మోడీ తన కంటే గ్రేట్ అని ఒప్పుకొన్న రాహుల్

Wed Sep 13 2017 23:00:01 GMT+0530 (IST)

ఇంటాబయటా ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారో అంతే స్థాయిలో ప్రశంసలూ పొందుతున్న ప్రధాని మోడీకి అనుకోని రీతిలో ఆయన ప్రత్యర్థి రాహుల్ గాంధీ నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. అది కూడా వ్యక్తిగత ప్రతిభకు సంబంధించిన విషయంలో ఆ ప్రశంసలు దక్కడం విశేషం. అయితే... మోడీపై ప్రశంసలతో పాటు ఆయన పాలనపై రాహుల్ విమర్శలూ కురిపించారు.
    
మోడీ తన కంటే గొప్ప వక్త అని... భావ వ్యక్తీకరణలో ఆయన మంచి ప్రతిభావంతుడని ఆయన చాలా బాగా మాట్లాడుతారని రాహుల్ అన్నారు. అదే సమయంలో ఆయన మోడీ తనతో పనిచేసేవారి మాటలను మాత్రం పెడచెవిన పెడతారంటూ విమర్శలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ - నిన్న బర్క్ లీ లోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు.
    
సభలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో మోదీకి బాగా తెలుసని... అయితే ఆయనతో పాటు పనిచేసేవారి మాటలను ఆయన ఏమాత్రం వినరని - బీజేపీ ఎంపీలే కొందరు తనకు ఆ విషయం చెప్పారని రాహుల్ అన్నారు. కలసి పని చేసే వారి మాటలను కూడా మోదీ పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందంటూ రాహుల్ మోడీకి సూచన కూడా చేశారు.  మేకిన్ ఇండియా పథకం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రమే మేలు చేస్తుందని... కానీ స్వచ్ఛ భారత్ పథకం తేవడం మాత్రం మంచి పరిణామమని రాహుల్ కితాబిచ్చారు.