Begin typing your search above and press return to search.

మైనార్టీల మీద మోడీ కన్నేశారా?

By:  Tupaki Desk   |   26 Sep 2016 7:16 AM GMT
మైనార్టీల మీద మోడీ కన్నేశారా?
X
ప్రధాని న‌రేంద్ర‌ మోడీ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. అందరి ఊహలకు.. అంచనాలకు భిన్నంగా వ్యవహరించటం ఆయనకు అలవాటు. తాజాగా కేరళలోని కోజికోడ్ లో జరిగిన బీజేపీ జాతీయ మండలి సమావేశాల ముగింపు ప్రసంగంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. అయితే..అంతకుముందు రోజే మాట్లాడిన మోడీ.. పాక్ తో వార్ అంశంపై క్లారిటీ ఇచ్చేయటం మర్చిపోకూడదు. కోజికోడ్ వేదికగా మోడీ సమరశంఖాన్ని పూరిస్తారని భావిస్తే.. అందుకు భిన్నంగా ఆయన శాంతి వచనాలు పలకటమే కాదు.. పాక్ తో తాను చేసే యుద్ధం ఎలా ఉంటుందో చెప్పి అందరిని ఆశ్చర్యచకితుల్ని చేశారు. మోడీ ప్రసంగం ముందు వరకు దట్టంగా కమ్మినట్లుగా ప్రచారం సాగిన యుద్ధమేఘాల ముచ్చట నిజం కాదని తేలిపోయింది.

శనివారం పాక్ తో వార్ గురించి మాట్లాడిన మోడీ.. ఆదివారం దేని గురించి మాట్లాడతారన్న ఆసక్తి వ్యక్తమైంది. దీనికి తగ్గట్లే ఆయన సరికొత్త అంశాన్ని ప్రస్తావించారు. మైనార్టీలకు బద్ధ వ్యతిరేక పార్టీగా పేర్కొనే బీజేపీకి మైనార్టీల కడగండ్లు తీర్చే రాజకీయ పార్టీ ఇమేజ్ తీసుకొచ్చే బలమైన మొదటి అడుగు వేశారు. మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూడకుండా.. మనవారిగా చూడాలనే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మాటలకు తగ్గట్లుగా చూడాలన్న మాట మోడీ నోటి నుంచి వచ్చింది.

పండిట్ దీన్ దయాళ్ ఎవరని తనను కొందరు అడుగుతుంటారని.. అలా అడిగిన వారికి తాను గర్వంగా దీన్ దయాళ్ గురించి చెబుతానని.. ముస్లింల గురించి ఆయన చెప్పిన విషయాల్ని తాను చెబుతానని వెల్లడించారు. ‘‘కానుకలు ఇవ్వొద్దు. అలా అని ఛీత్కరించుకోవద్దు. వారికి సాధికారిత కల్పించండి. వాళ్లు విద్వేషానికి ప్రతీకలో.. ఓటు బ్యాంకు మార్కెటో కాదు. వారిని మీ వారిగా చూడండి’’ అంటూ దీన్ దయాళ్ చెప్పిన మాటల్ని మోడీ గుర్తు చేసుకున్నారు. ముస్లిం మైనార్టీల వ్యతిరేకిగా.. వారిని అద్యంతం ద్వేషించే వ్యక్తిగా తనపై ఉన్న ఇమేజ్ ను తొలగించేందుకు వీలుగా ఆయన తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నారని చెప్పాలి. మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ అలాంటిది కాదన్న అభిప్రాయం కలిగేలా.. సెక్యులర్ పంథాలోనే తాము నడుస్తామన్న అంశాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకు కోజికోడ్ వేదికను మోడీ వాడుకున్నారని చెప్పొచ్చు. ముస్లింలపై తన వైఖరిని స్పష్టం చేసిన మోడీని.. ఆ వర్గం ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.