పప్పు హగ్ ఎపిసోడ్ ను ఆటాడుకుంటున్న మోడీ!

Sun Jul 22 2018 10:09:44 GMT+0530 (IST)

చులకన చేసే మాటల్ని నిండు సభలో ప్రస్తావించటానికి ఎంత దమ్ము ఉండాలి. ఎంత పప్పు అయితే మాత్రం.. అదే పనిగా ఆడుకోవటం సరికాదు. తనను పప్పు అని ఎటకారం చేసినా.. అంటూ అందరూ తనను ఎటకారం చేసే మాటను ప్రస్తావించి సైతం.. తన రాజకీయ ప్రత్యర్థిని కౌగిలించుకున్న రాహుల్ తీరుపై ప్రధాని విరుచుకుపడుతున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యకరంగా మారింది.తనను పప్పు అని రాజకీయ ప్రత్యర్థులు అభివర్ణించిన వైనాన్ని చెప్పిన రాహుల్.. కొద్దిసేపటికే తాను పప్పు అన్నట్లుగా వ్యవహరించటం మోడీ బ్యాచ్ కు ఫుల్ హ్యాపీగా మారింది. కాంగ్రెస్ మీద ఉండే ఆగ్రహాన్ని తెలివిగా రాహుల్ మీదకు మళ్లించటంలో మోడీ ఎప్పుడో సక్సెస్ అయ్యారు.తాజాగా.. తనను కౌగిలించుకున్న రాహుల్ కు ఏ మాత్రం స్పందించకుండా ఉన్న వైనంపై విమర్శలు వెల్లువెత్తకుండా ఉండేందుకు వీలుగా తానే ముందస్తు ఎదురుదాడిని షురూ చేయటం మొదలెట్టారు.

ఈ వాదనకు బలం చేకూరేలా మోడీ తీరు ఉండటం గమనార్హం. తాజాగా రాహుల్ కౌగిలింతపై బహిరంగ సభలో మోడీ చెప్పిన కొత్త భాష్యం వింటే అవాక్కు అవ్వాల్సిందే. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారో చెప్పమంటే.. దానికి సమాధానం ఇవ్వలేక తన మెడకు చుట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని షాజహాపూర్లో రైతు ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ.. రాహుల్ కౌగిలింతను ప్రస్తావించారు. అది తనకు ఇష్టం లేని బలవంతపు కౌగిలింతగా అభివర్ణించారు. ఆయన తన ప్రధాని సీటు కోసం వచ్చారని.. అందుకే లేవాలని పదే పదే సైగలు చేశారన్నారు. బీజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో పరస్పర విరుద్ధ సిద్ధాంతాలున్న పార్టీలు ఒక్కతాటిపైకి రావటంతోనే అవిశ్వాస తీర్మానం తెర మీదకు వచ్చిందని చెప్పుకున్న మోడీ.. తాను పేదల కోసం.. దేశం కోసం పోరాటమే తాను చేసిన తప్పుగా ఆయన చెప్పుకోవటం గమనార్హం.

అవిశ్వాసం తీర్మానం రోజున రాహుల్ ప్రధాని మోడీ వద్దకు వెళ్లటం.. ఆ సందర్భంగా ఆయన్ను కౌగిలించుకున్న ఉదంతాన్ని కోట్లాది మంది టీవీల్లో లైవ్ లో చూశారు. అలాంటి వాటికి అద్భుతమైన స్క్రిప్ట్ తో మోడీ చెబుతున్న మాటల్ని చూస్తే.. ఆయన టాలెంట్‌కు అవాక్కు అవ్వాల్సిందే. తన సీటు దగ్గరకు వచ్చి లేవమన్నారని.. తన ప్రధాని సీటు కోసమే ఆయన వచ్చారంటూ చెబుతున్న మాటల్ని చూస్తే.. రాహుల్ హగ్ పై ఆయన భాష్యాలు రివర్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పక తప్పదు.

 నిజమే.. కౌగిలింత వరకూ ఓకే కానీ ఆ తర్వాత కన్నుగీటే విషయంలో రాహుల్ పప్పులా వ్యవహరించారనటంలో సందేహం లేదు. కానీ.. దాన్నో అవకాశంగా తీసుకొని అదే పనిగా చెలరేగిపోయినా అదేమాత్రం బాగోదన్నది మర్చిపోకూడదు. బలహీనుడిపై బలవంతుడి గెలుపు ఎంతమాత్రం విజయం కాదన్నది మోడీకి తెలియంది కాదు. కానీ.. ఇప్పుడాయన తీరు అలానే ఉందన్న మాట ప్రజలు గుర్తిస్తే నష్టం మోడీకే!