ఓటమిపై చినబాబు ఎలా రియాక్ట్ అయ్యారంటే?

Fri May 24 2019 13:32:24 GMT+0530 (IST)

పోటాపోటీగా జరిగినట్లు కనిపించిన ఏపీ ఎన్నికలు వార్ వన్ సైడ్ అన్న విషయం ఫలితాల వెల్లడి వేళలో అందరికి అర్థమైంది. అయితే.. కొన్ని నియోజకవర్గాల్లో చివరి రౌండ్ వరకూ ఉత్కంట రేపుతూ.. గెలుపు మీదా?  మాదా? అన్నట్లుగా దోబూచులాడింది.  ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అలా ఉత్కంట రేపిన చాలా స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించటం చూస్తే.. గెలుపు వారి పక్కనే ఉందని చెప్పాలి.మల్లాది విష్ణు వర్సెస్ బొండా ఉమ ఎన్నిక దీనికి ఉదాహరణ. కేవలం 15 ఓట్ల తేడాతో బొండా ఉమ ఓటమిపాలయ్యారు. ఇక.. ఏపీలో అందరి దృష్టిని ఆకర్షించిన కొన్ని నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్ ఈ స్థానం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో నిలవటంతో తుది ఫలితంపై అందరిలోనూ ఆసక్తి వ్యక్తమైంది.

స్థానికంగా బలమైన నేతగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంచిపేరుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కావటంతో పాటు పలు సంక్షేమ కార్య్రమాలు చేపట్టిన నేతగా అక్కడి ప్రజల్లో మంచి పేరుంది. దీనికి తోడు తాజాగా వీసిన ఫ్యాన్ గాలితో తుది ఫలితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావటం.. మంత్రి హోదాలో ఉన్న లోకేశ్ ఓటమి పాలు కావటం తెలిసిందే.

ఈ ఎన్నికల ఫలితంపై కాస్తంత ఉత్కంట నెలకొంది.  రౌండ్ రౌండ్ కి మారుతున్న ఫలితం నేపథ్యంలో.. తుది ఫలితం ఏమవుతుందన్న టెన్షన్ ఉన్నా.. చివరికి లోకేశ్ ఓటమి ఖాయమైంది.ఆళ్ల చేతిలో దాదాపు ఐదు వేల ఓట్ల పైచిలుకు తేడాతో ఓటమిపాలయ్యారు. తొలిసారి బరిలోకి దిగిన లోకేశ్.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో స్థానిక అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా పోటీ చేశారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఓటమి నేపథ్యంలో లోకేశ్ ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. తన ఓటమిపై తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పిన ఆయన.. ఎక్కడా వ్యక్తిగత విమర్శకు తావివ్వలేదు. హుందాగా ఉన్న ఆయన పత్రికా ప్రకటన చూస్తే..  ``మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా నాపై గెలిచిన వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిగారికి నా అభినందనలు. నాపై అత్యంత విశ్వాసంతో ఓట్లు వేసిన ప్రజలందరికీ నా నమస్కారాలు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నాను. నామినేషన్ వేసిన నుంచీ కౌంటింగ్ వరకూ అహర్నిశలు నా కోసం శ్రమించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
 
తొలిసారిగా ఎన్నికలలో పోటీచేసిన నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రుల సహకారం మరువలేనిది. ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు సహకరించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలిచారు. నియోజకవర్గ పార్టీ నాయకులు - కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను.  మంగళగిరి అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను. ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడతాను. మీ నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి`` అంటూ ముక్తాయించారు. దారుణమైన ఓటమి ఎదురైన వేళ.. ఇంతకు మించి ఏమని చెప్పగలరు చెప్పండి?