ఎంత చించినా.. 160 సీట్లు దాటట్లేదుగా మోడీషా?

Mon Apr 15 2019 10:55:18 GMT+0530 (IST)

అంకెలు భలేగా అనిపిస్తుంటాయి కొన్నిసార్లు. ఆనందాన్నిచ్చే అంకెలు అంతకుమించి భయపెడుతుంటాయి. తాజాగా బీజేపీ బ్యాచ్ పరిస్థితి ఇదే తీరులో ఉంది. ఐదేళ్ల క్రితం ఇదే సమయానికి సమరోత్సాహంతో ఉరుకులు పరుగులు పెడుతూ.. యావత్ దేశం మొత్తం మోడీ.. మోడీ అనే పరిస్థితి.అందుకు తగ్గట్లే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తన ఐదేళ్ల పాలనలో ప్రధాని మోడీ అనుసరించిన విధానాలు ఇప్పుడా పార్టీకి శాపంగా మారటమే కాదు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ కూడా రాని పరిస్థితి. ఎంతగా లెక్కలేసుకున్నా అంకెలు ముందుకు కదలని పరిస్థితి.  పడిపోయిన గ్రాఫ్ పుణ్యమా అని.. ఈసారికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తక్కువగా చెబుతున్నారు.

తాజాగా పార్టీ వర్గాలు వేసుకుంటున్న అంతర్గత లెక్కల్లో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానికి సంబంధించి ఒక ఆసక్తికర వాదన వినిపిస్తోంది. గత ఎన్నికలకు భిన్నంగా బీజేపీ సొంతంగా 160 సీట్లను కూడా దాటలేని దుస్థితిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దక్షిణాదిన మహా అయితే పన్నెండు సీట్లు వస్తే ఎక్కువన్న మాట వినిపిస్తోంది.

అధికారం కోసం ఆశలు పెట్టుకున్న మోడీ పరివారం.. ఇప్పుడా భ్రమల నుంచి బయటకు వస్తున్నట్లుగా చెబుతున్నారు. మళ్లీ పవర్ మనదేనన్న దానికి భిన్నమైన పరిస్థితి నెలకొందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఏదో మాట వరసకు అన్నట్లు కాకుండా.. తాము చెబుతున్న మాటలకు బలం చేకూరేలా వాదనను వినిపిస్తున్నారు. అంకెల్ని చూపిస్తున్నారు.

ఇప్పుడున్న అంచనాల ప్రకారం చూస్తే.. ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఈసారి 30 సీట్లు రావటమే ఎక్కువగా చెబుతున్నారు. అఖిలేశ్.. మాయావతి.. కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో అధికార బీజేపీకి భారీ దెబ్బ పడటం ఖాయమని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే.. మధ్య ప్రదేశ్ లో 20.. గుజరాత్ లో 20.. రాజస్థాన్ లో 15.. బిహార్ లో 10.. కర్ణాకటలో 12.. మహారాష్ట్రంలోనూ 12 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక.. ఒడిశాలో 8.. పశ్చిమ బెంగాల్ లో 5.. అసోం.. జార్ఖండ్..  ఛత్తీస్ గఢ్.. హర్యానాలల్లో ఐదు సీట్లు.. హిమాచల్ ప్రదేశ్.. పంజాబ్.. జమ్ముకశ్మీర్.. ఢిల్లీల్లో రెండు సీట్లు చొప్పు.. ఉత్తరాఖండ్ లో మూడు సీట్లు.. ఇతర రాష్ట్రాల్లో 10 సీట్లు వచ్చే వీలుందంటున్నారు. ఇవన్నీ లెక్కేస్తే.. బీజేపీకి వచ్చే సీట్లు మొత్తం 160 ఫిగర్ దాటని పరిస్థితి.

వాస్తవ పరిస్థితితో పోలిస్తే.. కాసింత ఉదారంగా సీట్ల లెక్క వేస్తేనే ఈ మాత్రం సీట్లు వచ్చాయని.. అదే మరింత కరకుగా వేస్తే.. అవి కూడా రావంటున్నారు. అలాంటి వేళ.. మోడీ మరోసారి అధికారంలోకి రావటం సాధ్యం కాదన్న భావన కలగటం ఖాయం. తాజాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ అంకెలు కమలనాథుల్లో కలకలం రేపుతున్నాయి. మోడీ మాస్టారు సీన్లో ఉన్న తర్వాత కూడా వార్ వన్  సైడ్ కాకుండా.. ఇలాంటి అంకెలా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల గడువును ఇష్టారాజ్యంగా వాడేస్తే.. ఇలాంటి పరిస్థితే వస్తుందన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిందంటున్నారు.