Begin typing your search above and press return to search.

'నంది' గోల‌పై చిన‌బాబు సెటైర్లు విన్నారా?

By:  Tupaki Desk   |   20 Nov 2017 11:50 AM GMT
నంది గోల‌పై చిన‌బాబు సెటైర్లు విన్నారా?
X
ఏపీ స‌ర్కారు ప్ర‌క‌టించిన నంది అవార్డుల‌పై ఇప్పుడు న‌వ్యాంధ్ర‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగానూ పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. ఓ కులానికి చెందిన వారికే అవార్డులిచ్చారంటూ మ‌రో వ‌ర్గానికి చెందిన సినిమా వాళ్లు రోడ్డెక్క‌డంతో ఈ వివాదం రేగిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా ఒకేసారి మూడేళ్ల‌కు సంబంధించిన అవార్డుల‌ను ఒకేసారి ప్ర‌క‌టించ‌డం కూడా ఈ వివాదానికి తెర లేసిన‌ట్లుగా కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు స‌ర్కారును టార్గెట్ చేస్తూ దూసుకొచ్చిన విమ‌ర్శ‌ల‌పై... ఏపీలో అధికార పార్టీ టీడీపీకి చెందిన కీల‌క నేత‌లెవ్వ‌రూ కూడా పెద్ద‌గా స్పందించిన దాఖ‌లా లేదు. ఎందుకంటే... ఈ గోల‌లో వేలు పెడితే ఎక్క‌డ ఇరుక్కుపోతామోన‌న్న భ‌యం కూడా టీడీపీ నేత‌ల నోటికి తాళ‌మేసింద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. అయితే టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న ఏపీ పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఎట్ట‌కేల‌కు ఈ వివాదంపై స్పందించేశారు.

అమ‌రావ‌తిలోని అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన సంద‌ర్భంగా లోకేశ్ దీనిపై స్పందించారు. ఈ స్పంద‌న కూడా ఏదో సాదా సీదాగా ఉందనుకోవ‌డానికి అస్కారం లేదు. ఎందుకంటే... త‌మ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్న వారిని నేరుగా టార్గెట్ చేసిన వారిపై ఘాటు వ్యాఖ్య‌లు సంధిస్తూ లోకేశ్ చేసిన విమ‌ర్శ‌లు నిజంగానే ఆస‌క్తిక‌రంగా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా ఈ వివాదంపై లోకేశ్ చేసిన వ్యాఖ్య‌లేమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఏపీలో ఆధార్ - ఓట‌ర్ కార్డు లేని వారు కూడా ప్ర‌త్యేక హోదా - నంది అవార్డుల‌పై విమ‌ర్శ‌లు చేస్తే ఎలా? అని లోకేశ్ ముందుమాట‌తోనే కాక రేపార‌నే చెప్పాలి. నంది అవార్డుల విషయాన్ని కొందరు రాద్దాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 3 ఏళ్ళకు ఒకేసారి అవార్డులు ఇవ్వడాన్ని కూడా రాద్దాంతం చేస్తున్నారని లోకేష్ అన్నారు. హైద్రాబాద్‌ లో కూర్చొని విమర్శలు చేస్తున్నారన్నారు. నంది అవార్డుల విషయమై వస్తోన్న విమర్శలపై సీఎం చంద్రబాబు బాధపడ్డారని లోకేష్ గుర్తు చేశారు.

నంది అవార్డుల జ్యూరీలో ఉన్న వాళ్ళు కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయ‌న‌ ఆరోపించారు. నంది అవార్డుల‌పై విమ‌ర్శ‌లు చేస్తోంది ఇద్ద‌రు, ముగ్గురు మాత్ర‌మేన‌ని కూడా లోకేష్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఇదే అద‌నుగా విప‌క్ష నేత‌ల‌ను టార్గెట్ చేసిన లోకేశ్... త‌న‌దైన శైలిలో సెటైర్లు సంధించారు. ధర్నాలు నిర్వహించేందుకు ఫ్లైయిట్లలో విజయవాడకు వస్తున్నారని, ఆంద్రాకు సంబంధం లేని వాళ్ళు ఆరోపణలు చేయ‌డ‌మేమిట‌ని కూడా లోకేశ్ ప్ర‌శ్నించారు. అనవసరంగా రచ్చ చేయడం సరైందికాదన్నారు. ప్రత్యేక హోదా కోసం విజయవాడలో ధర్నాలు నిర్వహిస్తే ఏం ఉపయోగమని లోకేష్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేయాలని కూడా ఆయ‌న విప‌క్షాల‌కు ఉచిత స‌ల‌హా ప‌డేశారు. మ‌రి లోకేశ్ విమ‌ర్శ‌ల‌పై ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు ఎలా స్పందిస్తారో చూడాలి.