Begin typing your search above and press return to search.

ఏపీ స‌మ‌స్య‌ల‌పై షాకు అవ‌గాహ‌న లేద‌న్న లోకేశ్‌

By:  Tupaki Desk   |   24 March 2018 9:04 AM GMT
ఏపీ స‌మ‌స్య‌ల‌పై షాకు అవ‌గాహ‌న లేద‌న్న లోకేశ్‌
X
మాట‌కు మాటే స‌మాధానం అన్న‌ట్లుగా ఉంది ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితి. నిన్న‌టి వ‌ర‌కూ మిత్రులుగా ఉన్నోళ్లు ఇప్పుడు అందుకు భిన్నంగా రియాక్ట్ అవుతున్న తీరుతో ఏపీ రాజ‌కీయాలు ఇప్పుడు వేడెక్కాయి. ఎన్డీయేకు గుడ్ బై చెప్పిన నేప‌థ్యంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు బాబు లేఖ రాయ‌టం.. దీనికి బ‌దులుగా షా కౌంట‌ర్ లేఖ రాయ‌టం తెలిసిందే.

ఏపీకి ఏమీ చేయ‌లేద‌ని.. ఇచ్చిన హామీల్ని నిల‌బెట్టుకోలేద‌ని బాబు ఆరోపిష్తే.. తాము చాలా చేశామ‌ని.. కానీ బాబు స‌ర్కారు స‌రిగా రియాక్ట్ కాలేద‌ని అమిత్ షా త‌న ఎనిమిది పేజీల లెట‌ర్ లో వివ‌రించారు. అంతేకాదు.. ప‌లు ప‌థ‌కాల కోసం కేటాయించిన నిధుల్ని స‌రిగా వాడ‌లేద‌న్న ఆరోప‌ణ చేశారు.

అమిత్ షా లేఖాస్త్రం ఏపీ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ‌.. చిన‌బాబు సీన్లోకి వ‌చ్చారు. ఏపీ స‌ర్కారుపై అమిత్ షా రాసిన‌ లేఖను చూస్తే.. ఆయ‌న‌కు రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న లేద‌న్న‌ది అర్థ‌మ‌వుతుంద‌న్నారు. ఏపీలో జ‌రిగిన ప‌నుల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు యుటిలైజేష‌న్ స‌ర్టిఫికేట్ కేంద్రానికి పంపుతున్న‌ట్లుగా చెప్పారు.

అయిన‌ప్ప‌టికీ హోదాకు.. యూసీకి అస్స‌లు సంబంధం లేద‌న్నారు. హోదాతో స‌హా 18 హామీల అమ‌లుకు యూసీ అవ‌స‌ర‌మా? అని ప్ర‌శ్నించిన లోకేశ్‌.. ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు రావ‌టం ఆవేశ‌పూరిత నిర్ణ‌యంగా షా చెబుతున్నార‌ని.. కానీ మంత్రుల ప‌ద‌వుల‌కు రాజీనామా చేశాక కూడా ఎన్డీయే కూట‌మిలోనే కొన‌సాగిన విష‌యాన్ని గుర్తు చేశారు.

ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌ల గురించి.. వారి ఆకాంక్ష‌ల గురించి.. వారి అసంతృప్తి గురించి ఎన్నోసార్లు ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లిన త‌ర్వాతే సీఎం త‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌న్నారు. అమిత్ షా లేఖ‌పై త్వ‌ర‌లోనే పూర్తిస్థాయిలో నివేదిక పంపుతామ‌ని చెప్పిన లోకేశ్‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే స్పందిస్తార‌ని చెప్పారు. అయినా.. చిన‌బాబు మాట‌లు ఒక‌లా.. బాబు మాట‌లు మ‌రోలా ఉంటాయా ఏమిటి?