Begin typing your search above and press return to search.

బాబు ఓడితే!...లోకేశ్ చాప్ట‌ర్ క్లోజే!

By:  Tupaki Desk   |   21 Feb 2019 10:29 AM GMT
బాబు ఓడితే!...లోకేశ్ చాప్ట‌ర్ క్లోజే!
X
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఏపీ కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ భ‌విష్య‌త్తు గురించి ఇప్పుడు భారీ చ‌ర్చే న‌డుస్తోంది. త‌మ‌దీ ఓ జాతీయ పార్టీనే అని చెప్పుకుంటున్న ఆ పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... ఓ జాతీయ పార్టీ అధినేత కుమారుడిగా లోకేశ్ చ‌ట్ట‌స‌భ‌ల ఎంట్రీపై స‌రైన లెక్క‌లు వేయ‌లేక‌పోయార‌న్న వాద‌న ఇప్ప‌టికే వినిపిస్తోంది. ప్ర‌త్య‌క్ష పోరుతో కాకుండా లోకేశ్ కు దొడ్డిదారిన ఎమ్మెల్సీగా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ప్రవేశం క‌ల్పించ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదురైన సంగ‌తి తెలిసిందే. అయితే ఇదంతా జ‌రిగిపోయిన విష‌యంగా అనుకుంటే... ఇక జ‌ర‌గాల్సిన విష‌యం ఇప్పుడు ఆస‌క్తి క‌లిగిస్తోంది. మ‌రో రెండు నెలల్లో ఏపీ అసెంబ్లీతో పాటుగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రనున్నాయి. ఈ ఎన్నిక‌లు ఇటు నారా ఫ్యామిలీకే కాకుండా మొత్తంగా టీడీపీకే చావో రేవో అన్న వాద‌న వినిపిస్తోంది.

ఈ ఎన్నిక‌ల్లో టీడీపీకి గెలుపు ద‌క్కుతుందా? లేదంటే ప‌రాజ‌యం ప‌ల‌క‌రిస్తుందా? అన్న విష‌యంపైనే ప్ర‌ధానంగా లోకేశ్ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్ప‌క తప్ప‌దు. చాలా కాలం క్రిత‌మే టీడీపీ నేత‌గా యాక్టివేట్ అయిన లోకేశ్... చ‌ట్ట‌స‌భ‌ల్లో ఎంట్రీకి మాత్రం చాలా స‌మ‌యాన్నే తీసుకున్నార‌ని చెప్పాలి. గ‌డ‌చిన ఎన్నిక‌ల కంటే ముందుగానే టీడీపీలో యాక్టివేట్ అయిన లోకేశ్... ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష పోటీకి వెనుకంజ వేశారు. ఎక్క‌డ నిలిచినా ఓట‌మి త‌ప్ప‌దేమోన‌న్న బెంగ‌తోనే లోకేశ్ ను చంద్ర‌బాబు బ‌రిలోకి దించేందుకు వెనుకాడార‌న్న వాద‌న లేక‌పోలేదు. అయితే 2019 ఎన్నిక‌ల దాకా ఆగ‌లేని చంద్ర‌బాబు... మ‌ధ్య‌లోనే ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చేసి త‌న కుమారుడిని మంత్రిగా చేసుకున్నారు. ఈ తొంద‌ర‌పాటుతో చంద్ర‌బాబు త‌న‌ను తాను అభాసుపాలు చేసుకోవ‌డంతో పాటుగా లోకేశ్ స‌త్తా పైనా అనుమానాలు రేకెత్తేలా చేశార‌ని చెప్పాలి.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకుని ఆ త‌ర్వాత ఏడాదికో - రెండేళ్ల‌కో త‌న కుమారుడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు ఇప్పుడు పావులు క‌దుపుతున్నార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయితే ఈ ఎన్నిక‌ల్లో టీడీపీకి విజ‌యావ‌కాశాలు పెద్ద‌గా లేవ‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. ఇప్ప‌టిదాకా జ‌రిగిన స‌ర్వేల‌న్నీ కూడా ఏపీలో విప‌క్షం వైసీపీ విన్నర్‌ గా నిలుస్తుంద‌ని - ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ టీడీపీ ఆ పార్టీకి క‌నీస పోటీ కూడా ఇవ్వ‌లేద‌ని తేల్చేశాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ ప‌రాజ‌య‌మే ఎదురైతే... లోకేశ్ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్టుగానే చెప్పాలి. ఎందుకంటే... మాట తీరులో గానీ - వ్య‌వ‌హారం చ‌క్క‌బెట్ట‌డంలో గానీ చంద్ర‌బాబుకు ఉన్న నేర్ప‌రిత‌నంలో లోకేశ్ కు పైసా వంతు కూడా లేద‌నే చెప్పాలి. రాజ‌కీయాల్లో ఇవే కీల‌కమైన నేప‌థ్యంలో లోకేశ్ నెట్టుకురావ‌డం క‌ష్ట‌మే.

అంటే... ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడితే... లోకేశ్ త‌ట్టాబుట్టా స‌ర్దుకోవాల్సిందే. అలా కాకుండా టీడీపీ ఈ ఎన్నిక‌ల్లో విన్న‌ర్ గా నిలిస్తే మాత్రం లోకేశ్ కు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే... 2024 ఎన్నిక‌లు వ‌చ్చేలోగా లోకేశ్ కు ఓ మోస్త‌రు అనుభ‌వంతో పాటుగా ప్ర‌త్య‌ర్థులు మ‌రింత వీక్ అవుతారు. ఈ క్ర‌మంలో లోకేశ్ నిల‌దొక్కుకునేందుకు లోకేశ్ కు మంచి అవ‌కాశం ల‌బించిన‌ట్టే. ఆ అవ‌కాశాన్ని లోకేశ్ స‌ద్వినియోగం చేసుకుంటారా? లేదా? అన్న విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే.. ఇప్ప‌టికిప్పుడు లోకేశ్ భ‌విష్య‌త్తుకు వ‌చ్చిన ఇబ్బందేమీ లేద‌నే చెప్పాలి. అలా కాకుండా టీడీపీ ఓట‌మిపాలైతే మాత్రం లోకేశ్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు మాత్రం ముగిసిపోయినట్టేన‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.