నాన్న లోకేశా.. మనమిప్పుడు పవర్లో లేం!

Thu Jun 27 2019 15:46:09 GMT+0530 (IST)

ప్రత్యర్థిపై ఇంకా ఐదేళ్లు పోరాడాల్సిన సమయం ఉంది. ఒకపక్క ఆట ఇప్పుడే మొదలైన పరిస్థితి. ఇలాంటప్పుడు అట స్వరూపం ఎలా మారుతుందో క్లారిటీ రాని వేళలో.. చేతిలో ఉన్న అస్త్రాల్ని పొదుపుగా వాడాల్సిన వేళ.. తొందరపాటుతో వ్యవహరిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయం చినబాబుకు ఇంకా అర్థమైనట్లు లేదు.వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో చినబాబు ఉడికిపోతున్నారు. చేతిలో పవర్ ఉన్నప్పుడు ఎడాపెడా నిర్ణయాలు తీసుకొని.. అన్నింట్లోనూ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న వేళ.. అనవసరమైన వ్యాఖ్యలతో కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకోవటం మినహా మరింకేమీ ఉండదు. అయితే.. ఈ లాజిక్ ను లోకేశ్ మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చంద్రబాబుపై వేసిన 26 కమిటీలు బాబుకు క్లీన్ చిట్ ఇచ్చాయని.. ఆ విషయం తెలీక జగన్ ఏదో మాట్లాడుతున్నారంటూ ఆవేశ పడిపోతున్నారు లోకేశ్.

వైఎస్ విచారణ కమిటీలు వేసిన తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని ఎవరినో ఎందుకు తెలుగుదేశం బీట్ చూసే సీనియర్ రిపోర్టర్లతో కూర్చొని పావు గంట మాట్లాడితే చాలా విషయాల మీద క్లారిటీ వచ్చేస్తుంది. అలాంటి పని చేయకపోగా.. రెచ్చగొట్టే తరహాలో మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు.

మీ బాబు.. మా బాబుపై 26 కమిటీలు వేశారు.. అవినీతి ముద్ర వేయాలని అడ్డదారులు తొక్కారు.. చివరకు ఆయన తరం కాలేదు. ఇప్పుడు మీ తరం కాదు. వంశధారపై మీరు వేసిన కమిటీ రూపాయి అవినీతి జరగలేదని నివేదికిచ్చిందంటూ లోకేశ్ మాటలు వినేందుకు బాగానే ఉన్నా.. ప్రాక్టికల్ గా చూసినప్పుడు అనవసరమైన ఇబ్బంది తప్పదని చెప్పాలి.

ఎందుకంటే.. నిన్నటికి నిన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో జగన్ మాటలు వింటే.. బాబు ప్రభుత్వం తప్పు చేసిందన్న విషయం అంతో ఇంతో అర్థమైపోతుంది. ఇక.. విచారణ కమిటీ దృష్టిసారించిన తర్వాత రిపోర్ట్ ఏ తీరులో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. బయటకు కనిపిస్తున్న విద్యుత్ ఒప్పందాలు ఒక్కటి చాలు.. బాబు ఇబ్బందుల్లో ఇరుక్కోవటానికి.

ఇక.. అమరావతి రాజధాని భూముల కేటాయింపు విషయంలో ఇప్పటికే ఉన్న డేటాలోనే బోలెడన్ని తప్పులు కనిపిస్తాయి. అలాంటిది వెతికి చూస్తే.. వీపు విమానం మోగే తప్పులు కనిపించటం కాయం. ఇలాంటి వేళ తొందరపాటుతో ట్వీట్ల మీద ట్వీట్లు చేయటం ద్వారా.. రేపొద్దున ప్రత్యర్థులు విసిరే సవాళ్లకే కాదు.. బడాయిగా పోస్ట్ చేసిన ట్వీట్లకు బదులు చెప్పాల్సిన బాధ్యత తన మీదే ఉంటుందన్న విషయాన్ని లోకేశ్ మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎవరో ఒకరు కలుగజేసుకొని లోకేశ్ కు తత్త్వం బోధిస్తే బెటరేమో?