Begin typing your search above and press return to search.

కేసీఆర్ తో భేటీకి మోడీ నో..?

By:  Tupaki Desk   |   28 Oct 2015 11:37 AM IST
కేసీఆర్ తో భేటీకి మోడీ నో..?
X
ఎంత బలమైన నాయకుడైనా.. ప్రజాకర్షక నేత అయినా సరే.. ఢిల్లీ ముందు ఎంత చిన్నవాడన్నది చాలా సార్లు రుజువవుతుంటుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఢిల్లీ ప్రభువుల దయ లేకుంటే.. వారిని కలిసే ఛాన్స్ కూడా ఉండదు.

ఈ సత్యం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరోసారి అర్థమై ఉంటుంది. తాను చేసే వ్యాఖ్యలకు భవిష్యత్తులో చింతించాల్సిన అవసరం ఇప్పటివరకూ కేసీఆర్ కు వచ్చిందేమీ లేదు. ఎందుకంటే.. ఆయన వ్యూహం పన్నారంటే ఎంతటి వారైనా క్లీన్ బౌల్డ్ కావాల్సిందే. కాంగ్రెస్ పార్టీకి అధినేత్రి అయినప్పటికీ.. ఒరిజినల్ గా కాంగ్రెస్ రక్తం లేకపోవటం వల్లనే కేసీఆర్ ఎత్తులకు సోనియాగాంధీ చిత్తు అయ్యారని కాంగ్రెస్ వృద్ధ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ఈ మాటను చాలామంది ఒప్పుకోరు కానీ.. సంప్రదాయ కాంగ్రెస్ వాదులు మాత్రం ఈ మాటను బలంగా ప్రస్తావిస్తుంటారు.

కాంగ్రెస్ తలలో నుంచి వచ్చిన మోడీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉంటే.. కేసీఆర్ లాంటి వారికి ఎన్ని తిప్పలో తాజా ఉదంతం చూస్తే తెలుస్తుంది. కొన్ని నెలలుగా ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. కానీ.. ఆయనకు ఎప్పటి మాదిరి ఈసారి నిరాశే ఎదురైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత్ నుంచి తప్పిపొయి పాక్ కు చేరుకున్న గీత.. పదిహేనేళ్ల తర్వాత భారత్ కు చేరుకున్నారు. ఆమ ఢిల్లీలోఅడుగు పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే మోడీ దర్శనం లభించింది. అంతేకాదు.. ఆమెతో అప్యాయంగా మోడీ కాసేపు గడిపారు.

అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీకి మాత్రం ఆయన ససేమిరా అన్నారు. గీతను కలిసేంత సమయం ఉన్న ప్రధాని మోడీకి.. కేసీఆర్ తో విడిగా కలవటానికి ససేమిరా అనటం చూసినప్పుడు.. మోడీలోని మరో కోణం ఇట్టే కనిపిస్తుంది.

నిజానికి మోడీని కలవాలని కేసీఆర్ ప్రయత్నించటం.. భంగపడటం కొత్తేం కాదు. కొన్ని నెలల క్రితం కేరళలో తన మిత్రుడైన ఒక వ్యాపారవేత్త ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరైన కేసీఆర్.. కేరళ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లి మోడీని కలవాల్సి ఉంది. దీనికి సంబంధించి భారీగా ప్రచారం కూడా జరిగింది. కానీ.. ఆయనకు మోడీతో అపాయింట్ మెంట్ కన్ఫర్మ్ కాకపోవటంతో కేరళ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చేశారు.

అదొక్కసారే కాదు.. పలు సందర్భాల్లో మోడీని కలుసుకునేందుకు.. ఆయనతో భేటీకి కేసీఆర్ విపరీతంగా ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. తాజాగా.. అమరావతి శంకుస్థాపన సమయంలోనూ మోడీకి దగ్గరగా మెలుగుతూ.. విధేయుడిగా వ్యవహరించినప్పటికీ ఈదఫా కూడా మోడీ అపాయింట్ మెంట్ ఓకే కాకపోవటం గమనార్హం. ఎన్నికల సమయంలో మోడీ మీద కేసీఆర్ చేసిన వ్యక్తిగత విమర్శలే ఇందుకు కారణంగా చెబుతారు. నిజానికి.. సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీపై మరే నేత విరుచుకుపడనంత తీవ్రస్థాయిలో కేసీఆర్ విమర్శలు గుప్పించారు.

ఉద్యమ నేతగా తనకు అలవాటైన విధానాన్ని అనుసరించిన ఆయనకు తత్వం కాస్త ఆలస్యంగా బోధ పడిందని చెబుతారు. ఉద్యమ నేతగా ఉండే స్వేచ్ఛ.. రాజకీయ నేతగా ఉండదని తెలిసిన తర్వాత మోడీని పొగిడే కార్యక్రమానికి తెర తీశారు. తద్వారా ఎన్నికల సమయంలో తాను చేసిన విమర్శల వేడిని తగ్గించే ప్రయత్నం చేశారు. అయితే.. ఇలాంటి వాటికి మోడీ మనసు కరగదని.. కొన్ని విషయాల్లో ఆయన చాలా మొండిగా ఉంటారని మోడీ తత్వం తెలిసిన వారు చెబుతారు. మొండోడు రాజు కంటే బలవంతుడంటారు. మరి.. రాజే మొండోడు అయితే.. ?