Begin typing your search above and press return to search.

చినబాబు కోటరీకే రెండు ఎంపీ సీట్లా?

By:  Tupaki Desk   |   25 Feb 2018 2:23 PM GMT
చినబాబు కోటరీకే రెండు ఎంపీ సీట్లా?
X
తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్త సెగపొగలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. తెలుగుదేశానికి దక్కబోయే రెండు సీట్లను ఎవరికి కట్టబెడతారు? అనే మీమాంస సహజంగానే పార్టీలో ముమ్మరగా నడుస్తోంది. సాధారణంగా రాజ్యసభ ఎంపీ సీట్లు అంటే పార్టీకి సుదీర్ఘకాలం సేవలందించిన సీనియర్లకు - లేదా పార్టీకి ఇతరత్రా ఉపయోగపడగల వారికి ఇస్తూ ఉంటారు. అయతే ఈ సారి సాంప్రదాయానికి భిన్నంగా అనూహ్యమైన రీతిలో కొత్త మొహాలను తెరమీదికి తేబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రధానంగా చినబాబు మంత్రాంగం పనిచేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు.

లోకేష్ అత్యంత ఆంతరంగికులు - విశ్వసనీయులు అయిన వారికి రాజ్యసభ ఎంపీ పదవులు దక్కనున్నాయనేది అమరావతి పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా పుకారు. అయితే సాధారణంగా ఆబ్లిగేషన్లు ఒకటి కన్సిడర్ చేసి.. పార్టీ ప్రమాణాల ప్రకారం రెండో పదవిని మరొకరికి ఇవ్వడం జరుగుతుంటుంది. ఇలాంటివి కొత్త కాదు. కానీ ఈ దఫా తెదేపాకి దక్కేదే రెండు సీట్లయితే.. ఆ రెండింటినీ లోకేష్ అనుయాయులకే ఇవ్వడానికి రంగం సిద్ధమవుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ పుకార్ల ప్రకారం.. లోకేష్ కు ఆప్తులైన రాజేష్ - అభీష్టలకు ఎంపీ పదవులు దక్కనున్నాయనేది సమాచారం. వీరిలో అభీష్ట ఢిల్లీ స్థాయిలో కేంద్రంతో లాబీయింగ్ చేయడానికి పార్టీకి బాగా ఉపయోగపడతాడనేది.. ఆయనను ఎంపిక చేయడానికి సంబంధించిన కారణంగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం భాజపాను ఎలా ప్రసన్నం చేసుకోవాలనే పనిలో హస్తినలో అభీష్ట కీలకంగా చక్రం తిప్పుతున్నాడని కూడా ఒక వాదన వినిపిస్తోంది.

అయితే, తెలుగుదేశం పార్టీకి దక్కేదే రెండు సీట్లు. గతంలో రెండుసార్లు ఒక్కొక్క సీట్ ను భాజపా ఆబ్లిగేషన్ కు కట్టబెట్టేశారు. ఈసారి ఏదో భాజపా తో రిలేషన్ సక్రమంగా లేదు గనుక.. రెండూ తమకే దక్కుతాయని తెదేపా నేతలు ఆశలు పెట్టుకుంటూ ఆ రెండింటినీ గద్దల్లాగా తన్నుకుపోవడానికి లోకేష్ కోటరీ సిద్ధమవుతోందనే ఊహాగానాలు పలువురికి షాక్ ఇస్తున్నాయి. ఆ రకంగా జరిగితే గనుక.. ఏకంగా పార్టీకి రాజీనామా చేసేసి తమ నిరసన తెలపాలని పలువురు భావిస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. మరి ఈ వ్యవహారం ఎలా - ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.