చినబాబు ఆస్క్స్!...అవినీతిపై ఆధారాలున్నాయా?

Mon Feb 11 2019 09:51:06 GMT+0530 (IST)

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా ఏపీ కేబినెట్ లో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్... ఇప్పుడు తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఆదిలో మాట తడబడినా... ఇప్పుడు బాగానే నిలదొక్కుకున్నట్లుగానే కనిపిస్తున్నారు. తనపైకి దూసుకువస్తున్న ఆరోపణలను ఇతరుల సాయం లేకుండానే డిఫెండ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ టూర్ లో ప్రధాని నరేంద్ర మోదీ తనపై సంధించిన విమర్శలను లోకేశ్ తిప్పికొట్టారు.మోదీ ఏపీ టూర్ కు నిరసనగా మొత్తం పై నుంచి కింది దాకా నలుపు రంగు దుస్తుల్లోనే దర్శనమిచ్చిన లోకేశ్... తిరుపతి వేదికగా మోదీ కామెంట్లపై విరుచుకుపడ్డారు. మోదీ ఆరోపిస్తున్నట్లుగా తాను గానీ - తన పార్టీ టీడీపీ గానీ అవినీతి చేసిందని ఒక్క ఆధారమైనా చూపిస్తారా? అంటూ లోకేశ్ తనదైన శైలిలో ప్రశ్నను సంధించారు. ఈ క్రమంలోనే తన విద్యాభ్యాసం దగ్గర నుంచి మొదలుపెట్టిన ఆయన తాను ఉద్యోగ పర్వం - ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశాలను  కూడా ప్రస్తావించారు. విదేశాల్లో విద్యనభ్యసించిన తాను... రెండేళ్లు ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం కూడా చేశానని చెప్పుకొచ్చారు.

ప్రజాసేవ కోసం అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని లోకేశ్ తెలిపారు.  రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని.. ఎంతటి వారైనా ఎదిరించి తీరుతామని మండిపడ్డారు. ప్రజలంతా స్వచ్ఛందంగా వారికి జరిగిన అన్యాయంపై రోడ్లపైకి వచ్చారని లోకేశ్ పిలుపునిచ్చారు. మొత్తంగా తాను అవినీతికి పాల్పడ్డానంటూ మోదీ చేసిన విమర్శలపై లోకేశ్ తనదైన శైలిలో స్పందించి వైరి వర్గాల నోట మాట రాకుండా చేశారని చెప్పాలి.