మోడీ చరిత్ర తిరగరాస్తే..ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి

Fri Apr 27 2018 13:15:37 GMT+0530 (IST)

ఔను. ప్రదానిమోడీ చరిత్రను తిరగరాస్తే...ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. అందుకే ఆయన్ను ప్రజలు తిట్టుకుంటున్నారు. చదవడానికి వింతగా చిత్రంగా ఉందేమో కానీ...ఇది నిజంగా నిజం. ప్రధాని మరోమారు మనకు పాత మేలు అనే గుర్తుకు తెస్తున్నారు. ఎలా? అంటే నగదును బ్యాంకుల్లో వేసుకోకుండా! - దొంగలు వచ్చి దోచుకున్నా పర్లేదు..ఐటీ అధికారులు వచ్చి దాడి చేసినా పర్లేదు కానీ..బ్యాంకుల్లో మాత్రం వేసేది లేదు... ఆ చార్జీలతో మా నడ్డి విరగ్గొట్టుకునేది లేదు. అర్ధరాత్రుల్లు డబ్బుల కోసం పడిగాపులు కాసేది లేదంటూ స్పష్టంగా చెప్తున్నారు.  కరెన్సీ కష్టాలు మళ్లీ మొదలవడంతో జనాలు జాగ్రత్త పడుతున్నారు. చేతికొచ్చిన నగదును చేజారిపోనివ్వడం లేదు. మన తెలుగువాళ్ల సంగతే చూసుకోండి...గతకొద్ది నెలలుగా తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ లేగాక దేశంలోని చాలా రాష్ర్టాల్లో ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. నగదు కొరత దృష్ట్యా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నోట్ల ముద్రణను పెంచినా.. పరిస్థితులు చక్కబడటం లేదు. డిపాజిట్ల కంటే బ్యాంకుల్లో విత్ డ్రాలే ఎక్కువయ్యాయి మరి.ఆర్బీఐ తాజా వివరాల ప్రకారం ఈ నెల మొదటి మూడు వారాల్లో బ్యాంకుల నుంచి రూ.59520 కోట్ల నగదు ఉపసంహరణ జరిగింది. అంతకుముందు మూడు వారాల్లో ఇది రూ.16470 కోట్లుగా ఉండగా ఒక్క ఏప్రిల్ 20తో ముగిసిన వారం రోజుల్లోనే రూ.16340 కోట్లను జనాలు తిరిగి తీసేసుకోవడం గమనార్హం. ఇక ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.1.4 లక్షల కోట్ల నగదు ఉపసంహరణలు జరిగాయి. గతేడాది జనవరి-మార్చితో పోల్చితే ఇది దాదాపు 27 శాతం అధికం కావడం విశేషం. 2016 నవంబర్ 8 రాత్రి పాత పెద్ద నోట్ల (రూ.500 - 1000)ను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించిన సంగతి విదితమే. అయితే అప్పుడు చలామణిలో ఉన్న కరెన్సీ కంటే ఇప్పుడు సుమారు రూ.లక్ష కోట్లు ఎక్కువే ఉంది. ప్రస్తుతం రూ.18.90 లక్షల కోట్లకు సమానమైన కరెన్సీ మార్కెట్ లో ఉండగా - రద్దు సమయంలో ఉన్నది రూ.17.98 లక్షల కోట్లే. అయినప్పటికీ నగదు కొరత వేధిస్తోంది. నిరుడు అక్టోబర్ నుంచి నగదు ఉపసంహరణలు ఎక్కువవగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు కర్నాటక - మధ్యప్రదేశ్ - బీహార్ లలో సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. పరిస్థితి అదుపులోకి వస్తున్నదంటూ బ్యాంకులు చెబుతున్నా.. ఆ దాఖలాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

ఈ సమస్యకు ఆర్బీఐ ఓ కారణం చెప్తుండగా...సామాన్యుడు మరో కారణం చెప్తున్నాడు. ప్రస్తుతం ఏర్పడిన నగదు కొరత సమస్యకు మూల కారణం.. జనాలు మళ్లీ డబ్బు దాచేసుకుంటుండటమేనని ఖర్చు చేయకపోవడమేనని ఆర్బీఐ చెబుతున్నప్పటికీ నిశితంగా గమనిస్తే అసలు కారణాలు అనేకం బయటపడుతున్నాయి. ఎఫ్ఆర్‌డీఐ బిల్లుపై చెలరేగిన భయాందోళనలు - బ్యాంకుల్లో వెలుగుచూస్తున్న వరుస కుంభకోణాలు - మోసాలు - రుణ ఎగవేతలు.. ఈ నగదు ఉపసంహరణలకు ప్రధానంగా దోహదం చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే బ్యాంకుల్లో మన సొమ్ముకు భద్రత లేదన్న అభద్రతాభావం ఖాతాదారుల్లో నెలకొంది. వరుస పరిణామాలు ఆ భావనను బలపరుస్తూపోవడంతో ముందస్తు ఉపసంహరణలు పెరిగిపోయాయి. మరోవైపు ప్రజలు - వ్యాపారుల నుంచి బ్యాంకుల్లోకి డిపాజిట్లే కరువైపోయాయి.

ఆర్బీఐ పంపించే కొత్త నోట్లు మినహా.. బ్యాంకులకు నగదు పెద్దగా రావడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే రూ.2000 నోట్ల ముద్రణ ఆగిపోవడం కూడా ఈ సమస్యకు దారితీసింది. నిజానికి రోజుకు రూ.500 కోట్ల విలువైన రూ.500 నోట్లను ముద్రించే ఆర్బీఐ.. ఐదు రెట్లు పెంచి రూ.2500 కోట్ల మేర నోట్లను అచ్చువేస్తున్నది. అయితే కొన్ని రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలుండటంతో పెద్ద నోట్లన్నీ దాచేశారన్న అనుమానాలూ వ్యక్తమవుతుండగా ఆర్థిక సంవత్సరం ఆఖరుతో ఉద్యోగులకు జీతాలు - బోనస్ ల చెల్లింపులు ఉండటం ప్రజలు మళ్లీ డిజిటల్ పేమెంట్లను పక్కనబెట్టి - నగదు చెల్లింపులకే అలవాటు పడిపోవడం కూడా సమస్యను జఠిలం చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.