Begin typing your search above and press return to search.

లోకేష్ వర్సెస్ అనిల్ కుమార్ యాదవ్.. కాకరేపారు..

By:  Tupaki Desk   |   18 July 2019 9:01 AM GMT
లోకేష్ వర్సెస్ అనిల్ కుమార్ యాదవ్.. కాకరేపారు..
X
ప్రతిపక్ష నేత చంద్రబాబు తనయుడు నారాలోకేష్, ఏపీ యువ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఏపీ శాసనమండలిలో విద్యామండలిలో నిధుల అక్రమాలపై వాడివేడి చర్చ జరిగింది. విద్యాశాఖ మంత్రి సురేష్ టీడీపీ హయాంలో అక్రమాలు జరిగాయని.. దోచుకున్నారని.. నిధులు మళ్లించారని సభలో ప్రస్తావించారు. బ్రిటీష్ కౌన్సిల్ కు 7కోట్లు, జ్ఞానభేరి కార్యక్రమానికి 5.4 కోట్లు చంద్రబాబు అప్పనంగా ఇచ్చారని ఆరోపించారు. మొత్తం 180 కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డారని గత టీడీపీ ప్రభుత్వంపై ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ మండిపడ్డారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నారా లోకేష్ సభలో వైసీపీ తీరును ఎండగట్టారు. సీఎం వైఎస్ జగన్ 16 నెలలు జైళ్లో ఉన్నారంటూ లోకేష్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు లొల్లి చేశారు.

దీంతో అక్కడే ఉన్న ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిని మందలగిరి అని.. జయంతిని వర్ధంతి అన్న లోకేష్ లాంటి వాళ్లు గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉండడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. లోకేష్ కు మాతృభాష లో ట్రైనింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉందంటూ అనిల్ కుమార్ యాదవ్ సెటైర్ వేశారు.

అర్ధరాత్రి అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం కాళ్లు పట్టుకొని వైఎస్ జగన్ పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని మంత్రి అనిల్ కౌంటర్ ఇచ్చారు.

మంత్రి అనిల్ వ్యాఖ్యలను లోకేష్ ఖండించారు. వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాధారాలు లేకుండా ఇలా ఆరోపణలుచేయడం మంచిది కాదని.. వెంటనే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లోకేష్ మండలిలో కోరారు.