Begin typing your search above and press return to search.

రెండో రోజూ బాదేందుకు వెనుకాడ‌ని మోడీ!

By:  Tupaki Desk   |   15 May 2018 5:01 AM GMT
రెండో రోజూ బాదేందుకు వెనుకాడ‌ని మోడీ!
X
ఓట్లు అడ‌గ‌టానికి వ‌చ్చిన‌ప్పుడు తియ్య‌గా మాట్లాడ‌టం రాజ‌కీయ నేత‌ల అవ‌స‌రం. అది కాస్తా పూర్తి అయ్యాక‌.. పాల‌కుల ద‌యాదాక్షిణ్యాల మీద ఆధార‌ప‌డ‌టం ప్ర‌జ‌ల అవ‌స‌రం. ఈ విష‌యాన్ని బాగా అర్థం చేసుకున్న పాల‌కులు దీర్ఘకాలం అధికారంలో కొన‌సాగుతారు. అందుకేనేమో.. మోడీ మీద సామాన్యుడిలో వ్య‌తిరేక‌త ఉంద‌ని మీడియా సంస్థ‌లు అదే ప‌నిగా చెబుతున్నా.. ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి మాత్రం మోడీ ప‌రివారానికి అధికారాన్ని అప్ప‌జెప్పేందుకు ఓట‌ర్లు వెనుకాడ‌టం లేదు.

క‌ర్ణాట‌క‌లో పాగా వేయాల‌ని క‌ల‌లు క‌న్న మోడీకి.. ఇప్పుడా క‌ల నిజం అయిన‌ట్లేన‌ని చెప్పాలి. ఇప్ప‌టివ‌ర‌కూ వెల్ల‌డైన అధిక్య‌త‌ల్ని చూస్తే.. ఇదే ట్రెండ్ కొన‌సాగితే ప‌వ‌ర్ మోడీదే. ఆ విష‌యంలో మారో మాట‌కు తావు లేదు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల కోసం దాదాపు 19 రోజుల పాటు పెట్రోల్‌.. డీజిల్ బాదుడ్ని నిలిపివేసిన మోడీ స‌ర్కారు.. నిన్న‌టి నుంచి భారం మోపుతున్న సంగ‌తి తెలిసిందే.

19 రోజులు ధ‌ర‌లు పెంచ‌కుండా ఉన్న దానికి బ‌దులుగా.. ఆ లోటును స‌రిదిద్దే ప‌నిలో మోడీ స‌ర్కారు ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. దీనికి తోడు.. అధికారాన్ని అప్ప‌జెప్పేందుకు ఓట‌ర్లు సిద్ధంగా ఉన్నార‌న్న విష‌యం క‌న్న‌డ ప్ర‌జ‌లు కూడా స్ప‌ష్టం చేస్తున్న వేళ‌.. మోడీ ప‌రివారం రెట్టించిన ఉత్సాహంతో బాద‌కుండా ఉంటారా?

పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని నిన్న (సోమ‌వారం) పెంచిన త‌రహాలోనే.. ఈ రోజు (మంగ‌ళ‌వారం) కూడా అదే స్థాయిలో బాదుడ్ని బాదేయ‌టం క‌నిపిస్తోంది. క‌ర్ణాట‌క ప‌లితాలు ఓ ప‌క్క వెలువ‌డుతూ.. బీజేపీ చేతికి అధికార ప‌గ్గాలు ఖాయ‌మ‌న్న విష‌యం క‌న్ఫ‌ర్మ్ అవుతున్న వేళ‌లోనూ.. సామాన్యుల న‌డ్డి విరిచేలా.. మ‌ధ్య త‌ర‌గ‌తి జీవి మైండ్ బ్లాక్ అయ్యేలా పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు పెంచేస్తూ నిర్ణ‌యాన్ని తీసేసుకున్నారు.

పెట్రోల్ లీట‌రు ధ‌ర‌కు 15పైస‌లు పెంచ‌గా.. డీజిల్ ధ‌ర లీట‌రుకు 22 పైస‌లు చొప్పున పెరిగింది. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధ‌ర 56 నెల‌ల గ‌రిష్ఠానికి చేరుకున్న‌ట్లైంది. డీజిల్ ధ‌ర‌లు కూడా ఇదే పరిస్థితి. తాజా పెంపుతో పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు రికార్డుస్థాయికి చేరుకున్న‌ట్లైంది. ఇదే జోరు మ‌రో రెండు.. మూడు నెల‌లు సాగితే లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.100కు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌న్న మాట వినిపిస్తోంది. న‌చ్చి ఓట్లు వేసి మ‌రీ అధికార ప‌గ్గాలు అప్ప‌జెబుతున్న‌ప్పుడు మోడీ సార్ దేశ క్షేమం కోసం ధ‌ర‌లు పెంచ‌కుండా ఉండ‌లేరు క‌దా.