Begin typing your search above and press return to search.

మోడీ బాట.. వారికి అనుసరణీయం కాదా?

By:  Tupaki Desk   |   12 April 2018 8:27 AM GMT
మోడీ బాట.. వారికి అనుసరణీయం కాదా?
X
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రిలేనిరాహార దీక్ష చేస్తున్నారు. మోడీ చాలా చిత్రమైన శైలిలో తన దీక్షను చేస్తుండడం విశేషం. అందరి దీక్షల్లాగా తాను శిబిరాల్లో కూర్చుని నిరాహారంగా ఉండను అని.. తన రోజువారి విధులను నిర్వర్తిస్తూనే అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. నిరాహార దీక్ష మాత్రం చేస్తానని మోడీ ప్రకటించారు. ఆమేరకు ఆయన అసలు వివాదానికి - పార్లమెంటు స్తంభించడానికి - ఈ నిరాహారదీక్షకు మూలకారణమైన చెన్నై నగరంలో కూడా పర్యటించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. నరేంద్రమోడీ ప్రత్యేకతరహాలో చేస్తున్న ఈ నిరాహార దీక్ష ఆయనకు మాత్రమే పరిమితమా..? పార్టీ మొత్తం మామూలు దీక్షల్లో మునిగి తేలవలసిందేనా? అనే విమర్శలు పుష్కలంగా వినిపిస్తున్నాయి. మోడీ మాత్రం.. నిరాహారదీక్షలో ఉంటూ పనిచేస్తూ తిరుగుతున్నారు.

అదే సమయంలో ఆయన పార్టీ ఎంపీలు మాత్రం.. శిబిరాలు వేసుకుని.. దీక్షలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. శిబిరాలు ఉంటేనే నిరాహార దీక్షలు నిజాయితీగా జరుగుతున్నట్లుగా ప్రజలు నమ్మడం లేదు.. అలాంటిది.. శిబిరం కూడా లేకుండా.. కార్యక్రమాల పేరిట ఎప్పటిలాగే తిరుగుతూ.. దీక్ష చేస్తే అసలు ప్రజలు తమను ఏమాత్రం సీరియస్ గా తీసుకోరు అని.. భాజపా నాయకులే వ్యాఖ్యానిస్తుండడం విశేషం.

ప్రధాని నరేంద్రమోడీ విషయంలో.. తాను ఏం చేస్తే ప్రజలు దానినే నమ్ముతారని ఆయనలో ఓ భావన బలంగా ఉన్నట్లుంది. తాను అధికార విధులు - కార్యక్రమాల మధ్య ఎడాపెడా తిరుగుతూ నిరాహారంగా ఉన్నానని చెబితే చాలు ప్రజలు తాను దీక్ష చేసినట్లు నమ్మేసినట్లే అని మోడీ అనుకుంటున్నారేమో. అలాంటి నమ్మకం దేశప్రజల్లో ఇప్పుడు తాను కోల్పోయినట్లు ఆయన తెలుసుకోవాలి. మాట నిలకడ లేని మోడీ.. ఎవరూ చూసే గమనించే అవకాశం లేకుండా తిరుగుతుండగా.. నిబద్ధతతో దీక్షలో ఉన్నాడని ఎందుకు నమ్మాలి? అనేదే ప్రజల ప్రశ్న.

చూడబోతే.. పార్లమెంటు నడిచేలా ప్రభుత్వాధినేతగా చర్యలు తీసుకునే చిత్తశుద్ధి తనకు ఎటూ లేదని మొన్నటి సమావేశాల్లోనే మోడీ నిరూపించుకున్నారని.. పార్లమెంటు నడవకపోయినందుకు నిరసన వ్యక్తం చేయడంలో అయినా చిత్తశుద్ధి ఉంటే.. పద్ధతిగా ఒక చోట శిబిరంలో కూర్చుని నిరాహారదీక్షచేసి ఉంటే ప్రజలు నమ్మేవారని అంతా అంటున్నారు.