Begin typing your search above and press return to search.

దావోస్‌ లో మోడీ ఆవేద‌న భ‌రిత స్పీచ్

By:  Tupaki Desk   |   23 Jan 2018 12:55 PM GMT
దావోస్‌ లో మోడీ ఆవేద‌న భ‌రిత స్పీచ్
X
దావోస్‌ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ.. ఈ కీల‌క స‌ద‌స్సులో ప్రారంభ ఉప‌న్యాసం చేశారు. ఈ సంద‌ర్భంగా ఉద్విగ్నభ‌రితంగా ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబమని మోడీ వ్యాఖ్యానించారు. `వసుధైక కుటుంబం అనే భావనను.. అనాదిగా భారతదేశం కొనసాగిస్తుంది. అంటే ప్రపంచమంతా ఒకటే కుటుంబమని అర్థం. ప్రకృతితో మమేకమై జీవించడం భారత సంస్కృతిలోనే ఉంది. మనమంతా భూమాత సంతానం. భారతీయ శాస్ర్తాలు మనిషిని భూమి పుత్రునిగా పేర్కొంటున్నాయి..కానీ ఆ భూమినే ఇప్పుడు మనం నాశనం చేస్తున్నాం` అని ఆవేదన వ్యక్తం చేశారు. `పర్యావరణ మార్పులు భయపెడుతున్నాయి. మంచుతుపాన్లు ఏర్పడటం చూస్తున్నాం. ప్రస్తుత తరం సుఖం కోసం ప్రకృతిని విధ్వంసం చేయొద్దు` అని ప్ర‌ధాని కోరారు.

నాటికి నేటికీ భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సవాళ్లను అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడుదారులందరికీ భారత్ స్వాగతం పలుకుతోందన్నారు. అసాధారణ నిర్ణయాలతో వ్యాపార అనుకూల వాతావరణాన్ని మెరుగుపరుస్తూ వస్తున్నామని మోడీ స్పష్టం చేశారు. ఈ వేదిక ద్వారా భారత్‌ లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు.

20 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత ప్రధాని ప్రసంగించారు. దావోస్ సదస్సులో కడసారి 1997లో నాటి భారత్ ప్రధాని దేవెగౌడ ప్రసంగించినట్లు మోడీ గుర్తు చేశారు. 1997లో భారత్ జీడీపీ 400 బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపారు. నాటికి నేటికీ భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయన్న మోడీ.. 20 ఏళ్లలో భారత్ జీడీపీ 6 రెట్లు పెరిగిందని స్పష్టం చేశారు. పరస్పర ఆధారిత సమాజ అభివృద్ధిలో ఆర్థిక వేదిక సదస్సు చుక్కానిగా వ్యవహరిస్తోందన్నారు. స‌మ్మిళిత అభివృద్ధి అనేది 120 కోట్ల మంది భారతీయుల ఆశయమని మోడీ స్పష్టం చేశారు. ఆయుర్వేదం - యోగాను ప్రపంచానికి పరిచయం చేసిందే భారత్ అని తెలిపారు.

మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్నో సంస్కరణలు చేపట్టిందని గుర్తు చేశారు. సబ్‌కా సాత్ సబ్‌ కా వికాస్ అనేది బీజేపీ ప్రభుత్వ నినాదమని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం, ప్రజాస్వామ్యం మా దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భిన్న మతాలు, సంస్కృతులు, భాషల్ కలిగిన దేశంలో అందరినీ ఏకతాటిపై ప్రజాస్వామ్యం నిలుపుతోందని ప్ర‌ధాని మోడీ అన్నారు. అందుకే భారతీయ ప్రజాస్వామ్యం మాకొక రాజకీయ విధానమే కాదు.. మా జీవనశైలి అని మోడీ అన్నారు. స్వతంత్ర భారత ప్రస్థానంలో మొదటిసారిగా ఏకీకృత పన్ను విధానం జీఎస్టీనీ తీసుకువచ్చామని తెలిపారు.

ప్రపంచం సాంకేతికంగా ఎంతో ఎదుగుతోందని మోడీ పేర్కొన్నారు. `ప్రపంచంలో రోజు రోజుకు ఎన్నో మార్పులు వస్తున్నాయి. కొత్త కొత్త పరీక్షలను ఎదుర్కొంటున్నాం. టెక్నాలజీలో వస్తున్న మార్పులు ప్రపంచాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాయి. రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంతో మార్పు వచ్చింది. టెక్నాలజీ ప్రజల జీవితాలను పూర్తిగా మార్చేసింది. ప్రపంచ దేశాల ఆర్థికాభివృద్ధికి ఈ సదస్సు దోహదపడుతోంది. డేటాను గుప్పిట్లో పెట్టుకున్న వారే భవిష్యత్‌ ను శాసిస్తారు` అని ప్ర‌ధాని మోడీ అన్నారు. దేశాల మధ్య ఐక్యత లేకపోవడమే సమస్యలకు దారితీస్తుందన్నారు. విజ్ఞానం మంచితో పాటు చెడుకు కూడా కారణమవుతోందన్నారు. టెక్నాలజీతో కలిగే ఇబ్బందులను సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నామని తెలిపారు. ప్రపంచ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం వెతకాల్సి ఉందన్నారు మోదీ. సైబర్ పరిజ్ఞానం చెడు పనులకు వినియోగించకుండా నిరోధించడం సవాలుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన మాట - పని - అన్ని విషయాలను సాంకేతికత ప్రభావితం చేస్తోందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ప్ర‌ధాని మోడీ కోరారు. ప్రపంచానికి ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని మోడీ అన్నారు. యావత్ ప్రపంచానికి ఉగ్రవాదం పెనుసవాళ్లు విసురుతుందన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాద సమస్యను ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అవస‌రం ఉందన్నారు. విద్యావంతులైన యువకులు కూడా తీవ్రమైన భావజాలంతో ఉగ్రవాదానికి ప్రభావితమవుతున్నారని మోడీ ఆవేదన చెందారు.