రాజధానిలో లోకేష్ పర్యటన.. మిస్టరీ!

Thu Sep 14 2017 16:57:28 GMT+0530 (IST)

ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ బాబు గురువారం జరిపిన పర్యటన తీవ్ర వివాదం రేపేదిగా మారింది. రాజధాని ఆకృతుల డిజైన్ ను రూపొందిస్తున్న  నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో లోకేష్ భేటీ అవడమే కాకుండా.. వారితో కలిసి రాజధాని ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో మీడియాను అస్సలు అనుమతించలేదు. పైగా లోకేష్ ఇప్పుడు ప్రైవేటు కార్యక్రమంలో ఉన్నారని భద్రతా సిబ్బంది చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి రాజధాని భూములు - నిర్మాణం - ఆకృతులు వంటి అంశాలకు మంత్రి లోకేష్ కు ఎలాంటి సంబంధం లేదు.

ఇది కేవలం సీఆర్ డీఏ పరిధిలో ఉన్న ప్రాంతం కావడంతో సీఆర్ డీఏ మంత్రి - లేదా అధికారులు లేదా సీఎం చంద్రబాబు వంటి వారు మాత్రమే నార్మన్ పోస్టర్ సంస్థ ప్రతినిధులతో భేటీ అవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడు లోకేష్ ఆ ప్రతినిధులతో గంటల తరబడి భేటీ కావడం అనంతరం నిడమర్రు ప్రాంతంలో ప్రత్యేకంగా వారిని తీసుకుని వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించడం దీనిని ప్రైవేటు కార్యక్రమంగా పేర్కొంటూ.. మీడియాను అనుమతించకపోవడం వంటి పరిణామాలు తీవ్ర అనుమానాలకు ఆస్కారం ఇస్తున్నాయి. ఇప్పటికే రాజధాని భూములపై సర్వత్రా విమర్శలు ఉన్న నేపథ్యంలో సీఎం తనయుడిగా ఉన్న లోకేష్ ఇలా వ్యక్తిగత వ్యవహారంమంటూ ప్రజా రాజధానిలో పర్యటించడం వివాదానికి దారితీస్తోంది.

నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన అసెంబ్లీ భవనం డిజైన్ కు సీఎం చంద్రబాబు బుధవారమే ఆమోదం తెలిపారు. అయితే హైకోర్టు భవనం డిజైన్‌పై ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పలు మార్పులు సూచిస్తూ..  చంద్రబాబు దీనిపై పలు సూచనలు చేశారు. నార్మన్ ఫోస్టర్ బృందం వెలగపూడి సచివాలయంలో సీఎంకు తుది డిజైన్లపై ప్రజెంటేషన్ ఇచ్చింది. శాసనసభ హైకోర్టు భవనాల అంతర్గత నిర్మాణ ప్రణాళిక బాగుందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శాసనసభ భవనాన్ని వజ్రాకృతిలో - హైకోర్టు భవనాన్ని బౌద్ధ స్థూపాకారంలో డిజైన్ చేసింది. ఈ నేపథ్యంలో నార్మన్ ప్రతినిధులతో లోకేష్‌కి ఏం పని అని కొందరు తమ్ముళ్లే ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. మొత్తానికి ఈ మిస్టరీ భేటీ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.