Begin typing your search above and press return to search.

ఈసీ నిర్ణ‌యాన్ని మోడీ స‌ర్కార్ డిసైడ్‌ చేసిందా?

By:  Tupaki Desk   |   22 Oct 2018 5:24 AM GMT
ఈసీ నిర్ణ‌యాన్ని మోడీ స‌ర్కార్ డిసైడ్‌ చేసిందా?
X
ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది. తాజాగా ఐదు రాష్ట్రాల్లో (రాజ‌స్థాన్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. మిజోరం.. తెలంగాణ‌) జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్ని మిన‌హాయిస్తే.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో సాగుతున్న ఎన్నిక‌లు షెడ్యూల్ ప్ర‌కారం జ‌రుగుతున్న‌వే. అంటే.. ఐదేళ్ల క్రితం ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగాయి. మ‌రి.. ఆ ఎన్నిక‌లు ఏ వ‌రుస క్ర‌మంలో సాగాయి? తాజా ఎన్నిక‌లు ఏ వ‌రుస క్ర‌మంలో సాగుతున్నాయి? అన్న‌ది చూస్తే.. ఆస‌క్తిక‌ర అంశాలు క‌నిపిస్తాయి

గ‌తంలో మూడు ద‌శ‌ల్లో రాజ‌స్థాన్ ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. ఈసారి మాత్రం చివ‌రి ద‌శ‌లో జ‌ర‌గ‌టం గ‌మ‌నార్హం. ఎందుకిలా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా చెబుతున్నారు. అంతేనా.. గ‌తంలో చివ‌ర్లో జ‌రిగిన మిజోరం ఎన్నిక‌లు ఈసారి ముందే జ‌రుగుతున్నాయి. ఎన్నిక‌ల షెడ్యూల్ ను కేంద్రం డిసైడ్ చేయ‌దు. స్వ‌యం ప్ర‌తిప‌త్తి ఉన్న కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే ఫైన‌ల్ చేస్తుంది. అలాంట‌ప్పుడు షెడ్యూల్ ఎందుకు ఛేంజ్ అయిన‌ట్లు? అన్న‌ది క్వ‌శ్చ‌న్‌.

దీనికి స‌మాధానం వెతికితే ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూస్తాయి. ఎన్నిక‌ల్ని ఏ రాష్ట్రంలో ఎప్పుడు నిర్వ‌హించాల‌న్న‌ది మొత్తం కేంద్ర ఎన్నిక‌ల సంఘం విచ‌క్ష‌ణ‌తోనే జ‌రుగుతుంది. దాన్ని కేంద్రం ఏ రీతిలోనూ ప్ర‌భావితం చేయ‌లేదు. కాకుంటే.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల కోసం కోరినంత భ‌ద్ర‌త‌ను కేంద్రమే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ అంశాన్ని ఆస‌రాగా చేసుకొని కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యంలో మార్పు వ‌చ్చేలా మోడీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ‌.. మిజోరం మిన‌హాయిస్తే.. మిగిలిన మూడు రాష్ట్రాలు బీజేపీకి చాలా కీల‌కం. ఈ మూడు రాష్ట్రాల్లో క‌మ‌ల‌నాథులే ప‌వ‌ర్లో ఉన్నారు. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తామే మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని బీజేపీ అగ్ర‌నేత‌లు తెగ త‌పిస్తున్నారు. 2019లోజ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు తాజా ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు సెమీ ఫైన‌ల్స్ లాంటివ‌ని.. ఈ ఫ‌లితాలు రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంతో కొంత ప్ర‌భావితం చేయ‌టం ఖాయ‌మంటున్నారు.

ఈ నేప‌థ్యంలో త‌మ‌కు ప్ర‌తికూలంగా ఉన్న మూడు రాష్ట్రాల్లో రాజ‌స్థాన్ లో బీజేపీ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉందంటున్నారు. ఏ స‌ర్వే రిపోర్ట్ చూసినా.. రాజ‌స్థాన్ లో అధికార బ‌దిలీ ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇలాంటివేళ‌.. ముందుగా పోలింగ్ పూర్తి అయిన రాష్ట్రాల‌కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ ఆ ఫ‌లితాలు కాకున్నా.. పోలింగ్ జ‌రిగిన తీరుతో ఒక‌లాంటి ట్రెండ్ మీడియాలో రావ‌టం.. ఆ ప్ర‌భావం ఎన్నిక‌లు జ‌రుగుతున్న మిగిలిన రాష్ట్రాల మీద ప‌డుతుంద‌న్న అంశంపై బీజేపీకి చాలానే అనుమానాలు ఉన్నాయి.

అదే జ‌రిగితే.. త‌మ‌కు కీల‌క‌మైన రాజ‌స్థాన్ లో ఇబ్బందిక‌ర పరిస్థితి త‌ప్ప‌ద‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే.. రాజ‌స్థాన్ ఎన్నిక‌లు చివ‌రి ద‌శ‌లో జ‌రిగేట్టు.. ఆఖ‌ర్లో జ‌ర‌గాల్సిన మిజోరం ఎన్నిక‌లు ముందుకు జ‌రిపిన‌ట్లుగా చెబుతున్నారు.

ముందుకు జ‌ర‌ప‌టం కేంద్రం చేతిలో లేన‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల సంఘానికి కేటాయించే భ‌ద్ర‌తా బ‌ల‌గాల నిర్ణ‌యం మోడీ స‌ర్కారు చేతుల్లోనే ఉంటుంది. ఆ అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్న మోడీ స‌ర్కార్‌.. ఈసీకి కేటాయించే బ‌ల‌గాల విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా ఈసీ షెడ్యూల్ మీద ప్ర‌భావం చూపిన‌ట్లుగా తెలుస్తోంది. కేంద్ర బ‌ల‌గాల్ని స‌ర్దుబాటును త‌మ‌కు త‌గ్గ‌ట్లుగా మార్చుకున్న మోడీ స‌ర్కారు.. ఈసీకి ఎప్పుడెప్పుడు ఎంత‌మేర భ‌ద్ర‌తా సిబ్బందిని ఇవ్వ‌గ‌ల‌మ‌న్న విష‌యాన్ని నివేదించ‌టం.. దీనిపై ఏమీ మాట్లాడ‌లేని ఈసీ.. అందుకు త‌గ్గ‌ట్లు ఎన్నిక‌ల షెడ్యూల్ ను మార్చిన‌ట్లుగా చెబుతున్నారు.