకాసి, పండు అయ్యే అవకాశం ఉండదని తెలుస్తుందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ఎన్నికల హామీల్లాగా ప్రతి రాష్ట్రాన్నీ - ప్రతి చోటా ప్రజలను వేల కోట్ల ఆకర్షణీయమైన ప్రకటనలతో బురిడీ కొట్టించడం మోడీకి అలవాటు అయిపోయిందని అంతా అనుకుంటున్నారు. ముందు ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరిస్తేనే.. దేశంలో మిగిలిన రాష్ట్రాలు మోడీ మాటలను నమ్మే పరిస్థితి ఉంటుందనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.