Begin typing your search above and press return to search.

బాబు వైపు మోదీ క‌న్నెత్తి కూడా చూడ‌లేద‌ట‌!

By:  Tupaki Desk   |   4 April 2018 8:20 AM GMT
బాబు వైపు మోదీ క‌న్నెత్తి కూడా చూడ‌లేద‌ట‌!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న‌లో భాగంగా ఢిల్లీ వేదిక‌గా పోరు సాగిస్తానంటూ ఇప్పుడు ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్న టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... వ‌రుస ఎదురు దెబ్బ‌ల‌ను తింటున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మొన్న రాత్రే ఢిల్లీ చేరిన చంద్ర‌బాబు... నిన్న మ‌ధ్యాహ్నానికి కాస్తంత ముందుగా పార్ల‌మెంటు చేరుకుని సెంట్ర‌ల్ హాల్ వేదిక‌గా మంత‌నాలు ప్రారంభించారు. ఈ క్ర‌మంలో దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు అక్క‌డే ఉన్న చంద్ర‌బాబు... సెంట్ర‌ల్ హాలుకు వ‌చ్చిన ప‌లు పార్టీల నేత‌లు, ఎంపీల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఎంపీలంతా కాస్తంత రిఫ్రెష్ అయ్యేందుకు కాఫీ, టీ, స్నాక్స్ తో కాల‌క్షేపం చేసేందుకు ఉద్దేశించిన సెంట్ర‌ల్ హాల్ లో ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న నేత ఇత‌ర పార్టీల నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారంటే ... అవి ఏ పాటి చ‌ర్చ‌ల‌న్న విష‌యం ఇట్టే తేలిపోతోంద‌నే చెప్పాలి. అయితే ఇక్క‌డే మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

నాలుగేళ్ల పాటు త‌మ‌తో క‌లిసి న‌డిచి, తాము చెప్పిన మాట‌కు స‌రేన‌న‌డంతో పాటు ప్ర‌త్యేక హోదా వ‌ద్దు, ప్ర‌త్యేక ప్యాకేజీనే ముద్దు అన్న రీతిలో వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు... ఇప్పుడు అకార‌ణంగా యూటర్న్ తీసుకున్న వైనంపై బీజ‌పీ నేత‌లు గుర్రుగానే ఉన్నారు. అయినా ప్ర‌త్యేక హోదాపై తామేమీ మాట మార్చలేద‌ని, మాట మార్చింది చంద్ర‌బాబేన‌ని, ఈ క్ర‌మంలో హోదా విష‌యంలో తామెలా దోషుల‌మ‌వుతామ‌న్న‌ది కూడా బీజేపీ నేత‌ల్లో నుంచి వినిపిస్తున్న ప్ర‌శ్న‌, చంద్ర‌బాబు అండ్ కో చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ఎంత ఓర్చుకుందామ‌నుకున్నా కూడా కుద‌రని నేప‌థ్యంలో కొంద‌రు బీజేపీ నేత‌లు నోరు విప్ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇలాంటి త‌రుణంలో ప్ర‌ధాని హోదాలో ఉన్న న‌రేంద్ర మోదీ ఇప్ప‌టిదాకా చంద్ర‌బాబు తీరుపై గానీ, టీడీపీ తీరుపై గానీ ఒక్క మాట కూడా మాట్లాడ‌లేద‌నే చెప్పాలి. మొత్తంగా బీజేపీ నేత‌లు చంద్ర‌బాబుపై గుర్రుగా ఉన్నా... ప్ర‌ధాని హోదాలో ఉన్న మోదీ అలా వ్య‌వ‌హ‌రించ‌రు క‌దా? అన్న భావ‌న వినిపించింది. అయితే బాబు వ్య‌వ‌హ‌రించిన తీరు మోదీని కూడా హ‌ర్ట్ చేసింద‌ని నిన్న‌టి ఓ సంఘ‌ట‌న తేల్చి పారేసింది.

ఆ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... నిన్న పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్ లో చంద్ర‌బాబు వివిధ పార్టీ నేత‌ల‌తో మాట్లాడుతున్న స‌మ‌యంలో మోదీ కూడా అటుగానే వెళ్లార‌ట‌. ఈ క్ర‌మంలో త‌న కంట చంద్ర‌బాబు ప‌డినా... ఆయ‌న వైపు క‌న్నెత్తి చూసేందుకు కూడా మోదీ ఇష్ట‌ప‌డ‌లేద‌ట‌. నాలుగేళ్ల పాటు ఎన్డీఏ కీల‌క భాగ‌స్వామిగా ఉన్న పార్టీకి అధినేత‌గానే కాకుండా... ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న నేత త‌న కంట‌బ‌డితే మోదీ ప‌ల‌క‌రించ‌కుండా ఉండ‌ట‌మ‌నేది చాలా అరుదే. ఒక్క మోదీనే కాదు.. ప్ర‌ధాని హోదాలో ఉన్న ఏ నేత అయినా... పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో సీఎం స్థాయి నేత క‌నిపిస్తే ప‌ల‌క‌రించ‌కుండా ఉండ‌ట‌మనేది దాదాపుగా అసాధ్య‌మే. అలాంటిది మొన్న‌టిదాకా త‌న మిత్రుడిగా సాగిన చంద్ర‌బాబు త‌న క‌ళ్లెదురుగా క‌నిపించినా... మోదీ ఆ దిశ‌గా క‌న్నెత్తి కూడా చూడ‌క‌పోవ‌డం చూస్తుంటే... బాబు వ్య‌వ‌హార స‌ర‌ళితో మోదీ కూడా హ‌ర్ట్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. అంటే... చంద్ర‌బాబు యూట‌ర్న్ వైఖ‌రితో మోదీ కూడా గుర్రుగానే ఉన్నార‌న్న మాట‌. ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ అనుకూల మీడియా త‌మకు అనుకూల‌మైన కోణంలో క‌థ‌నాలు రాయ‌గా... జాతీయ మీడియా మాత్రం దీనిపై ఉన్న‌దున్న‌ట్లుగా ఆస‌క్తికర క‌థ‌నాలను రాసింద‌నే చెప్పాలి.