Begin typing your search above and press return to search.

గుజ‌రాత్ పోల్ రిపోర్ట్స్‌.. మోడీకి బ్యాడ్‌ న్యూస్‌!

By:  Tupaki Desk   |   15 Dec 2017 4:30 AM GMT
గుజ‌రాత్ పోల్ రిపోర్ట్స్‌.. మోడీకి బ్యాడ్‌ న్యూస్‌!
X
అంద‌రూ ఎంతో అతృత‌గా ఎదురుచూస్తున్న గుజ‌రాత్ పోల్ రిజ‌ల్ట్స్ ఎలా ఉంటాయో చెప్పే అంచ‌నాలు భారీగా వెల్ల‌డయ్యాయి. జాతీయ మీడియా సంస్థ‌ల‌తోపాటు.. ప‌లువురు గుజ‌రాత్ ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్స్ ను విడుద‌ల చేయ‌టం క‌నిపించింది. 21 ఏళ్లుగా తిరుగులేని రీతిలో అధికారాన్ని నిల‌బెట్టుకుంటున్న బీజేపీ.. ఈ ద‌ఫా కూడా అదే ప‌రంప‌ర‌ను కొన‌సాగించ‌నున్న‌ట్లుగా తేల్చి చెప్పాయి.

ఎగ్జిట్ పోల్స్ ప్ర‌క‌టించిన అన్ని సంస్థ‌ల అభిప్రాయాలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఏ ఒక్క సంస్థా కూడా బీజేపీకి 150సీట్లు వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించ‌లేదు. అంటే.. బీజేపీ నేత‌లు నొక్కి వ‌క్కాణించినంత భారీ విజ‌యం గుజ‌రాత్ లో రావ‌టం లేదు. గుజ‌రాత్ ఎన్నిక‌ల‌కు సంబంధించి గెలుపు మీద ధీమా మొద‌ట్నించి ఉన్న‌ప్ప‌టికీ.. మెజార్టీ విష‌యంలోనూ లెక్క త‌ప్ప‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపించింది. ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన మీడియా సంస్థ‌ల స‌రాస‌రి గ‌రిష్ఠ‌.. క‌నిష్ఠ‌ల‌ను చూస్తే.. మినిమం 99.. మ్యాగ్జిమ‌మ్ 135 ఖాయ‌మ‌న్న మాట‌ను వెల్ల‌డించాయి. గుజ‌రాత్ పీఠాన్ని అందుకోవాలంటే 92 సీట్లు త‌ప్ప‌నిస‌రి.

గుజ‌రాత్ పీఠాన్ని మ‌రోసారి సొంతం చేసుకోవ‌టానికి ప్ర‌ధాని ప‌డిన క‌ష్టం అంతా ఇంతా కాదు. గుజ‌రాత్ లో త‌మ ప‌వ‌ర్ ను నిలుపుకోక‌పోతే.. భారీ న‌ష్టం జ‌రుగుతుంద‌న్న విష‌యం తెలిసిన ఆయ‌న త‌న మాట‌లతో చాలానే విన్యాసాలు చేశారు. ఈ కార‌ణంతోనే ఆయ‌న నోటి నుంచి ర‌క‌ర‌కాల మాట‌లు వ‌చ్చేలా చేశాయి.

చివ‌ర‌కు ఆయ‌న త‌న ప్రాణాల‌కు సైతం ముప్పు ఉంద‌న్న మాట‌ను చెప్ప‌క త‌ప్ప‌లేదు. త‌న‌ను తొల‌గించుకోవ‌టానికి కాంగ్రెస్ పాక్ సాయం కోరుతుంద‌న్న భారీ ఆరోప‌ణ‌తో పాటు.. గుజ‌రాతీ సెంటిమెంట్‌ ను త‌ట్టి లేపే ప్ర‌య‌త్నం చేశారు. పేరుకు ప్ర‌ధాని అయిన‌ప్ప‌టికీ.. గుజ‌రాత్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మోడీ చేసిన వ్యాఖ్య‌లు చూస్తే.. ఆయ‌న ఏమాత్రం జాతీయ స్థాయి నాయ‌కుడిగా ఒప్పుకోలేని ప‌రిస్థితి.

గుజ‌రాత్ ఎగ్జిట్ ఫ‌లితాలు బీజేపీకి సానుకూలంగా వ‌చ్చిన‌ప్ప‌టికీ.. మోడీ.. షా ద్వ‌యానికి ఈ ఎన్నిక‌లు ఇచ్చే షాక్ అంతా ఇంతా కాదు. 150 సీట్లు రాక‌పోతే ఈ గెలుపు.. ఓ గెలుపేనా? అన్న‌ట్లుగా ప్ర‌చారం చేసిన బీజేపీకి.. ఇప్పుడా మాట‌లే ఇబ్బందిక‌రంగా మారానున్నాయి. కొంత‌లో కొంత ఉప‌శ‌మ‌నం ఏమిటంటే.. మొద‌టిద‌శ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత గుజ‌రాత్ లో ఏదో అయిపోతుంద‌న్న‌ట్లుగా మీడియాలో వార్త‌లు రావ‌టం.. కాంగ్రెస్‌ కు కాస్త మొగ్గు క‌నిపించింద‌న్న అంచ‌నాలు మోడీ అండ్ కోను వ‌ణికించాయి.

అయితే.. తాజాగా వెలువ‌డిన ఎగ్జిట్ ఫ‌లితాలు వారికి ఉప‌శ‌మ‌నం క‌లిగించినా.. బాధ‌ను మాత్రం మిగులుస్తాయ‌నే చెప్పాలి. గుజ‌రాత్ లో 150 సీట్లు ప‌క్కా అన్నట్లు మాట్లాడిన మాట‌ల‌కు వ‌స్తున్న అంచ‌నాల‌కు పొంత‌న కుద‌ర‌టం లేదు. దీంతో ఒక చిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. గుజ‌రాత్ ఎన్నిక‌ల ఎగ్జిట్ ఫ‌లితాలు చూసి సంతోషించాలో.. బాధ‌ప‌డాలో అర్థం కాని ప‌రిస్థితిలో క‌మ‌ల‌నాథులు ఉన్నారు. త్వ‌ర‌లో వెలువడే ఫ‌లితాలు ఇలాంటి ప‌రిస్థితిని మ‌రింత పెంచ‌నున్నాయ‌ని చెప్పాలి.

త‌మ అభివృద్ధికి నిద‌ర్శ‌నంగా గుజ‌రాత్ రాష్ట్రాన్ని పేర్కొన‌ట‌మే కాదు.. త‌మ ప్ర‌యోగ‌శాల‌గా అభివ‌ర్ణిస్తుంటారు క‌మ‌ల‌నాథులు. తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన త‌ర్వాత గుజ‌రాతీయులు ఇచ్చే తీర్పుతో ఆ మాట‌ను చెప్పుకునే అవ‌కాశం రాక‌పోవ‌చ్చు. 21 ఏళ్లుగా త‌మ‌కు తిరుగులేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన క‌మ‌ల‌నాథులు ఇప్పుడు కాస్త ఆకాశం నుంచి కింద‌కు దిగొచ్చు. అంద‌రికంటే ఎక్కువ‌గా మోడీ మీద గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌భావం ప‌డ‌తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌కాలం త‌న‌కు తిరుగులేద‌న్న భావ‌న న‌ర‌న‌రాన నిండిన మోడీకి.. సొంతోళ్లు త‌న‌కిచ్చిన షాక్ ఆయ‌న్ను ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకునేలా చేయ‌ట‌మే కాదు.. జ‌న‌రంజ‌క పాల‌న మీద ఫోక‌స్ చేస్తాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.