సుహాసిని కోసం నారా రోహిత్ దిగాడు

Thu Dec 06 2018 21:23:27 GMT+0530 (IST)

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బుధవారమే తెరపడింది. తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడితో పాటు నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారం చేశారు. ముఖ్యంగా కూకట్ పల్లి బరిలో ఉన్న నందమూరి సుహాసిని కోసం వీళ్లిద్దరూ గట్టిగానే ప్రచారం చేశారు. ఆ నియోజకవర్గంలో సుహాసిని గెలుపును తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుహాసిని సోదరులైన కళ్యాణ్ రామ్.. జూనియర్ ఎన్టీఆర్ లతో ప్రచారం చేయించడానికి గట్టి ప్రయత్నమే జరిగినా వాళ్లు తలొగ్గలేదు. ప్రచారానికి రాలేదు. ఐతే చంద్రబాబు సోదరుడి తనయుడైన నారా రోహిత్ సైతం ప్రచారానికి రాకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే.ఐతే నేరుగా ప్రచారం చేయకపోయినా.. ఆన్ లైన్లో మాత్రం సుహాసిని విజయం కోసం కృషి చేస్తున్నాడు రోహిత్. ఫేస్ బుక్ ద్వారా సుహాసిని మద్దతుగా పోస్టింగ్స్ పెడుతూ.. ఆమెను గెలిపించాలని కూకట్ పల్లి ఓటర్లను కోరుతున్నాడు రోహిత్. తెదేపా భాగస్వామి అయిన ప్రజా కూటమికి మద్దతుగానూ అతడి పోస్టింగ్స్ ఉంటున్నాయి. ఓవైపు సినిమా వాళ్లెవ్వరూ అధికార టీఆర్ ఎస్ పార్టీ మీద విమర్శలు చేయడానికి భయపడుతుంటే.. రోహిత్ మాత్రం విమర్శలు గుప్పించడం విశేషం. టీఆర్ ఎస్ పార్టీది అవకాశ వాద రాజకీయమని రోహిత్ పేర్కొనడం గమనార్హం. తెలంగాణ ఎన్నికల ప్రచారం అధికారికంగా బుధవారమే ముగిసినప్పటికీ రోహిత్ మాత్రం గడువు దాటాక కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం సాగిస్తుడటం విశేషం.