Begin typing your search above and press return to search.

లోకేశ్ సెటిల్ మెంట్..నేతలకు షాక్ ట్రీట్ మెంట్

By:  Tupaki Desk   |   27 July 2016 7:20 AM GMT
లోకేశ్ సెటిల్ మెంట్..నేతలకు షాక్ ట్రీట్ మెంట్
X
టీడీపీ యువనేత లోకేశ్ కు కోపమొచ్చింది. పార్టీలో నేతల కుమ్ములాటలు తన వరకు రావడంతో పిలిచి ఫుల్లుగా కోటింగు ఇచ్చారు. అంతర్గత కలహాలతో అట్టుడుకున్న ప్రకాశం తెదేపాలో కొత్తగా డిసిసిబి అవిశ్వాస వ్యవహారం లోకేశ్ కు ఆగ్రహం తెప్పించింది. తమ పార్టీకే చెందిన ఇద్దరు నేతలు ఒకొకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుని - అవిశ్వాసం వరకూ వెళ్లడంతో రంగంలోకి దిగిన లోకేశ్ ముందుగా జిల్లా మంత్రి - జిల్లా అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాంలో నేతల మధ్య రాజీ కుదర్చాలని ఆదేశించారు. దీంతో వైస్ చైర్మన్ రాజీనామా లేఖ చూపి డిసిసిబి చైర్మన్‌ ను బుజ్జగించి గండం నుంచి గట్టెక్కారు. అయితే.. ఈ వ్యవహారంలో ట్విస్టేంటంటే.. పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు పాత ఎమ్మెల్యేలపై తొలిసారి విజయం సాధించినట్టయింది. ఇది ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిగ్గా మారింది. లోకేశ్ చేసిన సెటిల్ మెంటు దెబ్బకు పాత నేతలకు దెబ్బపడినట్లయింది.

ప్రకాశం జిల్లా డిసిసిబి చైర్మన్ ఈదర మోహన్-వైస్ చైర్మన్ మస్తానయ్య మధ్య కొద్దికాలం నుంచి అంతర్గత పోరు జరుగుతోంది. ఈ క్రమంలో వీసీ మస్తానయ్య అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ చైర్మన్ - రాష్ట్ర సహకారశాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా - 10వ తేదీన అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చారు. దానితో రంగంలోకి దిగిన మంత్రి శిద్దారాఘరరావు - కరణం బలరాం - డి.జనార్దన్ - ఎమ్మెల్యే సాంబశివరావులు మంత్రి బొజ్జలను కలసి అవిశ్వాసం లేకుండా స్టే తీసుకువచ్చారు. దానిపై ఆగ్రహించిన చైర్మన్ మోహన్ కోర్టుకెళ్లారు. మంత్రి ఇచ్చిన స్టే వర్తించదని - మళ్లీ అవిశ్వాసం పెట్టాలని అధికారులను ఆదేశించగా - మంగళవారం అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. దీంతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యాన వైసీపీ నుంచి చేరిన గొట్టిపాటి రవి - అశోక్‌ రెడ్డి - రామారావు కలసి ఈ వ్యవహారంపై తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్‌ కు ఫిర్యాదు చేశారు. ఒకే పార్టీకి చెందిన నేతపై కుట్ర చేస్తున్నారంటూ చైర్మన్ మోహన్‌ కు మద్దతుగా నిలిచారు. దీనితో పాతకొత్త నేతల మధ్య పోరు మొదలయింది.

నిజానికి కరణం బలరాం - జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌ కు విబేధాలున్నాయి. కొత్త ఎమ్మెల్యేలకు జనార్దన్ మద్దతునిస్తున్నప్పటికీ, డిసిసిబి వ్యవహారంలో మాత్రం జనార్దన్ - మంత్రి రాఘవరావు - కరణం బలరాం అందరూ కలిసి వీసీ మస్తాన్‌ కు బాసటగా నిలిచారు. పార్టీ పరువు బజారుకెక్కే పరిస్థితి రావడంతో రంగంలోకి దిగిన లోకేష్.. మంత్రి శిద్దా - జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తక్షణం చైర్మన్-వైస్ చైర్మన్ మధ్య రాజీ కుదిర్చి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. దానితో విధిలేని పరిస్థితిలో సోమవారం జనార్దన్ చైర్మన్ మోహన్‌ తో చర్చించారు. నెలరోజుల తర్వాత వైస్ చైర్మన్‌ తో రాజీనామా చేయిస్తామని చెప్పి, మంగళవారం ఉదయానికి వైస్ చైర్మన్ ఇచ్చిన రాజీనామా లేఖను చైర్మన్‌ కు చూపించడంతో ఆయన శాంతించారు. దీంతో ఈ వ్యవహారంలో వైసీపీ నుంచి వచ్చిన నేతల మాటే నెగ్గినట్లయింది.