Begin typing your search above and press return to search.

షాకింగ్ : మోడీకి గుజ‌రాత్‌ లో చుక్కెదురు?

By:  Tupaki Desk   |   10 Jan 2017 5:02 PM GMT
షాకింగ్ : మోడీకి గుజ‌రాత్‌ లో చుక్కెదురు?
X
పెద్ద నోట్ల ర‌ద్దు వంటి సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్న ప్రధాని మోడీకి త‌ద‌నంత‌రం చేదు ప‌రిణామాలు ఎదురుకానున్నాయ‌ని తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణ‌యం మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ లోనే చెడు ఫలితాలను ఇవ్వబోతోందని విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. అందరూ నగదు రహిత లావాదేవీలకు వెళ్లాలంటూ కేంద్రం చెబుతున్న విధానాలు, ప్రకటిస్తున్న పథకాలు గ్రామీణ స్థాయిలో అనుకూలంగా లేవు. ముఖ్యంగా గుజరాత్‌ లో రైతులు తీవ్రమైన నోట్ల కొరతను అనుభవిస్తున్నారు. పండిన పంటను అమ్మితే చెక్‌ రూపంలో వ్యాపారులు నగదు చెల్లిస్తున్నారు.

నగదు రహిత లావాదేవీలకు వెళ్లాలని కేంద్ర నాయకత్వం గట్టిగా చెబుతున్నా గుజరాత్‌ లో గ్రామీణ ప్రాంతాల్లోని బీజేపీ కేడర్‌ మాత్రం ఆందోళనలో ఉంది. నోట్ల కొరత ప్రభావం వారిపై తీవ్రంగా ఉంది. ప్రస్తుతానికి తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారని..కాని వారిలో ఉన్న అసంతృప్తిని పై నాయకులకు వివరిస్తున్నారని అంటున్నారు. మొత్తం చూస్తే గుజరాత్‌ లో నోట్ల కొరత సమస్య రైతుల్లో మోడీకి - బిజేపీకి ఉన్న ఇమేజ్‌ ను డ్యామేజ్‌ చేసింది. మరి ఈ ప్రభావం అక్టోబర్‌ లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను చూపిస్తుందో ఎదురుచూడాల్సి ఉంది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లు సైతం చెప్తున్నారు. గుజ‌రాత్ లోని సురేంద్రనగర్‌ జిల్లాకు చెందిన రమణిక్ భాయ్ పటేల్‌ మొదటిసారిగా తన పంటకు చెక్‌ రూపంలో నగదు అందుకున్నారు. దాన్ని తీసుకెళ్లి బ్యాంక్‌ లో వేస్తే వారానికి 8 వేల రూపాయలు మాత్రమే ఆయనకు నగదు ఇచ్చారు. ఆ డబ్బుతో రబీ సాగుకు విత్తనాలు - ఎరువులు కొనలేక నానా అవస్థలు పడ్డారు. పాత నోట్లకు ప్రభుత్వ అమ్మకపు కేంద్రాల్లో విత్తనాలు అమ్మినా... సరిపడినంత స్టాక్‌ లేక ప్రయివేట్‌ షాపుల వద్దకే వెళ్లాల్సి వచ్చిందని పటేల్‌ చెప్పారు. అఖరుకు కూలీలకు కూడా డబ్బులు ఇవ్వలేకపోయాయని అన్నారు. నగదు అందుబాటులో లేకపోవడం వలన తనతోపాటు చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయామని చెప్పారు. గతంలో మోడీపై తమకున్న అభిప్రాయం మారిందని, ఈసారి మాత్రం బీజేపీకి ఓటేసే పరిస్థితి లేదన్నారు.

మోడీ ప్రకటించినట్లు ఇబ్బంది 50 రోజులు మాత్రమే ఉంటుందని భావించామని, అయితే ఆ తర్వాత కూడా సమస్య తీరలేదని మరో రైతు జగదీష్ భాయ్‌ రమణి చెప్పారు. బ్యాంకులో డబ్బులున్నా చేతిలో డబ్బుల్లేక విత్తనాలతో పాటు ఎరువులను కూడా కొనలేకపోయామని చెప్పారు. స్థానికంగా అందరూ సేంద్రీయ ఎరువులనే వాడతారని..ఆ ఎరువులు అమ్మే రైతులు చెక్‌లను తీసుకోరని, వారిలో కొందరికి బ్యాంక్‌ ఎకౌంట్లు కూడా లేవని చెప్పారు. బీజేపీకి గట్టి సపోర్టర్‌ అయిన తాను ఈసారి మాత్రం బీజేపీకి ఓటేసేది లేదని చెప్పారు. రైతుల కోసం పనిచేసే ఓ స్వచ్చంద సంస్థకు చెందిన రబారీ మాట్లాడుతూ రైతు సమస్యలపై తాము 460 కిలో మీటర్ల పాదయాత్ర చేశామని, అన్నిచోట్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారని..బీజేపీపై - మోడీపై కోపంగా ఉన్నారని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/