Begin typing your search above and press return to search.

ప్రధాని హైద‌రాబాద్‌ పర్యటన షెడ్యూల్ ఖరారైంది

By:  Tupaki Desk   |   23 Nov 2017 4:24 PM GMT
ప్రధాని హైద‌రాబాద్‌ పర్యటన షెడ్యూల్ ఖరారైంది
X
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఎట్ట‌కేల‌కు భారీ ఊర‌ట ల‌భించింది. గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ ప్రెన్యూర్‌ షిప్ స‌ద‌స్సుకు హాజ‌ర‌వ‌డం, హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రారంభోత్స‌వం విష‌య‌లో ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ విష‌యంలో ఉన్న ఊగిస‌లాడ వీడింది. ఎట్ట‌కేల‌కు మోడీజీ హైద‌రాబాద్ షెడ్యూల్‌ ఖరారయింది. ఇన్నాళ్ల ఉత్కంఠ తొల‌గ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం పెద్ద‌లు ఊపిరి పీల్చుకున్న‌ట్ల‌యింది.

ప్ర‌భుత్వ స‌మాచారం ప్ర‌కారం ఈనెల 28న ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 2.30కు మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట నుంచి మియాపూర్‌ కు మోడీ హెలికాప్టర్‌ లో వెళ్లనున్నారు. మియాపూర్‌ లో మెట్రోరైలు పైలాన్‌ ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్రారంభిస్తారు. అనంతరం మియాపూర్ నుంచి కూకట్‌ పల్లి వరకు మెట్రోరైలులో ప్రధాని ప్రయాణిస్తారు. తిరిగి అదే మెట్రో రైలులో కూకట్‌ పల్లి నుంచి మియాపూర్ వరకు ప్ర‌ధాని ప్రయాణిస్తారు. తర్వాత మియాపూర్ నుంచి హెచ్‌ ఐసీసీకి హెలికాప్టర్‌ లో వెళ్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు హెచ్‌ ఐసీసీలో జ‌రిగే గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ ప్రెన్యూర్ షిప్ స‌మ్మిట్‌ లో ప్ర‌ధాని పాల్గొంటారు. సదస్సులో ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ - సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

జీఈఎస్‌ లో ప్ర‌సంగం అనంతరం హెచ్‌ ఐసీసీ నుంచి రోడ్డు మార్గంలో ప్రధాని ఫలక్‌ నుమా ప్యాలెస్‌ కు వెళ్లనున్నారు. ఇవాంకా - జీఈఎస్ ప్రతినిధులకు ఫలక్‌ నుమా ప్యాలెస్‌ లో ప్రధాని మోడీ విందు ఇవ్వనున్నారు. రాత్రి 8.45 గంటలకు విందు కార్యక్రమం ఉంటుంది. విందు తర్వాత శంషాబాద్ విమానాశ్రయం వెళ్లి.. అక్కడి నుంచి మోడీ ఢిల్లీ వెళ్లనున్నారు.