Begin typing your search above and press return to search.

మోదీ, బాబు!... ఇద్ద‌రూ మోస‌గాళ్లే!

By:  Tupaki Desk   |   11 Feb 2019 8:22 AM GMT
మోదీ, బాబు!... ఇద్ద‌రూ మోస‌గాళ్లే!
X
నిజ‌మే అప్పుడెప్పుడో వ‌ర‌స‌గా వ‌చ్చిన సినిమాల పేర్లు ఇప్పుడు అదాటుగా గుర్తుకు వ‌స్తున్నాయి. మోస‌గాళ్ల‌కు మోస‌గాళ్లు, ఇద్ద‌రు మిత్రులు, ముగ్గురు మొన‌గాళ్లు... ఇలా మన తెలుగు హీరోలు డబుల్ రోల్స్‌, ట్రిబుల్ రోల్స్‌, మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు ఇప్పుడు మ‌న క‌ళ్ల ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి. సినిమాల్లో హీరోలు న్యాయం కోసం ప్ర‌య‌త్నించి ప్రాణాలు ప‌ణంగా పెట్టిన‌ట్టు న‌టిస్తే... నిజ జీవితంలో మ‌న‌కు ఇప్పుడు క‌నిపిస్తున్న న‌యా రియ‌లిస్టిక్ సినిమాలో మాత్రం రియ‌ల్ హీరోలుగా త‌మ‌ను తాము ప్రొజెక్ట్ చేసుకునేందుకు కిందా మీదా ప‌డుతున్న ఈ పొలిటిక‌ల్ హీరోలు ఒక‌రు ఓ మోస్త‌రు మోసం చేస్తే... మ‌రొక‌రు ఆయ‌న‌ను మించిన మోసం చేస్తున్నారు. అంతేనా... నాది మోసం కాదంటే... నాది మోసం కాదంటూ వ‌రుస ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటూనే... నువ్వు మోస‌గాడివంటే... కాదు నువ్వే మోస‌గాడివంటూ నిందించుకుంటూ సినిమాను ర‌క్తి క‌ట్టిస్తున్నారు. ఈ ఇద్ద‌రు హీరోలు హీరోలు మ‌రెవ‌రో కాదు... ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఒక‌రైతే... మ‌రొక‌రేమో టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు. ఏపీకి జ‌రిగిన అన్యాయంపై వీరిద్ద‌రూ చేస్తున్న‌ది ఇదేన‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇద్ద‌రూ బ‌హిరంగ వేదిక‌ల‌పై ఏపీ ప్ర‌జ‌ల‌కు హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని, రాష్ట్రం క‌ష్టాల క‌డ‌లి నుంచి గ‌ట్టెక్కుతుంద‌ని న‌మ్మ‌బ‌లికారు. జ‌నాల‌తో ఓట్లేయించుకున్నారు. మోదీ ప్ర‌ధాని అయితే, చంద్ర‌బాబు సీఎం పోస్టులో కూర్చున్నారు. ఆ త‌ర్వాత ఏపీ ప్ర‌జ‌ల‌కు నిజంగానే సినిమాను మ‌రిపించే రీతిలో క‌థ‌ను పండించారు. ముందుగానే సిద్ధం చేసుకున్ స్క్రీన్ ప్లే త‌ర‌హాలో ఇద్ద‌రూ ఓకే మాట‌గా సాగారు. ప్ర‌త్యేక హోదాను అట‌కెక్కించారు. ప్ర‌త్యేక ప్యాకేజీ అన్నారు. దానినీ మూల‌న ప‌డేశారు. ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు ప్ర‌శంస‌లు కురిపించుకున్నారు. నువ్వు వీరుడివంటే... నువ్వు న‌న్ను మించిన వీరుడివంటూ భుజాలు ఎగ‌రేసుకున్నారు. మోదీ కంటే ఓ రెండాకులు ఎక్కువ‌గా చ‌దివాన‌ని, ఆయ‌న కంటే కూడా రాజ‌కీయాల్లో సీనియ‌ర్‌ను అని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు... ఏకంగా మోదీని కీర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా పెట్టేశారు. ఆ త‌ర్వాతే అస‌లు క‌థ మొద‌లైపోయింది. సినిమాల్లో మాదిరే ఇద్ద‌రూ విడిపోయారు.

అప్ప‌టిదాకా తిట్టుకున్న నోళ్ల తోనే తిట్టేసుకున్నారు. ఇంకా తిట్టుకుంటున్నారు కూడా. క్లైమాక్స్ కు సినిమా చేరిపోయింద‌న్న విష‌యాన్ని గుర్తించారో, ఏమో తెలియ‌దు గానీ... సినిమాను మ‌రిపించే రీతిలో ఈ తిట్ల పురాణాన్ని తారా స్థాయికి తీసుకుపోయారు. ఈ క్ర‌మంలోనే నిన్న గుంటూరులో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... చంద్ర‌బాబుపై విరుచుకుపడితే... ఈ రోజు ఢిల్లీ వేదిక‌గా ఒక్క రోజు దీక్ష‌లో కూర్చున్న చంద్ర‌బాబు మోదీపై దండెత్తారు. ఈ ఇద్ద‌రూ ఎన్ని చేసినా... ఏపీకి మాత్రం ఇద్దరూ జాయింట్ గా క‌లిసే మోసం చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి సినిమాల్లో అయినా.. నిజ జీవితంలో అయినా మోసగాళ్ల‌కు శాస్తి జ‌రిగి తీరుతుంది క‌దా. మ‌రి అదే క్ర‌మంలో ఇప్పుడు అటు మోదీతో పాటు ఇటు బాబుకు కూడా త‌గిన శాస్తి చేసేందుకు ఏపీ ప్ర‌జ‌లు ఇప్ప‌టికే త‌మ ఓటు ఎవ‌రిక‌న్న విష‌యంపై ఓ క్లారిటీకి వచ్చి ఉంటార‌నే విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మ‌రో మూడు నెల‌ల్లో ఈ సినిమాకు ప్ర‌జ‌లే ముగింపు ప‌లుకుతార‌న్న వాద‌నా వినిపిస్తోంది.