Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రినీ ఒక‌టి చేయ‌నున్న మోడీ జీ

By:  Tupaki Desk   |   26 July 2017 5:36 AM GMT
ఆ ఇద్ద‌రినీ ఒక‌టి చేయ‌నున్న మోడీ జీ
X
స‌మ‌స్య‌ల చిక్కుముడులు విప్ప‌డంలో స‌మ‌ర్థుడిగా పేరొందిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై ఇప్పుడు త‌మిళ నేత‌లు క‌న్నుప‌డింది. త‌మ రాష్ర్టాన్ని వేధిస్తున్న స‌మ‌స్య‌కు మోడీజీ ప‌రిష్కారం చూప‌గ‌ల‌రని అంటున్నారు. ఎందుకంటే త‌మిళ‌నాడు రాష్ట్ర రాజకీయం ఢిల్లీకి చేరింది. కీల‌క భేటీల‌తో త‌మిళ అధికార పార్టీ నేత‌లు బిజీబిజీగా ఉన్నారు. అధికారంలోని పార్టీ - భాజపాకు మిత్రపక్షమైన అన్నాడీఎంకేలో విభేదాలను సరిదిద్దడానికి ఇదే మంచి తరుణమని కమలనాథులు భావిస్తున్నారని. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు; రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్నాడీఎంకే వర్గాల మద్దతు; రానున్న ఎన్నికల్లో ప్రయోజనం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని రెండు వర్గాలను ఒక్కటిగా చేయాలని భాజపా కసరత్తు చేస్తోందని సమాచారం. ఇందులో భాగంగానే అన్నాడీఎంకేలోని కీలక నేతలను ఢిల్లీకి కేంద్రం పిలిపించుకుందని ప్రచారం సాగుతోంది.

రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారానికి ముఖ్య‌మంత్రి ఎడప్పాడి పళనిస్వామి - మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం హాజరయ్యారు. అనంత‌రం అన్నాడీఎంకే పురచ్చితలైవి అమ్మ వర్గం నేత పన్నీర్‌ సెల్వం - ఆయన మద్దతుదారులు మైత్రేయన్‌ - కేపీ మునుస్వామి - నత్తం విశ్వనాథన్‌ - సెమ్మలై - మనోజ్‌ పాండియన్‌ తదితరులు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నీట్‌ - హైడ్రోకార్బన్‌ ప్రాజెక్టు ప్రతిపాదన - కావేరీ అంశాలను ప్రస్తావించారు. అన్నాడీఎంకే అమ్మ వర్గం - అధికార పార్టీ నుంచి మంత్రులు జయకుమార్‌ - తంగమణి - విజయభాస్కర్‌ - షణ్ముగం - అన్బళగన్‌ లు లోక్‌ సభ ఉప సభాపతి తంబిదురై నేతృత్వంలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా - అరుణ్‌ జైట్లీ - రాజ్‌ నాథ్‌ సింగ్‌ లతో సమావేశం అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సైతం డిల్లీ చేరుకున్నారు.మ‌రుస‌టి రోజు రాష్ట్రపతి ప్రమాణస్వీకారంలో ఎడప్పాడి పళనిస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... నీట్‌ అంశంపై మాట్లాడటానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ కానున్నట్లు చెప్పారు. ఇలా రెండు కీల‌క వ‌ర్గాల‌ను నాయ‌క‌త్వం వ‌హిస్తున్న నేత‌లు ప్ర‌ధానితో భేటీ అయిన అనంత‌రం చీలిక పంచాయ‌తీకి చెక్ పెట్టాల‌ని కోరుతూ ఇద్ద‌రిని ఏకం చేసే ప్ర‌తిపాద‌న‌ను ప్ర‌ధాన‌మంత్రి పెట్ట‌నున్న‌ట్లు త‌మిళ వ‌ర్గాలు ఆశిస్తున్నాయి.

మ‌రోవైపు దీనికి అనుగుణంగానే ప్రస్తుతం దిల్లీలో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు. రాష్ట్ర ఇన్‌ ఛార్జి గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు కూడా ఢిల్లీలోని తమిళనాడు భవన్‌ లో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి శాశ్వత గవర్నరుగా సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు నియమితులు కానున్నారని ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు అన్నాడీఎంకే రెండు వర్గాల్లోని కీలకనేతలు ఒకేసారి దిల్లీకి చేరడంతోపాటు విడివిడిగా ప్రధాని, ఇతర ప్రముఖ నేతలను కలవడం చకచకా జరిగిపోయాయి. రాష్ట్రంలోని అన్నాడీఎంకేకు చెందిన కీలక నేతలు నెల వ్యవధిలోనే రెండో సారి దేశ రాజధానికి చేర‌డం..కీల‌క నేత‌ల‌తో చ‌ర్చ‌ల ఫ‌లితంగా విడివిడిగా వెళ్లిన రెండు వర్గాలు... ఒక్కటై వస్తాయని ఆ పార్టీలోని కొంతమంది నేతలు భావిస్తున్నారు.