Begin typing your search above and press return to search.

ఎటాక్ తర్వాతి రోజున మోడీ మాట్లాడినప్పుడు..

By:  Tupaki Desk   |   30 Sep 2016 9:11 AM GMT
ఎటాక్ తర్వాతి రోజున మోడీ మాట్లాడినప్పుడు..
X
యావత్ దేశం మొత్తం సంతోషంతో ఉన్న వేళ.. ప్రధాని మోడీ ఎలా ఉన్నారు? ఆయన ముఖంలో ఏమైనా మార్పు వచ్చిందా? మాటల్లో ఏదైనా తేడా కనిపిస్తుందా? ఇలాంటి ప్రశ్నలెన్నో సహజంగా వచ్చేవే. అనుకోకుండా ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికే అవకాశం వస్తే.. ఏ జర్నలిస్ట్ దాన్ని మిస్ కాడు. దాయాది పాక్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భారత్ సైన్యం వెనుక ప్రధాని మోడీ ఉన్నారన్న విషయం చిన్న పిల్లాడ్ని అడిగినా చెబుతారు. పాక్ గడ్డ మీదకు మన సైనికుల్ని పంపి మరీ.. ఉగ్రవాదుల అడ్డాల్ని ధ్వంసం చేసి రావటం చిన్న ముచ్చటేం కాదు. అలాంటి ఘటన జరిగిన తర్వాతి రోజున స్వచ్ఛభారత్ వార్షికోత్సవాన్ని ఢిల్లీలో నిర్వహించారు.

ఈ కార్యక్రమం గతంలోనే ఫిక్స్ చేసింది కావటంతో.. ప్రధాని మోడీతో సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కలెక్టర్లు.. అధికారులు హాజరయ్యారు. స్వచ్ఛ భారత్ లో విశేష సేవలు అందించిన వారికి ప్రధానమంత్రి చేతుల మీదుగా స్వచ్ఛతా అవార్డుల్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. ఆయన మాటల్లో ఎక్కడా పాకిస్థాన్.. ఉగ్రవాదులు.. దాడులు లాంటి పదాలు ఎక్కడా రాలేదు. అసలు.. నిన్న జరిగిన ఉదంతం జరిగినట్లే లేదన్నట్లుగా మోడీ తీరు ఉండటం గమనార్హం.

ఎప్పటి మాదిరి తన ధోరణిలో తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేసి మోడీ.. ఎక్కడా తన లోపలి భావోద్వేగాల్ని బయటపడనీయలేదు. స్వచ్ఛభారత్ కార్యక్రమానికి హాజరైన ఆయన.. స్వచ్ఛ భారత్ గురించి.. దాని ప్రాధాన్యత గురించి మాత్రమే వ్యాఖ్యానించారు. ప్రతి ఏటా దేశంలో పలుచోట్ల ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని.. ఎన్నికల గురించి ఆలోచించే నాయకులు స్వచ్ఛతా కార్యక్రమాల గురించి మాత్రం ఆలోచించరంటూ అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన.. ఎన్నికలపై ఆలోచించే నేతలు స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టే ధైర్యం మాత్రం చేయరన్నారు.

సొంత వాహనాల్ని 20 ఏళ్ల వరకూ జాగ్రత్తగా ఉంచుకునే మనం.. ప్రభుత్వ వాహనాలకు మాత్రం నష్టం కలిగిస్తుంటామని.. ప్రభుత్వం మనదేనన్న భావన అందరిలో కలగాలన్న మోడీ.. ప్రభుత్వం మనదనుకుంటే దేశం మనదనే భావన కలుగుతుందని వ్యాఖ్యానించారు. సంకల్పంతో మార్పు సాధ్యమని.. దేశాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చిన ఆయన.. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత ఉందన్నారు. చంఢీగఢ్.. మైసూర్ లాంటి ప్రాంతాలే ఎందుకు పురస్కారాలు అందుకుంటున్నాయన్న ప్రశ్నను అందరూ వేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక ఘటన జరిగి 24 గంటలు మాత్రమే జరిగి.. భారత ఎటాక్ మీద చర్చ జోరుగా సాగుతున్న వేళ.. స్వచ్ఛభారత్ గురించి ప్రధాని చేసిన ప్రసంగం వింటే.. మోడీలోని మరో కొత్తకోణం కంటికి కనిపించటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/