Begin typing your search above and press return to search.

సండే స్పెషల్: మోదీ-షా.. దొందూ ఒకటే

By:  Tupaki Desk   |   15 Sep 2019 2:30 PM GMT
సండే స్పెషల్: మోదీ-షా.. దొందూ ఒకటే
X
నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘సింగిల్’ అజెండాతో ముందుకెళ్తోన్నట్లుగా ఉంది. అన్నిట్లో ఏకతా మంత్రం పఠిస్తూ దేశ ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తమ ఆలోచనలను నిర్ణయాలుగా మార్చి రుద్దే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా తీసుకొచ్చిన ఒకే దేశం.. ఒకే భాష నినాదం కూడా అందులో భాగమే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఒకే భాష నినాదంపై జనం ఆగ్రహంగానే ఉన్నారు.

మోదీ ప్రభుత్వానికి ఈ సింగిల్ నంబర్ పిచ్చి మొదటి నుంచి ఉంది. ఈ సింగిల్ నంబర్ పిచ్చితో ఆయన చేసిన పనులు కొన్ని ప్రయోజనకరమే అయినా మరికొన్ని మాత్రం తీవ్ర ఇబ్బందులు కలిగించాయి.

వన్ ర్యాంక్ వన్ పెన్షన్:

మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఇది అత్యంత కీలకమైనది. 42 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారం చూపించింది. సైన్యం డిమాండ్లలో చాలావాటిని అంగీకరించి మోదీ ప్రభుత్వం దీనిపై ముందుకెళ్లింది.

వన్ నేషన్ వన్ ట్యాక్స్:

వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ తో మోదీ ప్రభుత్వానికి ఎంత మంచి పేరొచ్చిందో ఈ వన్ ట్యాక్స్‌ తో అంత చెడ్డ పేరొచ్చింది. దేశమంతా ఒకే పన్ను విధానం అంటూ జీఎస్టీని అమల్లోకి తెచ్చింది కేంద్రం. ఇది వ్యాపార వర్గాలను తీవ్ర ఇబ్బందులు గురిచేసింది. పన్ను శ్లాబులు వివాదాస్పదమైతే పలుమార్లు తగ్గించింది. ఎన్ని చేసినా ఇంకా ఈ జీఎస్టీ విధానం గాడిన పడలేదు. మోదీ ప్రబుత్వంపై ఈ విషయంలో వ్యతిరేకతా పోలేదు.

వన్ నేషన్ వన్ ఎలక్షన్:

మోదీ మూడో సింగిల్ అజెండా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. ఇందులో కొంత మంచి కొంత చెడు కనిపిస్తున్నాయి. దీనికోసం రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కోసం కూడా మోదీ ప్రయత్నిస్తున్నారు. కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. కొన్ని సమర్థించాయి. దీనివల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం అనే వాదన ఉంది. అదేసమయంలో పెరిగిపోతున్న ఎన్నికల వ్యయాన్ని అరికట్టేందుకు ఇది మంచి మార్గమని అంటున్నవారూ ఉన్నారు. ఎన్నో భిన్న పార్శ్వాలున్న ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు కోసం కూడా మోదీ కంకణం కట్టుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఇది అమలు చేస్తారాని.. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు.

వన్ నేషన్ వన్ లాంగ్వేజ్

ఈ సింగిల్ అజెండాలో ఇప్పుడు మరోటి కూడా వచ్చి చేరింది. దేశమంతా ఒకే భాష ఉండాలంటూ ఇప్పటికే ప్రతిపాదించగా ఇప్పుడు మరోసారి దాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. వన్ ఎలక్షన్ - వన్ ట్యాక్స్ తరహాలో ఇది సాఫీగా సాగే పరిస్థితులైతే లేవు.

తాజాగా భారతదేశాన్ని హిందీ దేశంగా చేయాలని కేంద్రహోంమంత్రి స్థాయిలో అమిత్‌ షా ప్రకటించారు. అన్ని భాషలను గౌరవిస్తున్నానని చెబుతూనే దేశానికి అధికారికంగా హిందీ ఒకటే భాష ఉండాలని సెలవిచ్చారు. దీనిని ఇప్పుడు ట్వీట్‌ ద్వారా బహిర్గత పరిచినప్పటికీ భవిష్యత్‌లో మోడీ-షా ద్వయం ఆ దిశగానే వెళతారనడానికి గత అనుభవాలే ఉదాహరణలు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వామపక్షాలు - కాంగ్రెస్‌ సహా లౌకిక పార్టీలన్నీ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నా - హెచ్చరిస్తున్నా అమలు చేసుకుంటూ పోతున్నారు. దేశంలో రాజకీయ విభజనకు భాషను సాధనంగా ఉపయోగించుకోవడాన్ని ఆపాలని సీపీఐ - ఇతర వామపక్షాలు - కాంగ్రెస్‌ సహా లౌకిక పార్టీలన్నీ మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. హిందీని రుద్దడాన్ని తమిళులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశంలో మెజారిటీ ప్రాంతంలో ఇప్పటికే హిందీ వాడుకలో ఉండడంతో ఆయా ప్రాంతాల్లో దీనిపై ఎలాంటి వ్యతిరేకతా లేదు. దీంతో మోదీ ప్రభుత్వం దీన్నీ ఏదో ఒక రోజు ఆచరణలోకి తెచ్చేస్తుందని భావిస్తున్నారు.

ఏక వ్యక్తి పాలన.. వన్ నేషన్ వన్ లీడర్?

వన్ ట్యాక్స్, వన్ ఎలక్షన్, వన్ లాంగ్వేజ్ వంటివన్నీ ఇప్పటివరకు మోదీ బయటపెట్టిన ఆలోచనలు కాగా మాటల్లో బయటపెట్టకుండా ఆచరణలోకి తెచ్చి అమలు చేస్తున్న ఆలోచన మరోటి ఉందన్న విమర్శలు ఉన్నాయి. అది ఏక వ్యక్తి పాలన... ఇంత పెద్ద దేశాన్ని ఏకపక్షంగా మోదీ తనకు నచ్చినట్లుగా నియంతలా పాలించుకుంటూ పోతున్నారన్న ఆరోపనలున్నాయి.

అంతేకాదు... ప్రపంచంలోని కొన్ని ఇతర దేశాల మాదిరిగా అధ్యక్ష తరహా పాలన తేవాలన్న ఆలోచన కూడా ఉందంటారు. వన్ నేషన్ వన్ లీడర్ అనే రహస్య మిషన్‌ తో దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్తను కూలదోసే పనిలో పడ్డారని విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి కూడా.

మరి మోదీ-షా ద్వయం ఎందుకు?

అంతా ఒకటి.. వన్ నేషన్ అంటూ వెళ్తున్న మోదీ పాలనలో మోదీ-షా ద్వయం ఎందుకు దేశంపై స్వారీ చేస్తుంది అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. సింగిల్ నంబర్‌ ను ఇష్టపడే మోదీ మరి షా రూపంలో నంబర్ 2ను ఎందుకు పెంచి పోషిస్తున్నారన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. దీనికి బీజేపీలోని పెద్దల వద్ద సమాధానం ఉందట. మోదీ-షా వేర్వేరు కాదు.. ఇద్దరిదీ జెండా, అజెండా ఒకటే. దొందూ ఒకటే, ఏకమేవ ద్వితీయం అంటూ చెప్పుకొస్తున్నారు.