మోదీ - బాబు!... ఇద్దరివీ తిట్లేనట!

Mon Feb 11 2019 09:41:56 GMT+0530 (IST)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ టూరు  ఇప్పుడు కొత్త తరహా చర్చకు తెర తీసిందని చెప్పాలి. ఇప్పటిదాకా తెలుగు నేల విభజన కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన నవ్యాంధ్రకు కేంద్ర ప్రభుత్వం ఏ మేర సాయం చేసిందన్న విషయంపై ఇటు నెగెటివ్ గా కొందరు - పాజిటివ్ గా మరికొందరు తమదైన వాదనలు వినిపించే వారు. ఇప్పుడు ఆ వాదనలను ఇరు వర్గాలు గాలికొదిలేయగా... ఇప్పుడు తిట్ట పర్వం దాని స్థానాన్ని ఆక్రమించిందని చెప్పక తప్పదు. అసలు ఏపీకి కేంద్రం ఏమేమి బాకీ పడిందన్న విషయాన్ని ఇటు టీడీపీ గానీ - ఇప్పటిదాకా ఏపీకి ఏమేం చేశాం - ఇంకా ఏమేం చేయబోతున్నామన్న విషయాన్ని అటు బీజేపీ చెప్పేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నువ్వు వెధవ అంటే... కాదు కాదు నువ్వే వెధవ అన్న చందంగా ఈ రెండు పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ తిట్ల పర్వం నేటి మోదీ ఏపీ టూర్ లో పతాక స్థాయికి చేరిందని చెప్పక తప్పదు.మోదీ ఏపీ టూర్ ను నిరసిస్తూ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగింది. ఈ నిరసనలను ఏమాత్రం పట్టించుకోని మోదీ నేరుగా గుంటూరు వచ్చేసి తాను ఏం చెప్పాలనుకున్నారో - ఆ విషయాలన్నింటినీ ఓసారి చదివేసినట్లుగా చదివేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మోదీ ఆసక్తికర కామెంట్లు చేశారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను సరిగ్గా ఖర్చు చేసే విషయాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు... తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో బాబు వైఖరిని తూర్పారబట్టేందుకే ప్రాధాన్యం ఇచ్చిన తనను తిట్టేందుకు తిట్లను వెదికేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో డిక్షనరీలోని అన్ని తిట్టను వెతికి మరీ చంద్రబాబు పట్టుకుంటున్నారని - డిక్షనరీలోని అన్ని తిట్లను ఇప్పటికే చంద్రబాబు తనపై ప్రయోగించారని చెప్పుకొచ్చారు. ఇప్పటిదాకా చంద్రబాబు తనపై చేసిన విమర్శలకు మనసు నొచ్చుకున్నానన్న ఫీలింగ్ వచ్చేలా కలరింగ్ ఇచ్చేసిన మోదీ... తన ప్రసంగాన్ని ముగించేసి వెళ్లిపోయారు.

ఇక ఆ వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు... ఏపీ టూర్ లో మోదీ ఉద్దేశం తనను తిట్టడమేనంటూ శోకాలు తీశారు. విజయవాడలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను ప్రారంభించే కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు... అలాంటి వేదిక మీద ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా - లేదా అన్న విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం తనను తిట్టిపోసేందుకే మోదీ ఏపీ పర్యటనకు వచ్చారని ఆరోపించారు. అంతటితో ఆగని చంద్రబాబు... తనను మోదీ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని - అయినా తాను సభ్యతను వీడలేనని చెబుతూనే... మోదీ సతీమణి ప్రస్తావన తీసుకుని వచ్చి... మోదీకి తానేమీ తీసిపోనని కూడా నిరూపించుకున్నారు. మొత్తంగా ఏపీ అభివృద్దిపై ఇద్దరు నేతలు పక్కా ఆధారాలతో ఒకరిపై మరొకరు విరుచుకుపడాల్సింది పోయి... ఇద్దరూ తిట్ల దండకాన్నే అందుకున్నారు. వెరసి ఇద్దరిదీ తిట్ల గోలే అనే భావన కలిగించారు.