Begin typing your search above and press return to search.

వాళ్లను చూస్తేనే మోడీకి వణుకెందుకు?

By:  Tupaki Desk   |   18 May 2019 4:20 AM GMT
వాళ్లను చూస్తేనే మోడీకి వణుకెందుకు?
X
2014 మే 16 లోక్ సభ ఫలితాలు వచ్చిన రోజు.. మోడీ బీజేపీని ఏకపక్షంగా గెలిపించిన రోజు.. అప్పుడు దేశపగ్గాలు చేజిక్కించుకున్న మోడీ.. ఇప్పటివరకు అంటే.. 2019 మే 17 వరకూ కూడా ఆ ధైర్యం చేయలేదు.. విలేకరుల సమావేశం నిర్వహించి నిర్భయంగా వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు.. విలేకరులన్నా... వారి ప్రశ్నలన్నా మోడీకి ఎందుకు అంత భయమో అర్థం కావడం లేదు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని ఊదరగొట్టే మోడీజీ.. ప్రజాస్వామ్యయుతంగా సంధించే విలేకరుల ప్రశ్నలను ఎదుర్కోవడంలో అంత భయమెందుకో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ మీడియా ఫోబియా ఆయన్ను వెంటాడింది. గుజరాత్ సీఎంగా మూడు సార్లు వరుసగా నరేంద్ర మోడీ కొనసాగారు. మోడీ హయాంలో గుజరాత్ లో గోద్రా అల్లర్లు సహా మైనార్టీలపై ఎన్నో దాడులు జరిగాయి. హత్యలు చోటుచేసుకున్నాయి. దీని వెనుక మోడీ ఉన్నారన్న విమర్శలున్నాయి. ఒకవర్గం వారినే మోడీ కాపుకాశారన్న విమర్శ ఉంది. విలేకరులను ఎదుర్కోవడానికి... వారి ప్రశ్నలను కాచుకోవడానికి మోడీ సీఎంగా ఉన్నప్పుడు కూడా సాహసించేవాడు కాదు.. మొదటి సారి మోడీ 2007లో సీఎన్ ఎన్ ఐబీఎన్ అనే ఓ స్వతంత్ర అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అదీ భయంభయంగానే.. ఇంటర్వ్యూ చేసేది పేరు మోసిన కరణ్ థాపర్ అనే బీకర జర్నలిస్టు.. ఆయన ప్రశ్నలకు మోడీ ఇంటర్వ్యూ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. మోడీచేత నీళ్లు తాగించాడు అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ స్వతంత్ర జర్నలిస్టును మోడీ దగ్గరకు రానీయడం లేదు.

మోడీ ప్రధానిగా గెలిచాకా.. ఈ ఐదేళ్లలో శుక్రవారం ఒక్కరోజు మాత్రమే విలేకరులను ఎదుర్కొన్నాడంటే ఆయన భయాన్ని అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకుడంటే అందరినీ ఎదుర్కోవాలి.. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.. కానీ ఒక దేశ ప్రధాని మీడియాకు దూరంగా ఉండడం ఏ దేశ చరిత్రలో చోటుచేసుకోలేదు. మౌనముని మన్మోహన్ సైతం చాలా సార్లు విలేకరుల ముందుకు వచ్చి వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చేవారు. అమిత్ షాతో కలిసి వచ్చిన మోడీ తాము గెలుస్తున్నామని ఢిల్లీలో నిర్వహించిన తాజా విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చాడు. విలేకరులు ప్రశ్నలు వేయగా.. ఇది బీజేపీ అధ్యక్షుడు నిర్వహిస్తున్న సమావేశమని.. క్రమశిక్షణ గల కార్యకర్తను తాను అని.. అందుకే మీడియా ప్రశ్నలకు జవాబు ఇవ్వనని మోడీ తప్పించుకోవడం విశేషం. రాఫెల్ పై ప్రశ్న విసిరిన ఓ జర్నలిస్టును కాచుకోవడానికి కూడా భయపడ్డాడంటే మోడీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో అమిత్ షానే సర్ధి చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది..

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రశంసలను - విమర్శలను హుందాగా తీసుకున్నప్పుడే అసలైన రాజకీయ నాయకుడంటారు. దేశానికి ప్రధానిగా ఐదేళ్లలో ఒక్కసారి మాత్రమే మోడీ విలేకరుల ముందుకొచ్చాడు. అదీ ఈ ఎన్నికల్లో తేడా కొట్టిన వేళ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మోడీ విలేకరుల ముందుకు రావడం విశేషం. అయితే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా అమిత్ షా చాటు బిడ్డగా వెనక దాక్కోవడం మీడియాలో హైలెట్ అయ్యింది. మోడీ ధీరత్వం వెనుకే కానీ.. ముందర కాదని ఈ తాజా విలేకరుల సమావేశంతో తేటతెల్లమైంది.