Begin typing your search above and press return to search.

తమిళ ప్లాట్‌ఫాం సిద్ధం చేసుకుంటున్న మోడీ!

By:  Tupaki Desk   |   11 Nov 2017 5:30 PM GMT
తమిళ ప్లాట్‌ఫాం సిద్ధం చేసుకుంటున్న మోడీ!
X
దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తమిళనాడు రాజకీయాలు చాలా భిన్నమైనవి. ఇక్కడ ద్రవిడ పార్టీలు రాజ్యమేలాల్సిందే తప్ప.. జాతీయ పార్టీలకు తొలినుంచి కూడా స్థానం లేదు. మొత్తం తమిళ జాతిలోనే.. జాతీయ పార్టీల పట్ల ఒక విముఖతను - వారి ఉత్తరాదిపోకడల పట్ల ఏహ్యభావాన్ని నింపడంలో తొలితరం ద్రవిడ ఉద్యమ నాయకులు చాలా సక్సెస్ ఫుల్ అయ్యారు. ఇలాంటి నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అటు కాంగ్రెస్ గానీ - ఇటు భాజపా గానీ.. పాగా వేయడం అనేది అంత సులువు కాదు

కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా తన పార్టీ అస్తిత్వాన్ని స్థిరం చేయడానికి పావులు కదుపుతున్న మోడీ.. తమిళనాడు విషయంలో ఒక ప్రత్యేకమైన స్కెచ్ ప్రకారం వెళుతున్నారా అనిపిస్తోంది. తమిళనాడులో ప్రధానంగా రెండే పార్టీల మధ్య రాజకీయం నడుస్తుంటుంది. అన్నా డీఎంకే - డీఎంకేలే అధికారాన్ని ఒకరి తర్వాత ఒకరు పంచుకుంటూ ఉంటారు. వీరిలో డీఎంకే కాంగ్రెస్ జాతీయ కూటమిలో భాగంగా ఉంది. అన్నా డీఎంకే – భాజపా ఆశ్రయంలో ఉంది. కొత్త శక్తుల విషయానికి వస్తే కమల్ భాజపాకు వ్యతిరేకంగా ఉన్నా.. రజినీకాంత్ పార్టీ పెట్టినా పెట్టకున్నా భాజపాకు అనుకూలంగానే ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో మోడీ.. ఎటూ అన్నా డీఎంకే తమ చెంతనే ఉన్నది గనుక.. అటు డీఎంకేను కూడా దువ్వే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇటీవలి చెన్నై పర్యటనలో కరుణానిధికి పరామర్శ - స్టాలిన్ తో ఏకాంత భేటీ రకరకాల ఊహలకు తావిస్తున్నాయి.

అదంతా ఒక ఎత్తు అయితే జయలలిత నెచ్చెలి శశికళ ఆర్థిక మూలాలను నాశనం చేసేలా ఆస్తులపై జరిగిన ఐటీదాడులు మరో ఎత్తు. శశికళ ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. ఆ రకంగా తమిళనాట శశికళకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు లేకుండా... అవినీతి ముద్రను శాశ్వతం చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నంలో మోడీ చాలా వరకు సక్సెస్ అయ్యారు కూడా..! ఇక జయలలిత గానీ, అవినీతి ముద్రను మోసుకుంటూ జైల్లో గడుపుతున్న శశికళ గానీ.. ఎలాంటి ప్రభావం చూపించలేని రాజకీయాలు ఆ రాష్ట్రంలో తయారవుతాయి. ఎటూ అన్నాడీఎంకే తమ జేబులోనే ఉన్నది గనుక.. ఈసారి ఎన్నికలు వస్తే... భాజపాతో పొత్తులు కుదరవచ్చు. చెప్పుకోడానికి కాంగ్రెస్ కూటమిలో ఉన్నారు గానీ.. స్టాలిన్ అండ్ కో భాజపాకు కొంత లోపాయికారీ సహకారం అందించినా ఆశ్చర్యం లేదు. ఇలా భిన్నమైన వ్యూహాలతో వెళ్లి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట తమ ప్రాధాన్యం ఉండాలని, సీట్లు తగినన్ని గెలుచుకోవాలని.. భారతీయ జనతా పార్టీ తరఫున మోడీ వ్యూహాత్మకంగా కదులుతున్నారు. దక్షిణాదిలో పార్టీని విస్తరించే పర్వంలో ఇదంతా కీలకంగా అని భావించాలి.