Begin typing your search above and press return to search.

అమెరికా నుంచి వచ్చాక మధ్యతరగతికి మోదీ భారీ కానుక

By:  Tupaki Desk   |   22 Sep 2019 9:39 AM GMT
అమెరికా నుంచి వచ్చాక మధ్యతరగతికి మోదీ భారీ కానుక
X
వారం రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ భారత్‌కు తిరిగిచేరుకున్నాక ఆయన ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించనుందన్న ప్రచారం దిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. మధ్య తరగతి ప్రజలకు శుభవార్త చెప్పేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం కార్పొరేట్ పన్నును 8 శాతం నుంచి 10 శాతం మేర తగ్గించి ఊరట కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు మధ్యతరగతిపై దృష్టి సారించింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో కొన్ని రాయితీలు కల్పించడం ద్వారా వారికి ఊరటనివ్వాలని యోచిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నివేదిక కేంద్రం చేతికి వచ్చినప్పటికీ అమలు కంటే ముందు కొంత చర్చ జరిగితే బాగుంటుందని కేంద్రం కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రక్రయంతా ముగిసిన తరువాత ప్రధాని అంగీకారంతో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ దీనిపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

మధ్యతరగతికి రాయితీలు కల్పించే విషయంలో గతంలో ఆర్థిక శాఖ నియమించిన ఓ టాస్క్‌ఫోర్స్ ఇందుకు సంబంధించిన నివేదికను గత నెలలోనే మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించినట్టు సమాచారం. కార్పొరేట్‌కు పన్ను తగ్గింపు ప్రకటన తర్వాత సామాన్యుల సంగతేంటన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరలోనే మధ్యతరగతికి ఊరటనిచ్చే ప్రకటన వెలువడవచ్చని దీనితో సంబంధం ఉన్న సన్నిహిత వర్గాలు తెలిపాయి.