బాబు పైకి మోదీ కూడా ఎక్కేశారు!

Tue Jan 01 2019 22:26:25 GMT+0530 (IST)

టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ఇప్పుడు టైం అసలేమీ బాగోలేనట్టే ఉంది. గడచిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగిన చంద్రబాబు అమలు సాధ్యం కాని హామీలతో పాటు పవన్ కల్యాణ్ అభిమానాన్ని కూడా వినియోగించుకుని ఎలాగోలా అధికార పగ్గాలు చేపట్టారు. అయితే నాలుగేళ్ల పాటు అంతా సవ్యంగానే సాగిందన్న భావన కలిగించిన చంద్రబాబు... ఎన్నికలకు ఏడాది సమయం ఉందనగా... ప్రత్యేక హోదాను తెర మీదకు తెచ్చి బీజేపీని విలన్ గా చూపించేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదు... దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారని ఈ ప్యాకేజీ కారణంగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని - ఇక అంతా ప్రత్యేక హోదాను మరిచిపోవాల్సిందేనని చంద్రబాబు కాస్తంత గట్టిగానే చెప్పారు. అయితే ఈ మాటలు మాట్లాడిన నోటీతోనే ఆయన యూటర్న్ తీసుకున్నారు. అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో కలిసి ముందుకు సాగడం కుదరదని - ఇన్నాళ్లు మోసం చేసిన బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ బాబు కొత్త రాగం అందుకున్నారు.ఈ క్రమంలో ధర్మపోరాట దీక్షలు - నిరసనలు - జ్ఞాన భేరీలు - మీడియా సమావేశాలు... ఇలా ప్రతి వేదిక మీద నుంచి బీజేపీ సర్కారుపైనే కాకుండా ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ఇకపై కేంద్రంలో బీజేపీ అధికారంలకి రావొద్దని - బీజేపీ అధికారంలోకి వస్తే.. దేశం నాశనమవుతుందని - దేశాన్ని కాపాడాకేందుకే తాము ఇతర పార్టీలతో పొత్తులకు సిద్ధమవుతున్నట్లుగా ప్రకటించారు. ఆ క్రమంలోనే ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే టీడీపీ స్థాపన జరిగిందో... అదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మహా కూటమి పేరిట వెళ్లారు. అయితే టీడీపీ - కాంగ్రెస్ పార్టీల పొత్తును జనం ఛీకొట్టారు. రెండు పార్టీలకు నిజంగానే దారుణ ఫలితాలను ఇచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబుపై ఇప్పుడు వరుసగా దాడి జరుగుతోంది. ఆది నుంచి ఏపీలో విపక్ష నేత హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఎప్పటికప్పుడు చంద్రబాబుపై పక్కా ఆధారాలతోనే విమర్శలు కురిపిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా తమ వంతు వ్యాఖ్యలు సంధిస్తున్నారు. మొన్నటి మీడియా సమావేశంలో కేసీఆర్ అయితే ఏకంగా చంద్రబాబును బజారుకీడ్చేశారని చెప్పాలి. కేసీఆర్ సంధించిన విమర్శలకు ఇప్పటిదాకా చంద్రబాబు సరైన కౌంటరే ఇవ్వలేకపోయారు.

తాజాగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వంతు వచ్చింది. నేటి ఉదయం ఏఎన్ ఐ వార్తా సంస్థకు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో మోదీ చాలా అంశాలపై మాట్లాడారు.  ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ - చంద్రబాబుల ఆధ్వర్యంలో నిర్మితమవుతున్నాయని ప్రచారం జరుగుతున్న మహా కూటమి - ఫెడరల్ ఫ్రంట్ లపై వచ్చిన ప్రశ్నకు స్పందించిన మోదీ... చంద్రబాబుపై సూటిగానే విమర్శలు సంధించారు. చంద్రబాబు ఘోరంగా విఫలమైపోయారని - తెలంగాణ ఎన్నికల్లోనే ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని - ఇక కూటమి ఏ మేరకు రాణిస్తుందని మోదీ ప్రశ్నించారు. కేవలం తననున ఎదుర్కొనేందుకు మాత్రమే చంద్రబాబు కూటమి యత్నాలు చేస్తున్నారని కూడా మోదీ ఆరోపించారు. తననున ఎదుర్కొనేందుకు ఏకంగా సిద్ధాంతపరంగా వైరుధ్యాలున్న పార్టీలతో కూడా జట్టు కట్టేందుకు చంద్రబాబు వెనుకాడటం లేదని కూడా మోదీ లాజికల్ గా విమర్శలు గుప్పించారు.

సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీలు ఏకమవడాన్ని ప్రజలు తిప్పికొడతారని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కారణంగానే మహాకూటమి ప్రయోగం విఫలమైందని ఆయన తెలిపారు. ఫలితంగా బీజేపీ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు చేసిన తొలి ప్రయోగమే విఫలమైందని కూడా మోదీ కుండబద్దలు కొట్టారు. మహా కూటమి దిశగా సాగుతున్న చంద్రబాబుకు తొలి ప్రయోగమే విఫలమవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారని కూడా మోదీ వ్యాఖ్యానించారు. తనను ఎదుర్కోలేకే చంద్రబాబు... సిద్ధాంతాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పంచన చేరారని ప్రధాని మండిపడ్డారు. మొత్తంగా చంద్రబాబును నేరుగానే టార్గెట్ చేసిన మోదీ... తనదైన శైలిలో లాజికల్ గా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సంధించిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేక జట్టు పీక్కుంటున్న చంద్రబాబు... మరి మోదీ విమర్శలకు ఎలా స్పందిస్తారో చూడాలన్న విశ్లేషణలు సాగుతున్నాయి.