Begin typing your search above and press return to search.

ఆంధ్రోడి ఆక్రోశం; మోడీ మరీ ఇంత చిల్లరోడా..?

By:  Tupaki Desk   |   5 May 2016 4:28 AM GMT
ఆంధ్రోడి ఆక్రోశం; మోడీ మరీ ఇంత చిల్లరోడా..?
X
ఆంధ్రోడి గుండె బద్ధలైంది. రెండేళ్లకు ముందు తాను వద్దంటున్నా.. తనకు ఇష్టం లేదన్నా వినకుండా ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ అధినేత్రి తీరును ప్రతిఒక్క ఆంధ్రోడు తప్పు పట్టారు. వారితో పాటు.. పలు రాష్ట్రాలకు చెందిన నేతలు.. పార్టీ అధినేతలు ఫీలయ్యారు. రాష్ట్ర విభజన జరిగినా.. ఆంధ్రాకు ఏ మాత్రం న్యాయం జరగలేదని.. పూర్తిస్థాయిలో అన్యాయం జరిగిందన్న వాస్తవాన్ని ప్రతిఒక్కరూ ఒప్పుకునే పరిస్థితి.

కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన విభజన తీరును మోడీ స్వయంగా తప్పు పట్టటమే కాదు.. ఇదే మాత్రం సరికాదన్న పెద్దమనిషి మాటలు మాట్లాడిన వారిలో ఇప్పుడు ప్రధానిగా బాధ్యతలు నెరవేరుస్తున్న మోడీ ఒకరు. సోనియమ్మ జరిపిన ఏపీ విభజన కారణంగా ఆంధ్రులకు తీరని ద్రోహం జరిగిందని.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు చేసిన తప్పును సరిదిద్దుతామని మోడీ మాట ఇవ్వటం తెలిసిందే.

కానీ.. అందుకు భిన్నంగా తాజాగా మోడీ సర్కారు అనుసరించిన వైఖరి పట్ల ఆంధ్రులు తీవ్ర ఆవేదనతో రగిలిపోయే పరిస్థితి. ఎన్నికల సమయంలోనే కాదు.. వివిధ సందర్భాల్లో మాట్లాడిన ఆయన.. ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ చేసిన వ్యాఖ్యల్ని చూసిన ప్రతిఒక్కరూ మోడీ తమకు అండగా నిలుస్తారని నమ్మారు.
కానీ.. ఎలాంటి వివరణ లేకుండా.. మాట ఇచ్చిన పెద్దమనిషి తనకేమాత్రం సంబంధం లేదన్నట్లుగా ఉండటమే కాదు.. చావు కబురు చల్లగా అన్నట్లు తన పరివారం చేత చెప్పించిన తీరు చూసినప్పుడు తాను కోరుకున్న పని పూర్తి అయ్యాక.. తన బాధ్యతను నిర్ధాక్షిణ్యంగా వదిలేసే తీరు చూసినప్పుడు మోడీ ఏ మాత్రం నమ్మకస్తుడు కాదన్న భావం కలగటం ఖాయం. సగటు రాజకీయ నేతతో పోలిస్తే.. ఎంతో ఉన్నతుడని మోడీని చూసినోళ్లంతా ఫీలైన వారందరికి షాకులిస్తూ.. తానొక చిల్లర నేతనన్న విషయాన్ని ఏపీ ప్రత్యేకహోదా విషయంలో తేల్చి చెప్పారని చెప్పాలి.

పంచాయితీ వార్డు మెంబరు సైతం ఈ రోజున తానిచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కిందామీదా పడే పరిస్థితి. ఒక ఛోటా నేతకే అంత తాపత్రయం ఉంటే.. దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇంకెంత బాధ్యతగా వ్యవహరించాలి? కానీ.. అలాంటిదేమీ లేకుండా చిల్లర మనిషిలా.. ఇచ్చిన కీలక హామీని పక్కన పడేసి కోట్లాదిమంది ఆంధ్రోళ్ల బతుకుల్ని గాలికి వదిలేసి.. చేతులు దులుపుకున్న తీరును చూసిన తర్వాత మోడీ చిల్లర నేత కాదని ఎలా చెప్పగలరు? ఆంధ్రోళ్లలో ఎవరు మాత్రం ఆయన్ను చిల్లర మాట అనకుండా ఉండగలరు..?