Begin typing your search above and press return to search.

మోడీ..కేసీఆర్‌..ఈ బంధం ధృడ‌మైన‌ది

By:  Tupaki Desk   |   17 July 2017 5:30 PM GMT
మోడీ..కేసీఆర్‌..ఈ బంధం ధృడ‌మైన‌ది
X
ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ల మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డుతోంది. పెద్ద నోట్ల ర‌ద్దు సంద‌ర్భంగా చిగురించిన ఈ దోస్తీ అనంత‌రం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌తో ప‌ట్టాలెక్కింది. రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎన్నిక‌ల సంద‌ర్భంగా చిక్క‌బ‌డిన ఈ మిత్రుత్వం అదే స‌మ‌యంలో మ‌రింత‌గా ధృడ‌ప‌డింది. రాష్ట్రప‌తి అభ్య‌ర్థి విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రికి తాను స‌ల‌హా ఇచ్చిన‌ట్లు కేసీఆర్ స్వ‌యంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రు బ‌ల‌మైన నేత‌ల మ‌ధ్య బంధం మ‌రింత ధృడంగా మారుతుంద‌నేందుకు తాజాగా ఎన్డీఏ ప‌క్షాల ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థి సంద‌ర్భంగా రూడీ అయింది.

బీజేపీ సార‌థ్యంలో ఎన్డీఏ ప‌క్షాల ఉపరాష్ట్రపతి అభ్య‌ర్థిగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వెంక‌య్య‌ను ఎన్డీఏ అభ్యర్థిగా నిర్ణయించినట్లు ప్రధాని మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యకు మద్దతు ఇవ్వాలని ప్రధాని మోడీ సీఎం కేసీఆర్‌ను కోరారు. దీనికి స‌మ్మ‌తించిన సీఎం కేసీఆర్ త‌మ పార్టీ త‌ప్ప‌నిస‌రిగా ఎన్డీఏ ప‌క్ష నేత‌కే మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని తెలిపారు. ఆ వెంట‌నే కేసీఆర్ త‌న‌య ఎంపీ కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగారు. పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ జితేందర్ రెడ్డి తో కలసి వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్లిన ఆమె ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక‌యిన వెంకయ్య నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ పొలిటీషియన్ కు ఉపరాష్ట్రపతి అభ్యర్థి గా పోటీ చేసే అవకాశం రావడం సంతోషకరమని అన్నారు. త‌మ పార్టీ మ‌ద్ద‌తు వెంక‌య్య‌నాయుడుకే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌రోవైపు కేసీఆర్ కుటంబంలో మ‌రో ఇద్ద‌రు కీల‌క నేత‌లు, రాష్ట్ర మంత్రులు అయిన హరీశ్‌రావు, కేటీఆర్ సైతం త‌క్ష‌ణ‌మే రియాక్ట‌య్యారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును ప్రకటించడం హర్షణీయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యకు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఓ తెలుగు వ్యక్తికి ఈ అవకాశం రావడం సంతోషకరమైన విషయమన్నారు. పార్టీలకు అతీతంగా వెంకయ్యకు మద్దతు తెలిపే అవకాశం ఉంటుందని హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. వెంకయ్యకు మద్దతుపై పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని హరీశ్‌రావు తెలిపారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎంపికవడం పట్ల కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్‌కు ద‌క్కిన గౌర‌వం అని తెలిపారు.