చంద్రబాబుకు బిరుదు ప్రదానం చేసిన లోకేష్

Sun Jan 14 2018 14:13:38 GMT+0530 (IST)

చంద్రబాబునాయుడు పేరుకు ఏపీ ముఖ్యమంత్రే గానీ.. ఆయన ఇతరత్రా డిజిగ్నేషన్లు బిరుదుల మీద చాలా మోజు చూపిస్తుంటారు. ముఖ్యమంత్రి కంటె మించిన బాధ్యతలు ఏవో తాను నిర్వర్తిస్తున్నట్లుగా.. ఆ కోణంలోంచి తనకు గుర్తింపు కావాలన్నట్లుగా ఆయన ఆరాటపడిపోతూ ఉంటారు. గతంలో తొమ్మిదేళ్ల పాటూ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన కాలంలో అయితే.. తనను మీడియాలో ఎవరైనా ఏపీ ముఖ్యమంత్రి అని రాయడం కంటె.. ఏపీ సీఈవో అని రాస్తేనే చంద్రబాబు నాయుడు మురిసిపోయే వారనే సంగతి అందరికీ తెలుసు. ఆ క్రమంలో చంద్రబాబునాయుడుకు ఆయన తనయుడు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. తాజాగా ఓ కొత్త బిరుదును ప్రదానం చేశాడు. చంద్రబాబు ఏపీ రాష్ట్రానికి ‘బ్రాండ్ అంబాసిడర్’ అని లోకేష్ చాటిచెప్పారు.బిరుదుల మాటకొస్తే.. కొత్తగా మళ్లీ 2014 లో సీఎంగా కొలువుదీరిన తర్వాత చంద్రబాబుకు చాలా బిరుదులే దక్కాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనిపించుకున్నారు. వివిధి దేశాలు తిరిగి రోడ్ షోలు నిర్వహించి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుల్లో స్టాల్ నిర్వహించి.. సదరు స్టాల్ మార్కెటింగ్ మెన్ లాగా కూర్చుని వచ్చిపోయే వారందరికీ ఏపీలో పరిశ్రమలకు ఉన్న అద్భుతావకాశాల గురించి వివరిస్తూ ఆయన రోజులు గడిపారు. ఆ తర్వా పోలవరం ప్రాజెక్టు పుణ్యమాని ఆయన ‘కన్సల్టెంట్’ అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రానికి చెందినది కాగా..  పనుల నిర్వహణ నేను చేపడతానంటూ అత్యుత్సాహం ప్రదర్శించి.. అనేక అవాంతరాలకు కారణమవుతూ.. ఆయన ‘కన్సల్టెంట్’ హోదాను సంపాదించుకున్నారు.. అనే అభిప్రాయాలు ఇప్పటిదాకా ప్రజల్లో ఉన్నాయి. తాజాగా పుత్రుడు లోకేష్.. తండ్రికి సంక్రాంతి సందర్భంగా కొత్త బిరుదు కూడా ఇచ్చేశారు. ఆయనే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అట!

అయినా బ్రాండ్ అంబాసిడర్ అనే హోదా సీఎం పదవికంటె గొప్పదని లోకేష్ అనుకున్నారో ఏమో అర్థం కావడం లేదు. సాధారణంగా కంపెనీలకు ఉండే బ్రాండ్ అంబాసిడర్లు ఆర్థికలబ్ధికోసం కాంట్రాక్టు మాట్లాడుకుని అది ముగిసే దాకా ఆ కంపెనీని పొగిడి ఆ తర్వాత.. ఏ కంపెనీ ఎక్కువ డబ్బిస్తే ఆ కంపెనీకి మారిపోతుంటారు. లోకేష్ మాటల ప్రకారం.. చంద్రబాబు కూడా అంతేనా... అని ఈ మాటలు విన్న జనం నవ్వుకుంటున్నారు.