మోడీ సర్కారు మరో షాకింగ్ నిర్ణయం

Sat Nov 18 2017 10:07:36 GMT+0530 (IST)

అందరూ అనుకునేలా నిర్ణయాలు తీసుకుంటే అది మోడీ సర్కారు అస్సలు కాదు. ఎవరూ ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకొని.. దానికి మా గొప్ప సైద్ధాంతీకరణ చేయటం.. అమితంగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు.. ప్రభావానికి గురి చేయటంలో ప్రధాని మోడీ తర్వాతే ఎవరైనా.పక్కనున్న పాక్ కు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు చెప్పినా.. చైనాకు బుద్ధి చెప్పేందుకు డోక్లాం దగ్గర కటువుగా వ్యవహరించినట్లు కనిపించినా.. పెద్దనోట్ల రద్దు కావొచ్చు.. ఆఖరకు జీఎస్టీ కావొచ్చు.. ప్రచారం జరిగినంతగా ఫలితం వచ్చిందా? అంటే.. అసలు నిజం అందరికి తెలిసిందే.

ఇలా ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ.. జనాలకు తరచూ పరీక్షలు పెట్టే మోడీ సర్కారు తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకోవాలని భావిస్తున్నారా? అంటే.. అవునని చెబుతోంది బ్యాకింగ్ ఇండస్ట్రీ. బ్యాంకుల్లో వినియోగించే చెక్ బుక్ సౌకర్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో మోడీ సర్కారు ఉన్నట్లుగా చెబుతున్నారు.

దేశమంతా డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు వీలుగా మోడీ సర్కారు ఈ ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.  కరెన్సీ నోట్లను ముద్రించటానికి కేంద్రం రూ.25వేల కోట్లు ఖర్చు చేస్తుందని.. ఈ నోట్ల భద్రతో పాటు రవాణా కోసం రూ.6వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.
 
అందుకే ఈ భారీ ఖర్చును తగ్గించుకోవటంలో భాగంగా నగదురహిత లావీదేవీల్ని ప్రోత్సహించాలని మోడీ సర్కారు భావిస్తోందని చెబుతున్నారు. నోట్ల ప్రింటింగ్.. రవాణా.. సెక్యురిటీ తదితరాల కోసం చేసే ఖర్చును బ్యాంకులకు బదిలీ చేసి.. క్రెడిట్.. డెబిట్ కార్డుల లావాదేవీల్ని ఉచితంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

అదే జరిగితే.. దశల వారీగా నోట్ల ప్రింటింగ్ ను తగ్గించేసి (విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పటికే నోట్ల ముద్రణను తగ్గించినట్లు తెలుస్తోంది)-.. నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహిస్తే ప్రజలకు.. ప్రభుత్వానికి ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో మరో పాయింట్ ఏమిటంటే.. ఎప్పుడైతే డిజిటల్ చెల్లింపుల చట్రంలోకి వచ్చేస్తే.. ఎవరి ఆదాయం ఎంతన్న విషయం ఇట్టే తెలిసిపోతుంది. దీంతో పన్ను ఎగవేతకు చెక్ చెప్పటంతో పాటు.. ప్రభుత్వ పథకాల్ని భోంజేసే బ్యాచ్ ను భారీగా తగ్గించొచ్చన్న మాట వినిపిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ.. నిత్యం పన్నులు కట్టే మధ్యతరగతి జీవికి ఇవన్నీ మరింత భారంగా మారటం ఖాయం. వారికి.. ఉపశమనం కలిగించేలా మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.