Begin typing your search above and press return to search.

ఈసారికి మోడీషాలకు షాకులు త‌ప్ప‌వ‌ట‌!

By:  Tupaki Desk   |   17 Dec 2018 5:13 AM GMT
ఈసారికి మోడీషాలకు షాకులు త‌ప్ప‌వ‌ట‌!
X
అన్ని రోజులు ఒక‌లా ఉండ‌వు. శిఖ‌రానికి చేరుకోవ‌టం ఒక ఎత్తు అయితే.. ఆ స్థానాన్ని నిలుపుకోవ‌టం మామూలు విష‌యం కాదు. ఈ విష‌యాన్ని మోడీషాలు మిస్ అవుతున్నారా? అంటే అవున‌ని చెబుతున్నారు. త‌మ‌కు తిరుగులేద‌ని.. తాము ఏదైనా విష‌యంలో ప్లాన్ చేస్తే.. ఇట్టే వ‌ర్క్ వుట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం వారిద్ద‌రిలో ట‌న్నులు.. ట‌న్నులు ఉంటుంద‌న్న వాద‌న ఉంది.

అయితే.. అదంతా పాత ముచ్చ‌ట‌ని.. ఇప్పుడు సీన్ మారింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. తాజాగా జ‌రిగిన ఐదు రాష్ట్రాల సెమీఫైన‌ల్స్ ఫ‌లితాలతో బీజేపీ ప్రాభ‌వం ఎంత‌లా కొడిగ‌ట్టుతుంద‌న్న‌ది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా క‌నిపించింది. ఇప్ప‌టికైనా తెలివి తెచ్చుకుంటే ఓకే కానీ.. లేకుంటే త్వ‌ర‌లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భారీ షాకులు త‌ప్ప‌వ‌న్న మాట వినిపిస్తోంది.

జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింద‌ని.. ఇప్పుడు చేసేదేమీ లేద‌ని బీజేపీలో ఒక వ‌ర్గం తీవ్ర నిరాశ‌లో మునిగిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల వెల్లడైన ఫ‌లితాలు బీజేపీకి భారీ షాకిచ్చింద‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ త‌మ బ‌లాన్ని ఎక్కువ‌గా ఊహించుకోవ‌టం.. నేల మీద నిలుచొని ఆలోచించ‌కుండా.. ఆకాశంలో విహ‌రిస్తున్న వైనానికి చెక్ ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్ని చూస్తే.. కొద్ది నెల‌ల్లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వివిధ రాష్ట్రాల్లో పార్టీకి వ‌చ్చే సీట్లకు భారీ కోత ప‌డే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌త సార్వ‌త్రికంలో మాదిరి సానుకూల వాతావ‌ర‌ణం ఉండ‌ద‌ని.. వివిధ రాష్ట్రాల్లో తీవ్ర‌మైన పోటీ ఉంటుంద‌ని చెబుతున్నారు. మోడీషాల తీరుతో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ మీద ఆగ్ర‌హం.. అసంతృప్తి అంత‌కంత‌కూ ఎక్కువ అవుతుంద‌న్న విష‌యాన్ని ప‌లువురు బీజేపీ నేత‌లు అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో ప్ర‌స్తావిస్తున్నారు.

ఈసారి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 2009 నాటి ఫ‌లితాలు రిపీట్ అయ్యే అవ‌కాశం ఉందంటున్నారు. 2009లో ఎలా అయితే 116 సీట్లు వ‌స్తాయో.. అలాంటి ప‌రిస్థితే ఉంటుంద‌ని.. ప్ర‌జ‌ల్లో త‌గ్గిన ప‌లుకుబ‌డి.. మిత్రుల్ని చేజార్చుకున్నందుకు మోడీషాలు మూల్యం చెల్లించక త‌ప్ప‌దంటున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్.. రాజ‌స్థాన్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్ ల‌లో గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మాదిరి 62 సీట్లు వ‌చ్చే అవ‌కాశం లేదు. అంతేకాదు.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మారిన రాజ‌కీయ ముఖ‌చిత్రం పుణ్య‌మా అని బీజేపీకి వ‌చ్చే సీట్ల‌లో భారీ కోత త‌ప్ప‌దంటున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీఎస్పీ.. ఎస్పీ.. కాంగ్రెస్‌ లు క‌లిసి పోటీ చేస్తే.. గ‌త సార్వ‌త్రికంలో వ‌చ్చిన 71 సీట్ల‌లో స‌గం కూడా ద‌క్కే ఛాన్స్ లేదు.

బీజేపీకి కంచుకోట లాంటి గుజ‌రాత్‌ లో గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 26 స్థానాల‌కు 26 స్థానాల్లో విజ‌యం సాధించారు. ఈసారి అలాంటి ప‌రిస్థితి లేద‌న్న వాద‌న‌వినిపిస్తోంది. ఇక‌.. ద‌క్షిణాది రాష్ట్రాల్లో (క‌ర్ణాట‌క‌ను మిన‌హాయిస్తే) ఒక్క సీటైనా వ‌స్తుందా? అన్న‌ది సందేహ‌మే. అదే జ‌రిగితే.. మోడీషాలు అనుకున్న‌ట్లుగా అత్య‌ధిక సీట్ల సాధ‌న అన్న‌ది కాగితాల మీద లెక్క‌లా మిగిలిపోవ‌టం ఖాయం.

ఈ రాష్ట్రాలే కాక‌.. 2014లో బీజేపీకి సీట్ల‌ను ఇచ్చిన మ‌రికొన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ప‌రిస్థితి అంత బాగా లేదంటున్నారు. అసోం.. హ‌ర్యానా.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌.. జ‌మ్ముక‌శ్మీర్‌.. జార్ఖండ్‌.. క‌ర్ణాట‌క‌.. పంజాబ్‌.. ఢిల్లీ.. ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీకి ఎన్ని సీట్లు ఈసారి వ‌స్తాయ‌న్న దానిపై ప‌లు సందేహాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీకి సొంతంగా 180 స్థానాలు వ‌చ్చే ప‌రిస్థితి ఉందా? అన్న‌ది ఇప్పుడు క్వ‌శ్చ‌న్ గా మారింది. రోజులు గ‌డుస్తున్న‌కొద్దీ మోడీ మాష్టారి మీద పెరుగుతున్న అసంతృప్తి.. సార్వ‌త్రిక స‌మ‌యానికి మోడీషాల‌కు భారీ షాక్ త‌ప్ప‌ద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.