Begin typing your search above and press return to search.

మోడీ కౌగిలింత‌ల‌పై ప్ర‌త్యేక వీడియో

By:  Tupaki Desk   |   15 Jan 2018 6:46 PM GMT
మోడీ కౌగిలింత‌ల‌పై ప్ర‌త్యేక వీడియో
X
ప్రధాని నరేంద్ర మోడీ క‌ద‌లిక‌ల‌ను ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ నిశితంగా గ‌మ‌నిస్తున్న‌ట్లుంది. అందుకే ఏకంగా వీడియో విడుద‌ల చేసింది. ప్ర‌ధాని మోడీ విదేశీ నేతలను కలిసిన సందర్భంలో చేసిన ఆలింగనాలను ఎగతాళి చేస్తూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. దీనిపై బీజేపీ మండిపడింది. భారత్ పరువును కాంగ్రెస్ మంట గలిపిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మండిపడ్డారు. దేశంలో పార్టీలపరంగా ప్రధానిని విమర్శించవచ్చునని, కాని నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అన్న విషయం మరచిపోయి కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని పేర్కొన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ విదేశీ పర్యటనలోకూడా భారతదేశాన్ని కించపరిచేలా విమర్శలు చేశారని సంబిత్ పాత్రా వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ అధినేతలతో ఆత్మీయంగా మెలుగుతూ చేసిన ఆలింగనాల వీడియోను కాంగ్రెస్ పార్టీ అధికార ట్విటర్ అకౌంట్‌లో విడుదల చేసింది. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ ఆరు రోజుల పర్యటనకు ఆదివారం ఢిల్లీకి చేరుకున్న సందర్భంలో ఈ వీడియో విడుదల చేయడం పెద్దవివాదంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆలింగనాలకోసం ఎదురుచూస్తున్నారు అన్న కోణంలో కాంగ్రెస్ పార్టీ వీడియోను ట్వీట్ చేసింది. ప్రధాని మోడీ ‘హగ్ హైలైట్స్’ అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో వివిధ దేశాలకు చెందిన నాయకులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న విధానాన్ని చూపించింది. టర్కీ ప్రధానితో ‘అద్భుత కౌగిలింత’ అని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ‘మరింత వికృతం’ అని, హాలెండ్ మాజీ అధ్యక్షుడితో ‘టైటానిక్ కౌగిలింత’ అని, మెక్సికో అధ్యక్షుడితో ‘నన్ను ప్రేమించనీ’ అన్నట్టు ఉందని, జపాన్ ప్రధాని అబెను కౌగిలించుకుంటూ ‘నిన్ను ఎన్నటికి వెళ్లనివ్వను’ అన్నట్టు ఉందని ఆ వీడియోలో పేర్కొన్నారు.

వివిధ దేశాల అధినేతలను ప్రధాని కౌగిలించుకున్న వాటిపై వ్యంగ్యంగా ఇంగ్లీష్‌లో సబ్ టైటిల్స్‌ను హైలైట్ చేస్తూ, అలాగే మధ్య మధ్యలో సంగీతం సమకూర్చి, కాంగ్రెస్ పార్టీ ఆ వీడియోను విడుదల చేసింది. కాగా, ఈ ప‌రిణామంపై బీజేపీ మండిప‌డింది. కీల‌క దేశానికి ప్ర‌ధాని వ‌స్తే ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికిన విష‌యంలో ఇలాంటి ప్రచారం చేయ‌డం ఏమిట‌ని ధ్వ‌జ‌మెత్తింది.