Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్షాలంటూ..న‌ర‌సింహ‌న్ కొత్త ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   21 Jun 2018 2:19 PM GMT
ప్ర‌తిప‌క్షాలంటూ..న‌ర‌సింహ‌న్ కొత్త ర‌చ్చ‌
X
తెలుగు రాష్ర్టాల గవర్నర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశార‌ని మీడియా వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఇప్ప‌టికే ప‌లు వ‌ర్గాలు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు అయితే..గ‌వ‌ర్న‌ర్ వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై సైతం ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు స‌హ‌జం కానీ..గ‌వ‌ర్న‌ర్‌ ను కూడా ఈ రొంపిలోకి లాగ‌డం ఏంటి? అని ప‌లువురు అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంద‌ర్భాలు ఉండ‌గా...తాజాగా గ‌వ‌ర్నర్ న‌ర‌సింహ‌న్ సైతం ఇదే త‌ర‌హా కామెంట్లు చేశార‌ని మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ హ‌ఠాత్తుగా గురువారం నారాయణగూడలో తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌ ను సంద‌ర్శించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం అక్క‌డే ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మంచి ఆరోగ్యం ఉంటేనే అంతా బాగుంటార‌ని అన్నారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ దేశంలోనే ఉత్తమమైందని కితాబిచ్చారు.ఇకపై సర్కార్ దవాఖానాలపై బ్రేకింగ్ న్యూస్ ఏవీ ఉండవని భావిస్తున్నానని గవర్నర్ పేర్కొన్నారు. నిజంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. సర్కార్ వైద్యాన్ని గుడ్డిగా విమర్శించడం సరికాదని గవర్నర్ అన్నారు. ఆస్పత్రుల్లో సదుపాయాలు పరిశీలించిన తర్వాతనే విమర్శించాలని గవర్నర్ సూచించారు. మార్చురీల విషయంలో కూడా కొన్ని మార్పులు తీసుకువస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పనితీరును స్వయంగా పరిశీలించే అభినందిస్తున్నాన‌ని గవర్నర్ స్పష్టం చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి కానీ… ప్రతీ దానికి విమర్శించడం సరికాదన్నారు. తాను గవర్నమెంట్ మీద ఆధారపడటం లేదన్నారు. గ్రామాల్లోకి వెళ్లి పరిస్థితులను పరిశీలించానని చెప్పారు. ప్రతిపక్షాలకు తాను ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుందని గవర్నర్ నరసింహన్ ఆక్షేపించారు. గవర్నర్ గుడికి పోయినా రాద్ధాంతం చేస్తున్నారని, గుడికి వెళ్లడం తప్పేం కాదని నరసింహన్ ఆగ్రహం వెలిబుచ్చారు. కాగా, గ‌వ‌ర్న‌ర్ ప్ర‌తిప‌క్షాలు అంటూ కామెంట్లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. రాజ్యాంగబ‌ద్దంగా కీల‌క స్థానంలో ఉన్న వ్య‌క్తి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఏమిట‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.