తనకు బాబుకు తేడా చూపించిన జగన్!

Mon Jun 10 2019 09:58:44 GMT+0530 (IST)

ఒక్కో ప్రభుత్వం ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటుంది. పాలకుడి అభిరుచి.. మైండ్ సెట్ కు తగ్గట్లుగా పాలనా వ్యవహారాలు సాగుతుంటాయి. ప్రభుత్వ పని తీరు కూడా ఉంటుంది. ఈ వ్యత్యాసం తాజాగా ప్రధాని మోడీ అనుభవంలోకి వచ్చి ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. తాజాగా తిరుపతి పర్యటనకు వచ్చిన మోడీకి.. జగన్ సర్కారుకు.. బాబు జమానాకు మధ్య తేడా ఆయనకు కొట్టొచ్చినట్లుగా కనిపించి ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది.ప్రభుత్వాన్ని కొలువు తీర్చిన నాటి నుంచి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  సింఫుల్ గా ఉంటున్నారు. అనవసరమైన ఆర్భాటాలకు దూరంగా ఉండటం.. ఖర్చు విషయంలో ఆచితూచి అన్నట్లుగా ఉండటం తెలిసిందే. ప్రమాణస్వీకారం ఖర్చును సైతం చాలా తక్కువతో కానిచ్చిన జగన్.. మంత్రుల ప్రమాణస్వీకార సమయంలోనూ అలాంటి జాగ్రత్తలే తీసుకున్నారు.

ఖర్చు విషయంలో మోడీ ఎప్పుడూ ఒక కన్నేస్తుంటారు. దుబారా ఖర్చులు ఆయనకు అస్సలు నచ్చవు. అందులోకి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రం.. తనవంతుగా జాగ్రత్తలు తీసుకోకుండా.. అదే పనిగా కేంద్రం మీద ఆధారపడటం.. నిధుల కోసం వెంపర్లాడటం లాంటి వాటి విషయంలో ఆగ్రహం ఉంటారు. ఆర్థిక క్రమశిక్షణతో ఉంటూ.. అవసరమైన నిధుల కోసం అడిగితే తప్పు లేదన్న మైండ్ సెట్ మోడీది.

అలాంటి మోడీకి.. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసే దుబారా ఖర్చు మీద ఆయన గుర్రుగా ఉండేవాళ్లని చెప్పేవాళ్లు. ఓపక్క ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందంటూనే.. వ్యక్తిగత అంశాల విషయంలో కోట్లాది రూపాయిల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసిన వైనంపై ఆయన గుర్రుగా ఉండేవారని.. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పమంటే చెప్పకపోవటం ఆయనకు అస్సలు నచ్చేది కాదని చెబుతారు.

అందుకు భిన్నంగా జగన్ ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉన్నారన్న ఫీడ్ బ్యాక్ మోడీకి అందినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న నేపథ్యంలో.. దాన్ని చక్కదిద్దేందుకు కృషి చేయటం.. అందుకోసం వృధా ఖర్చును కంట్రోల్ చేస్తున్న వైనంపై ఇప్పటికే ఆయనకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. ఈ కారణాలు కూడా జగన్ మీద ఇంప్రెషన్ పెరిగేలా చేస్తున్నాయని చెబుతున్నారు. జగన్ తో మోడీ అంత సన్నిహితంగా ఉండటానికి ఆయన పది రోజుల పాలన మీద నిఘా వర్గాలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా కారణంగా తెలుస్తోంది.